PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోండి

1 min read

– సచివాలయ సర్వీసులను పెంచడానికి ఎంపిడిఓలు నిత్యం సమీక్షలు నిర్వహించుకోవాలి : జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవడంతో పాటు సచివాలయ పరిధిలో సర్వీసులను పెంచడానికి గాను ఎంపిడిఓలు నిత్యం సచివాలయ సిబ్బందితో సమీక్ష సమావేశాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.శనివారం గోనెగండ్ల మండలం అల్వాల గ్రామంలోని లేఅవుట్, కులుమాల గ్రామంలోని గ్రామ సచివాలయం మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు అల్వాల గ్రామంలోని మంజూరైన ఇళ్ల నిర్మాణాలు గురించి హౌసింగ్ సిబ్బందిని అడుగగా మొత్తం 95 ఇళ్లు మంజూరు చేశారని, వాటిలో బేస్మెంట్ లెవెల్ 69, బిలో బేస్మెంట్ లెవెల్ 20, రూఫ్ లైడ్ 3, రూఫ్ కాంక్రీట్ దశలో 2, ఒక ఇంటి నిర్మాణం పూర్తి అయ్యిందని హౌసింగ్ సిబ్బంది జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయిన వాటికి వెంటనే మౌలిక సదుపాయాలు అందించడం వల్ల నిర్మాణాలు వేగవంతంగా నిర్మించుకోవడానికి లబ్ధిదారులు ముందుకు వస్తారని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని హౌసింగ్ సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. బేస్మెంట్ స్థాయిలో ఉన్న ఇళ్ల నిర్మాణాలను స్టేజ్ కన్వర్షన్ చేసే దిశగా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలన్నారు.కులుమాల గ్రామంలోని గ్రామ సచివాలయంలోని హాజరు పట్టిక, ఉద్యోగుల మూవ్మెంట్ రిజిస్టర్, తదితర రికార్డులను జిల్లా కలెక్టర్ పరిశీలిస్తూ ప్రజలకు అందిస్తున్నా సర్వీసులపై ఆరా తీస్తూ సచివాలయ పరిధిలో అందరికీ పిఎంజెవై కార్డులు అందజేసేలా చూడాలన్నారు. గ్రామంలో గర్భవతులు ఎంత మంది ఉన్నారు వారిలో ఎవరైనా రక్తహీనతతో ఉన్నారా అని అడుగగా అందరూ ఆరోగ్యంగా ఉన్నారని ఏఎన్ఎం, ఎంఎల్హెచ్పి తెలిపారు. గర్భవతులకు వారికి ఇచ్చిన డెలివరీ తేది కంటే 7 రోజులు ముందుగా ఆసుపత్రిలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని ఏఎన్ఎం, ఎంఎల్హెచ్పిలను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలు, సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలోని విద్యార్థులకు రక్తహీనత లేకుండా వారికి ఐరన్ సుక్రోజ్ లాంటివి అందజేయాలన్నారు. గర్భిణీ స్త్రీలలో రక్తహీనతను నివారించడానికి గాను ప్రభుత్వం మరియు అంగన్వాడీ వారు అందజేస్తున్న పౌష్ఠిక ఆహారాన్ని గర్భిణీ స్త్రీలే తినేలా కుటుంబసభ్యులు చూడాలన్నారు. అదే విధంగా ప్రభుత్వం అందరీ ఆరోగ్య శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఫ్యామిలీ ఫిజిషియన్ విధానాన్ని అమలులోకి తెచ్చిందని దానిని అందరూ సద్వినియోగం చేసుకొని ముందస్తుగా హైపర్టెన్షన్, డయాబెటిస్ పరీక్షలు చేయించుకొని ఆరోగ్యంగా ఉండాలని గ్రామస్థులకు జిల్లా కలెక్టర్ సూచించారు.అనంతరం కులుమాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులను పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలన్నారు. పరీక్షలకు ఒక నెల మాత్రమే సమయం ఉన్నందున కష్టపడి కాకుండా ఇష్టంతో చదివితే ఉత్తమ ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందన్నారు. తల్లిదండ్రులు వారి కష్టాన్ని పిల్లలు పడకూదనే ఉద్దేశ్యంతో విద్యార్థులను పాఠశాలలకు పంపుతారని వారి కష్టాన్ని పిల్లలు గుర్తు ఉంచుకొని ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ఉన్నత స్థానానికి ఎదగాలన్నారు. అదే విధంగా ప్రభుత్వం కూడా విద్యార్థులకు అవసరమయ్యే స్టడీ మెటీరియల్ ను అందించడంతో పాటు ఉపాధ్యాయులు కూడా వారి ఉన్నతికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని విద్యార్థులకు పదవ తరగతి పరీక్షల పట్ల జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారి వెంట గోనెగండ్ల తహశీల్దార్ వేణుగోపాల్, ఎంపిడిఓ ప్రవీణ్ కుమార్, హౌసింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author