ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి
1 min read– జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: జిల్లాలో పట్టబద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్ సంబంధిత అధికారులకు సూచించారు.శుక్రవారం కలెక్టరేట్ లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారీయతో కలిసి జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్ ఆర్డీవోలు తహసిల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…. అన్నమయ్య జిల్లాలో పట్టభద్రులు, ఉపాధ్యాయ, ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. మార్చి 13వ తేదీన జరిగే ఈ ఎన్నికలలో ఎటువంటి చిన్నపాటి సమస్యకు తావు లేకుండా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఎన్నికలు జరిగే మండలాలకు సెన్సిటీవ్, హైపర్ సెన్సిటీవ్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి తగు చర్యలు చేపట్టాలని ఆర్డీవోలకు సూచించారు. పోలింగ్ స్టేషన్లలో అవసరమైన అన్ని వసతులు ఉండేటట్లు చూడాలన్నారు. ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి పోలింగ్ సామాగ్రి, స్ట్రాంగ్ రూము, డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ కౌంటర్లు, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్ల విషయంలో పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనల మేరకు ఎన్నికల మోడల్ కోడ్ ప్రతి ఒక్కరు పాటించాలన్నారు. సెన్సిటీవ్, హై సెన్సిటీవ్ పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి ఆయా కేంద్రాలకు తగు భద్రతా సిబ్బందిని నియమించడం జరుగుతుందన్నారు.ప్రతి పోలింగ్ కేంద్రానికి వీడియోగ్రాఫర్, మైక్రో అబ్సెర్వర్ లను, రూట్ ఆఫీసర్లు, సెక్టోరల్ ఆఫీసర్లు, లైజన్ ఆఫీసర్లను నియమించాలన్నారు. ఎన్నికల విధులు నిర్వహించేవారు గతంలో నిర్వహించిన ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. పోలింగ్ స్టేషన్ల వారీగా అవసరమైన బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ ఓ సత్యనారాయణ, ఆర్డీవోలు రాయచోటి, మదనపల్లె, రంగస్వామి, మురళి కలెక్టరేట్ ఏవో బాలకృష్ణ, తహసిల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.