PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గుండె పోటుకు భిన్నం.. ‘కార్డియాక్​ అరెస్ట్​’

1 min read

సరైన సమయంలో.. సరైన చికిత్సతో ‘కార్డియాక్​’కు చెక్​

సీనియర్​ గుండె వైద్యనిపుణులు డా. వసంత కుమార్​

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: సమాజంలో ప్రతి ఒక్కరు మానసిక ఒత్తిడికి గురవుతూ గుండె నొప్పికి దగ్గరవుతున్నారని,  ఒత్తిడి లేని జీవితం అలవర్చుకోవాలని సూచించారు సీనియర్​ గుండె వైద్య నిపుణులు డా. వసంత కుమార్​ ఆదివారం సాయంత్రం కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​లో  సీనియర్​ గుండె వైద్యనిపుణులు డా. చంద్రశేఖర్​ అధ్యక్షతన ‘ కార్డియాక్​ అరెస్టు’పై అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డా. వసంత కుమార్​ మాట్లాడుతూ ప్రతిరోజు వ్యాయామం, యోగా, ధ్యానం చేయడం వల్ల ప్రశాంతంగా బతకవచ్చన్నారు. ఇందుకు మద్యం, పొగాకుకు దూరంగా ఉండాలని, అప్పుడే గుండె భద్రంగా ఉంటుందని పేర్కొన్నారు.

గుండెపోటుకు భిన్నం..‘కార్డియాక్​ అరెస్టు’:

ప్రస్తుత సమాజంలో కొందరు సినీ హీరోలు, ప్రముఖులు ‘ కార్డియాక్​ అరెస్టు’కు గురై మృత్యువాత పడ్డారని, ఇది ఎంతో బాధాకరమన్నారు సీనియర్​ గుండె వైద్యనిపుణులు డా. వసంత కుమార్​. కార్డియాక్​ అరెస్టు అనేది గుండెపోటుకు భిన్నంగా ఉంటుందని, దీనిపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు.

‘కార్డియాక్​’కు ..లక్షణాలు ఉండవు…:

 కార్డియాక్​ అరెస్టుకు ముందస్తు లక్షణాలు ఉండవు. ఆకస్మికంగా వస్తుంది. సాధారణంగా గుండెలో ఏర్పడే ఎలక్ట్రికల్ అలజడే దీనికి కారణం. ఈ అలజడి ఫలితంగా హృదయ స్పందనలో.. అంటే గుండె కొట్టుకోవడంలో సమతుల్యం దెబ్బతింటుంది. దీని వల్ల గుండె రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యంపై ప్రభావం పడుతుంది. దాంతో మెదడు, గుండె, శరీరంలోని ఇతర భాగాలకు రక్త ప్రసరణ జరగకుండా పోతుంది. దీని వల్ల కొద్ది క్షణాల్లోనే రోగి అపస్మారక స్థితిలోకి వెళ్తారు. నాడి కొట్టుకోవడం కూడా ఆగిపోతుంది. కార్డియాక్ అరెస్ట్​కు సరైన సమయంలో, సరైన చికిత్స అందినట్లయితే… కోలుకునే అవకాశం ఉంటుంది.

ఆరోగ్య నియామాలు.. తప్పనిసరి…:

వయస్సుతో సంబంధం లేకుండా.. ప్రతిఒక్కరు ఆరోగ్య నియమాలు పాటించాలి. సెల్​ఫోన్లకు పరిమితం కాకుండా కొంత శరీర అవయవాలకు పని చెప్పాలి. ఉదయమే అరగంట నడక, వ్యాయామం, ధ్యానం, యోగా చేయాలి.  ఇలా ప్రతి రోజు చేయడం వల్ల మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశాలు తక్కువ. సమయం ఉన్న వారు సాయంత్రపు వేళల్లోనూ కాలినడక నడిస్తే ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. మద్యం, పొగాకు, ఇతర చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సీనియర్​ గుండె వైద్య నిపుణులు డా. వసంత కుమార్​ వెల్లడించారు.

డా.వసంత కుమార్​కు ఘనసన్మానం:

రాష్ట్రంలో ఎందరికో గుండె శస్ర్తచికిత్స చేసి… ప్రాణం నిలబెట్టిన డా. వసంత కుమార్​… కోట్లాది మంది ప్రజల ఆదరాభిమానాలు పొందారు. రాయలసీమలో గుండె వైద్యనిపుణులలో తనకంటూ.. ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. లక్షలాది మందికి ప్రాణదాతగా నిలిచిన డా. వసంత కుమార్​ను కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో హార్ట్​ ఫౌండేషన్​ సభ్యులు డా. భవాని ప్రసాద్​, కల్కూర చంద్రశేఖర్​ తదితరులు పాల్గొన్నారు.

About Author