సెంచురీ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం
1 min readపల్లెవెలుగు వెబ్ హైదరాబాద్ : పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు చాలావరకు దరిచేరవని సెంచురీ ఆస్పత్రి వైద్యులు స్థానికులకు సూచించారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ సమీపంలోని మల్లిఖార్జుననగర్లో ఆదివారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన దాదాపు 150 మంది వరకు ఈ శిబిరానికి హాజరై, వివిధ వైద్యపరీక్షలు చేయించుకున్నారు. ఆస్పత్రికి చెందిన గైనకాలజిస్టు డాక్టర్ ఎ.ఝాన్సీరాణి వచ్చి, ఈ ప్రాంతవాసులకు వివిధ పరీక్షలు చేశారు. ముఖ్యంగా బీపీ, మధుమేహం, బరువు, ఎత్తు, బీఎంఐ తదితరాలను పరీక్షించారు. ఈ ప్రాంత ప్రజల్లో రక్తహీనత కనిపిస్తోందని, తగిన పోషకాహారం తీసుకోవాలని ఆమె సూచించారు. శిబిరంలో సెంచురీ ఆస్పత్రి సీఈవో డాక్టర్ హేమంత్ కౌకుంట్ల మాట్లాడుతూ, ‘‘ఏదైనా ఆహారం తీసుకునే ముందు తప్పనిసరిగా చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. ఏదైనా పదార్థం తిన్న తర్వాత మర్చిపోకుండా నోరు బాగా పుక్కిలించి ఉమ్మేయాలి. అలా చేస్తే పళ్లు పుచ్చిపోకుండా ఉంటాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంతో పాటు పలు ప్రాంతాల్లో హెచ్3ఎన్2 రకం వైరల్ జ్వరం తీవ్రంగా వ్యాపిస్తోంది. బయటకు వెళ్లినప్పుడు మాస్కు ధరించడం, చేతులతో వేటినీ ముట్టుకోకపోవడం చాలా ముఖ్యం’’ అని సూచించారు.