ప్లీహం అతిగా పెరిగిపోయి.. ఎదుగుదల ఆగిపోయిన బాలిక
1 min read– రక్తపువాంతులు కావడంతో ఆస్పత్రికి తీసుకొచ్చిన తల్లిదండ్రులు
– పలు సమస్యలకు ఒకే శస్త్రచికిత్సతో పరిష్కారం చూపిన కర్నూలు కిమ్స్ వైద్యుడు డాక్టర్ జానకిరామ్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఎదుగుదల సరిగా లేకపోవడాన్ని చాలామంది తల్లిదండ్రులు సరిగా పట్టించుకోరు. పిల్లలు సరిగా తినట్లేదని వదిలేస్తారు. కానీ, అది పెద్ద ఆరోగ్య సమస్య అయ్యేందుకు అవకాశం ఉంటుందన్న విషయం వాళ్లకు తెలియదు. కర్నూలు జిల్లా సి.బెళగాల్ మండలం పోలకల్లు గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక విషయంలో సరిగ్గా ఇలాగే జరిగింది. తోటి పిల్లల కంటే బాగా పొట్టిగా, సన్నగా ఉండే ఆ పాపను మొదట్లో తల్లిదండ్రులు అంతగా పట్టించుకోలేదు. తర్వాత ఉన్నట్టుండి రక్తపు వాంతులు కావడంతో ఆందోళనకు గురై కర్నూలు కిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆ బాలికకు ఉన్న అరుదైన సమస్యను గుర్తించి, దానికి చికిత్స చేసిన కర్నూలు కిమ్స్ ఆస్పత్రి కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు,అడ్వాన్స్‌డ్ లాప్రోస్కొపీ, బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ సూరా జానకిరామ్..ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ‘‘మానవ శరీరంలో మూలుగ రక్తకణాలను సృష్టిస్తుంది. కావల్సిన వాటి కంటే అధికంగా ఉండే రక్తకణాలను ప్లీహం చంపేస్తుంటుంది. దానివల్ల శరీరంలో సమతౌల్యం ఏర్పడుతుంది. ప్లీహం సాధారణంగా పక్కటెముకలకు కిందిభాగంలో ఎడమవైపు చిన్నగా ఉంటుంది. కాలేయంలో దీని పరిమాణం దాదాపు 20వ వంతు మాత్రమే ఉంటుంది. కానీ, ఈ బాలికకు పుట్టుకతోనే వచ్చిన ఓ సమస్య కారణంగా ప్లీహానికి రక్తం అధికంగా సరఫరా అయ్యి, అది అసాధారణంగా పెరిగిపోయి పక్కటెముకల నుంచి బొడ్డు వరకు విస్తరించింది. (స్ప్లీనోమెగలీ) ఉదరభాగాన్ని కూడా ఆక్రమించింది. అన్నం తినేటప్పుడు ఉదరభాగం వ్యాకోచించాలి. కానీ, ఇక్కడ అలాంటి అవకాశం లేకపోవడంతో.. ఆ పాప అన్నం సరిగా తినలేకపోయేది. ఫలితంగా ఎదుగుదల పూర్తిగా లోపించింది. దానికితోడు.. ప్లీహానికి రక్తసరఫరా ఎక్కువ కావడంతో అది అతిగా పనిచేసి రక్తకణాలను చంపేస్తుండటంతో ఆమెకు హిమోగ్లోబిన్, తెల్ల రక్తకణాలు, ఎర్ర రక్తకణాలు, ప్లేట్‌లెట్లు అన్నీ పడిపోయాయి. బాలికకు ముందుగా ఎండోస్కొపీ చేసి చూస్తే, అన్నవాహికకు, ఉదరానికి మధ్య రక్తపు గడ్డలు కనిపించాయి. అక్కడి నుంచే ఆమెకు బ్లీడింగ్ అయింది. చిన్న పేగుల నుంచి కాలేయానికి వెళ్లే పోర్టల్ వెయిన్ అనే రక్తనాళం ఈమెకు పుట్టుకతోనే బ్లాక్ అయిపోయింది. అది కాలేయానికి రక్తం సరఫరా చేస్తేనే కాలేయం తన పని తాను చేయగలదు. ఈ పోర్టల్ వెయిన్ ఆమెకు బ్లాక్ అయిపోయింది. ఇంటివద్ద సాధారణ ప్రసవం అప్పుడు బొడ్డు సరిగా కట్ చేయకపోతే ఇలా రక్తనాళాలు బ్లాక్ అవుతాయి. దానివల్ల పోర్టల్ వెయిన్ చుట్టూ చిన్న చిన్న కాల్వలు తయారవుతాయిగానీ, అవి కాలేయానికి రక్తసరఫరా చేసేందుకు సరిపోవు. దాంతో రక్తం కాలేయానికి వెళ్లడానికి బదులు బయట గడ్డ కడుతుంది. సాధారణంగా ప్లీహం నుంచి, పేగుల నుంచి వచ్చే రక్తం పోర్టల్ వెయిన్ ద్వారా కాలేయానికి అందాలి. ఈ రెండు మార్గాలూ కలిసేచోట బ్లాక్ అయింది. దాంతో రక్తం వెనక్కి వచ్చి, ప్లీహానికి సరఫరా కావడంతో ప్లీహం అసాధారణంగా పెరిగిపోయింది. ప్లీహం నుంచి ఉదరానికి వెళ్లే రక్తనాళాలు లావుగా అయిపోయి, అన్నవాహిక వద్దకు వెళ్లడంతో రక్తపువాంతులు అయ్యాయి. బాలికకు ఉన్న ఈ సమస్యలన్నింటినీ ఒకేసారి శస్త్రచికిత్స చేయడం ద్వారా పరిష్కరించాం. పోర్టల్ వెయిన్‌ని మళ్లీ కొత్తగా సృష్టించడం కుదరదు. కాబట్టి ముందుగా అతిగా పెరిగిన ప్లీహాన్ని తొలగించాం. తర్వాత ప్లీహం నుంచి వెళ్లే రక్తనాళాన్ని మూత్రపిండాలవైపు మళ్లించి, అక్కడినుంచి గుండెకు, అటు నుంచి కాలేయానికి వెళ్లేలా దారి మళ్లించాం. దాంతో సమస్య పరిష్కారం అయ్యింది. కాలేయానికి తగిన రక్తసరఫరా అందడం మొదలైంది, ప్లీహం లేకపోవడంతో రక్తకణాలు చచ్చిపోకుండా ఉన్నాయి. ఫలితంగా హిమోగ్లోబిన్, తెల్ల రక్తకణాలు, ఎర్ర రక్తకణాలు, ప్లేట్‌లెట్లు అన్నీ పెరిగాయి. ఉదరభాగాన్ని ప్లీహం ఆక్రమించకపోవడంతో అది తగినంతగా వ్యాకోచించి.. పాప ఆహారం బాగా తీసుకోగలుగుతోంది. దానివల్ల బరువు కూడా క్రమంగా పెరుగుతోంది. ఇప్పుడు ఆ బాలిక వయసు 14 ఏళ్లు. సాధారణంగా అమ్మాయిలకు 17-18 ఏళ్లకు పెరుగుదల ఆగిపోతుంది. అప్పుడు ఇలాంటి శస్త్రచికిత్స చేసినా, ఇక ఎదుగుదల ఉండేది కాదు. ఇప్పుడు మిగిలిన మూడు నాలుగేళ్లలో ఆమె ఎంత పెరిగితే అంత పెరిగినట్లు. అదే 11 ఏళ్ల వయసులో వచ్చి ఉంటే మరింత ఎదుగుదల సాధ్యమయ్యేది. రక్తపువాంతులు కాకుండా ఉన్నట్లయితే తల్లిదండ్రులు ఈ సమస్యను గుర్తించలేకపోయేవారు. ఇప్పుడు పాపకు పూర్తిగా నయం కావడంతో ఆమెతో పాటు తల్లిదండ్రులూ ఎంతో సంతోషిస్తున్నారు’’ అని డాక్టర్ సూరా జానకిరామ్ వివరించారు.