ఏపీ ఎన్జీవో ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
1 min read– మహిళలు విద్యావంతులైతే అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుస్తారు..
– జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : మహిళలు అన్ని రంగాలలోని ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో 50 శాతానికిపైగా పనిలో భాగస్వాములైతే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా రూపొందుతుందని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు హాలులో బుధవారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని జ్యోతిని వెలిగించి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి విద్య ప్రధానమైనదన్నారు. ప్రతీ మహిళా విద్యావంతురాలై అన్ని రంగాలలోనూ తన శక్తి సామర్ధ్యాలు నిరూపించుకుని ఉన్నత శిఖరాలు అందుకోవాలని ఆకాంక్షించారు. దేశంలో ఉద్యోగ అవకాశాలలో మహిళలు 50 శాతం పనిలో భాగస్వాములైతే ఇప్పటివరకు అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న మన భారతదేశం, అభివృద్ధి చెందిన దేశంగా రూపొందుతుందన్నారు. సమాజంలో మహిళల పట్ల లింగ వివక్ష నిర్మూలనకు కుటుంబ వ్యవస్థనుండే ప్రారంభం కావాలని, ఇందుకు తల్లితండ్రుల మైండ్ సెట్ మారాల్సి ఉందన్నారు. మహిళా సాధికారతకు, మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నారు. సంక్షేమ కార్యక్రమాలన్నీ మహిళల పేరు మీదే మంజూరు చేస్తున్నదన్నారు. పనిచేసే మహిళలపై ఎటువంటి దాడులు జరగకుండా ఉండేలా అన్ని ప్రభుత్వ కార్యాలయాలలోనూ ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. రాజేశ్వరి మాట్లాడుతూ సమాజంలో మహిళల పట్ల లింగ వివక్ష రూపుమాపితేనే మహిళాభివృద్ది సాధ్యమవుతుందన్నారు. ఇప్పటికే మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉన్నారని, ఈ సంఖ్య ఇంకా పెరగవలసిన అవసరం ఉందన్నారు. మహిళలు తమకు రాజ్యాంగం కలిపించిన హక్కుల గురించి అవగాహనా పెంపొందించుకోవాలన్నారు. ఉద్యోగాలలో కూడా మహిళలు తమదైన శైలిలో పనిచేసి మన్ననలు పొందాలన్నారు.
జిల్లా ఎన్సీడీ ప్రాజెక్ట్ అధికారి డా. సిహెచ్. మానస మాట్లాడుతూ ఎన్సీడీ ప్రాజెక్ట్ ద్వారా ‘భేటీ బచావో..భేటీ పఢావో’ నినాదందో బడి ఈడు బాలికలు తప్పనిసరిగా బడిలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహిళల అభ్యున్నతికి ప్రతీ ఒక్కరూ చేయూత నివ్వాలన్నారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలంటే విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఒత్తిడి లేని విద్య అందించేలన్నారు. తల్లితండ్రులు ఇంట్లో పిల్లలతో స్నేహపూర్వక వాతావరణం కలిగి ఉండేలా చూడాలని, పాఠశాలల్లో చెప్పిన విద్యపై ప్రతీ రోజు తల్లితండ్రులు ఇంట్లో పిల్లలతో చర్చించాలన్నారు. చిన్న పిల్లలు ఇంట్లో మొబైల్ కు దూరంగా ఉండేలా తల్లితండ్రులు చూడాలన్నారు. కుటుంబంలో బాలికల పట్ల లింగ వివక్ష లేకుండా చూడాల్సిన బాధ్యత తల్లితండ్రులపై ఉందన్నారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. రాజేశ్వరి, జిల్లా ఎన్సీడీ ప్రాజెక్ట్ అధికారి డా. సిహెచ్. మానస, జిల్లా వెనుకబడిన సంక్షేమ అధికారి నాగరాణి,పోలవరం డిఎస్పీ లతాకుమారి, ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పద్మావతి, వివిధ శాఖల జిల్లా అధికారులు, వివిధ రంగాలలో సేవలందించిన మహిళలను దుశ్శాలువా, పూలమాల, మెమెంటోలతో జిల్లా కలెక్టర్ సత్కరించారు. అనంతరం ఇటీవల మహిళా ఉద్యోగినులకు నిర్వహించిన క్రీడా పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను. ఏటీవో ప్రేమావతికి మెమొంటో అందజేసి శాలువాతో జిల్లా కలెక్టర్ అందించారు. ఈ సందర్భంగా సభికులచే ‘భేటీ బచావో. భేటీ పడావో’ బాలికా సంక్షేమానికి కృషిచేస్తామని జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఏటీవో ప్రేమావతికి మెమొంటో అందజేసి శాలువాతో సత్కరించారు, కార్యక్రమంలో డి ఆర్ ఓ ఏ .వి. ఎన్ .ఎస్. మూర్తి, జిల్లా పరిషత్ సీఈఓ కె. రవికుమార్, ఎన్జీఓ నాయకులు చోటగిరి శ్రీనివాస్, నెరుసు రామారావు, మాజీ అధ్యక్షుడు హరినాథ్, జిల్లా సెక్రెటరీ కప్పలప్పల సత్యనారాయణ, ప్రభృతులు పాల్గొన్నారు.