PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇసుక దోపిడీ..

1 min read

– జగనన్న కాలనీలో.. అవినీతి జలగలు..
– ఇసుకే ఆదాయ వనరు..లబ్ధిదారులకు ఇసుకలో కోత..
– ఎమ్మెల్యే ఆర్థర్ హెచ్చరించినా.. మారని అధికారుల తీరు..
– లబ్ధిదారులను పీల్చి పిప్పి చేస్తున్న హౌసింగ్‌ అధికారులు.
– అధికారుల ఆదాయం రోజుకు రూ.20 వేలు.
– ఉన్నతాధికారులు జోక్యం చేసుకోకుంటే.. లబ్ధిదారుల జేబులకు చిల్లు.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: సాధారణంగా జలగ మన ఒంట్లో నుంచి మనకు తెలియకుండానే.. రక్తాన్ని పీల్చేస్తుంది. తాపీగా అది పీల్చేసిన తర్వాత మనకెప్పుడో తెలుస్తుంది. అచ్చం అలాగే నందికొట్కూరు మున్సిపాలిటీ జగనన్న కాలనీలో గృహ నిర్మాణ శాఖకు చెందిన కొందరు జలగల్లా లబ్ధిదారుల రక్తాన్ని పీల్చుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లబ్ధిదారులకు ఇస్తున్న ఇసుకను అవకాశంగా తీసుకుని చెలరేగిపోతున్నారు. కొందరు బ్రోకర్లను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా లబ్ధిదారుల నుంచి చడీచప్పుడు లేకుండా రోజుకు వేల రూపాయలు తమ జేబుల్లో వేసుకుంటున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇకనైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకోకపోతే లబ్ధిదారులు మరింత దోపిడీకి గురయ్యే ప్రమాదముంది.

అధికారుల చేతివాటం..:

నందికొట్కూరు మునిసిపాలిటీ పరిధిలో ఇళ్లు లేని పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలో సుమారు 40 ఎకరాలలో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలో 2386 ఇళ్లను మంజూరు చేసింది. ఇక్కడ ప్రతి లబ్ధిదారుడికి రూ.1.80 లక్షలు ప్రభుత్వం ఇస్తుంది. ఇందులో భాగంగా సిమెంటు, ఇసుకను ప్రభుత్వం అందజేస్తుంది. ఈ ఇసుక లబ్ధిదారులకు ఇస్తున్న సందర్భంలో గృహ నిర్మాణ శాఖకు చెందిన కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తూ లబ్ధిదారుల నుంచి వేల రూపాయలు కాజేస్తున్నారు. తమ వద్ద నుంచి అధికారులు డబ్బు కాజేస్తున్నారన్న విషయం కూడా లబ్ధిదారులకు తెలియకుండా జలగలను మించిపోయిన కొందరు గృహ నిర్మాణ శాఖాఽధికారులు తాము నియమించుకున్న బ్రోకర్లతో వసూళ్లు చేస్తున్నారు. కంచే చేను మేసిన చందంగా ఉన్నతాధికారులే జలగావతారం ఎత్తుతుండడంతో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కింది స్థాయి అధికారులు మరింత రెచ్చిపోయి లబ్ధిదారుల రక్తం పీల్చుతున్నారు.
ఆదాయ వనరుగా ఇసుక..:
ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం 90 బస్తాల సిమెంటును అందిస్తుంది. అందులో మొదట 30 బస్తాలు పునాదుల కోసం, తర్వాత 40 బస్తాలు గోడలు, స్లాబ్‌ కోసం, మిగిలిన 20 బస్తాలు పూతల కోసం ఇస్తుంది. ప్రస్తుతం ఈ జగనన్న కాలనీలో దాదాపు 666 బేస్ మెంట్ లెవల్, 658 బిబిఎల్ దశ లో ఉన్నాయి. దాదాపు 57 ఇళ్లు స్లాబ్‌ దశలోనూ, 123 గోడల దశలో ఉన్నాయి. సుమారు 864 కి పైగా ఇళ్లు నిర్మాణం పూర్తయ్యాయి. ఈ లబ్ధిదారులకు ఇచ్చే ఇసుకలో గోల్‌మాల్‌ చేస్తున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. జగనన్న కాలనీ ఒక్కో లబ్ధిదారునికి ఐదు టన్నుల ఇసుక కూపన్‌ను సచివాలయంలో జనరేట్‌ చేస్తారు. ఇందుకు ప్రభుత్వం ఒక్కో ట్రాక్టర్‌కు (ఐదు టన్నులు) రూ.850 ఆన్‌లైన్‌లోనే తీసేసుకుంటుంది. (లబ్ధిదారునికి ఇచ్చే రూ.1.80 లక్షలలోనే ఇదంతా వసూలు చేస్తారు.) అయితే జగనన్న కాలనీలోని స్టాకు పాయింట్‌ నుంచి తన ఇంటి వద్దకు తోలడానికి ఒక ట్రాక్టర్‌కు లబ్ధిదారుడు రూ.700 బాడుగ ఇవ్వాలి. ఇందులో రూ.500 ట్రాక్టర్‌, ఎక్స్‌కవేటర్‌కు ఇస్తుండగా, రూ.200 గృహ నిర్మాణ శాఖాధికారులకు చేరుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎక్స్‌కవేటర్‌తో దాదాపు రెండు నిమిషాల్లోనే ఒక ట్రాక్టర్‌కు ఇసుక ఎత్తేస్తారని తెలిసింది. అంతేకాకుండా ఐదు టన్నులకు బదులు నాలుగున్నర , నాలుగు టన్నులు మాత్రమే ఇసుక ఇస్తున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఈ లెక్కన రోజుకు కనీసం ఇసుకలోనే వారికి రూ.20 వేలు తక్కువ కాకుండా ఆదాయం వస్తున్నట్లు తెలుస్తోంది.
ఇసుక దోపిడీ జరుగుతుంది ఇలా..:

నందికొట్కూరు జగనన్న కాలనీ ఇసుక డంపు నుంచి పగిడ్యాల, జూపాడుబంగ్లా, నందికొట్కూరు, నందికొట్కూరు మున్సిపాలిటీ, మిడుతూరు మండలంలోని జగనన్న ఇంటి లబ్ధిదారులకు ఇసుక సరఫరా చేస్తున్నారు.వారంలో రెండురోజుల ప్రకారం ఇసుకను లబ్ధిదారులకు ఎత్తిస్తారు. లబ్ధిదారులే ట్రాక్టర్ ను తెచ్చుకోవాలి.ట్రాక్టర్ డ్రైవర్లు ఖాళీ ట్రాక్టర్ ను వెయిట్ వేయించుకొని రశీదు తీసుకోవాలి.మళ్ళీ ఇసుక లోడ్ అయిన తరువాత ట్రాక్టర్ ను వెయిట్ వేయించి రశీదు తీసుకోవాలి. ఈ రశీదులు లబ్ధిదారులకు ,అధికారులకు ఇవ్వాలి. కానీ అలా జరగడం లేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఏ ట్రాక్టర్ ఎంత బరువు ఉందో లబ్ధిదారులకు తెలియపరచడం లేదు.ఎన్ని టన్నులు ఇసుక వస్తోందో లబ్ధిదారులకు తెలియదు. వారి అమాయకత్వం ఆసరాగా చేసుకుని ఇదే తంతుగా అధికారులు ఇష్టారాజ్యంగా ఇసుకను దోచేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కొక్కరోజు దాదాపు 20 నుంచి 30 ట్రాక్టర్లకు ఇసుకను లబ్ధిదారులకు ఎత్తిస్తున్నారు.
ఎమ్మెల్యే హెచ్చరించినా… మారని అధికారుల తీరు..:
అవినీతి రక్తం రుచి మరిగిన జలగలు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎటువంటి భయం లేకుండా దోపిడీ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కాలనీలో చాపకింద నీరులా సాగుతున్న గృహనిర్మాణ శాఖ అధికారుల దోపిడీపై గత వారంలో లబ్ధిదారులు ఎమ్మెల్యే ఆర్థర్ కు ఫిర్యాదు చేశారు. అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే ఆర్థర్ అధికారులను మందలించారు. అయిన అధికారుల పని తీరులో మార్పు రాలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ దోపిడీలో కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు అందరి హస్తం ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. స్వయంగా ఎమ్మెల్యే ఒకసారి జగనన్నకాలనీని ఆకస్మికంగా తనిఖీ చేసి విచారిస్తే గృహ నిర్మాణశాఖకు చెందిన అధికారుల దోపిడీ బాగోతం బయటపడుతుందని పేర్కొంటున్నారు.
ఆరోపణలు వచ్చిన మాట వాస్తవమే.: ప్రభాకర్, డీఈ , గృహ నిర్మాణ శాఖ
నందికొట్కూరు మున్సిపాలిటీ జగనన్న కాలనీలో ఇసుక విషయంలో కొన్ని ఆరోపణలు వచ్చిన మాట వాస్తవమే. నేను వెంటనే వెళ్లి సమస్యను సర్దుబాటు చేశాము. కమీషన్లు వసూలు చేస్తున్న మాట వాస్తవం కాదు.లబ్ధిదారులకు ఇసుక తక్కువగా వస్తే అలాంటి వారు ఫిర్యాదు చేస్తే అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం లబ్ధిదారులకు కేటాయించిన టన్నుల ప్రకారం ఇసుకను అందిస్తామని అన్నారు.

About Author