పారిశుధ్య నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టి సారించండి
1 min read– వేసవిలో త్రాగునీటి ఇబ్బందులు ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోండి
– జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: జిల్లాలోని పట్టణ, గ్రామీణ అన్ని ప్రాంతాలలో ఎక్కడ చూసినా పారిశుధ్య లోపం స్పష్టంగా కనిపిస్తోందని ఈవోఆర్డీలు, పంచాయతీ సెక్రటరీలు మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పారిశుధ్యాన్ని తొలగించి పరిశుభ్రంగా ఉంచేందుకు దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామూన్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వైయస్సార్ సెంటినరీ హాలులో త్రాగునీటి సరఫరా, పబ్లిక్ హెల్త్, పారిశుధ్య నివారణ చర్యలు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రాంతాలలో ఎక్కడ చూసినా పారిశుద్ధ్య లోపం స్పష్టంగా కనిపిస్తోందని ఈఓఆర్డీలు, పంచాయతీ సెక్రటరీలు, మున్సిపాలిటీ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పారిశుద్ధ్యాన్ని తొలగించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఈఓఆర్డీలు ప్రతిరోజు పంచాయతీ సెక్రటరీలతో సమావేశాలు నిర్వహించి పారిశుద్ధ్య నివారణ చర్యలపై దృష్టి సారించాలన్నారు. వీధుల్లో పందులు, కుక్కల బెడద నివారణకు పకడ్బందీ ప్రణాళిక రూపొందించి ఆ మేరకు చర్యలు తీసుకునేలా పంచాయితీ ,మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.పట్టణ ప్రాంతాల్లోని త్రాగునీటి సరఫరాకు ప్రధాన వనరులైన నంద్యాల పట్టణానికి కేసీ కెనాల్ వెలుగోడు రిజర్వాయర్, డోన్ పురపాలక సంఘానికి గాజులదిన్నె ప్రాజెక్ట్, నందికొట్కూరు మున్సిపాలిటీకి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, ఆళ్లగడ్డ నగర పంచాయతీకి గండలేరు రిజర్వాయర్, ఆత్మకూరు మున్సిపాలిటీకి వెలుగోడు రిజర్వాయర్, బేతంచర్ల నగర పంచాయతీకి గ్రౌండ్ వాటర్ (పవర్ బోర్ వెల్స్)కు సంబంధించి పైపులైను లీకేజీలు మరమ్మతులు ఏవైనా ఉంటే యుద్ధప్రాతిపదికన చేపట్టి వచ్చే వేసవిలో త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లను కలెక్టర్ ఆదేశించారు. అలాగే గ్రామీణ ప్రాంతాలలో సమగ్ర రక్షిత మంచినీటి పథకాల ద్వారా త్రాగునీటి కొరత లేకుండా అన్ని గ్రామాలకు సురక్షిత మంచిర్యాల అందించేలా చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రతిరోజు క్లోరినేట్ చేసిన నీటిని సరఫరా చేయడంతో పాటు 15 రోజులకు ఒకసారి ఓఆర్ హెచ్ ఎస్ ట్యాంకులను శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. పైప్ లైనులలో మురుగునీరు కలుషితం కాకుండా అన్నీ జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.అన్ని గ్రామాల్లో హ్యాండ్ వాష్ (చేతుల పరిశుభ్రతపై) అవగాహన కల్పించేందుకు స్పెషల్ క్యాంపైన్ నిర్వహించాలని డియంహెచ్ ఓను కలెక్టర్ ఆదేశించారు. దోమల బెడద నివారణకు ఫాగింగ్, యాంటీ లార్వా నివారణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పండుగలు, జాతరలో ఆహార పదార్థాలు కల్తీ మయం కాకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఇ మనోహర్, డిపిఓ శ్రీనివాసులు, పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ గంగాధర్, డిఎంఅండ్ హెచ్ఓ వెంకటరమణ, భూగర్భ జల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రఘురాం తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.