బీసీల దశాబ్దాల సమస్యలకు పరిష్కారం “సమగ్ర కులగణన” జరగాలి
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ: బీసీల దశాబ్దాల సమస్యలకు పరిష్కారం “సమగ్ర కులగణన”బీసీ సాధికార సమాఖ్య ఆధ్వర్యంలో , ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం బీహార్ , ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వాల వలె , ఆంద్రప్రదేశ్ లో కూడా “సమగ్ర కులగణన” జరిపించాలని కోరుతూ , రాష్ట్రంలోని ప్రధాన పార్టీలతో గాంధీనగర్ లోని శ్రీరామ పంక్షన్ ప్యాలెస్ లో “అఖిలపక్ష” సమావేశం బుధవారం నాడు జరిగింది. బీసీ సాధికార సమాఖ్య అధ్యక్షులు పామర్తి జయ ప్రకాష్ నారాయణ అధ్యక్షత వహించన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ , బీజేపీ , టీడీపీ, , బీఎస్పీ , జనతాదళ్, సమాజ్ వాదీ, ఆర్పిఐ, ఆమ్ ఆద్మీ , జై భారత్ , మహాజన సోషలిస్టు పార్టీల నుండి ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ , బీసీల దశాబ్దాల సమస్యలకు పరిష్కారం “సమగ్ర కులగణన” జరపడం వల్లే సాధ్యం అన్నారు, అది బీసీల చిరకాల ఆకాంక్ష అని , రాష్ట్ర ప్రభుత్వం వారి ఆకాంక్షను గుర్తించి వెంటనే , బీహార్ , ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న విధంగా , ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అటువంటి “సమగ్ర కులగణన” వెంటనే జరిపించాలని కోరారు. దీనికి తమ తమ పార్టీలు పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు.చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు దక్కాలంటే, కేంద్ర మంత్రి వర్గంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు కావాలన్నా,బీసీ జాబితాను జాతీయస్థాయిలో వర్గీకరిస్తున్న జస్టిస్ రోహిణి కమిషన్ నివేదికలో రాష్ట్ర జాబితాలోని బీసీలకు న్యాయం దక్కాలంటే బీసీ ల కులగణన జరగాలన్నారు.కేంద్రప్రభుత్వ బడ్జెట్ లో బీసీలకు సబ్ ప్లాన్ అమలు జరగాలన్న,స్ధానిక సంస్థలలో బీసీలకు దామాషా ప్రాతినిధ్యం దక్కాలంటే,కేంద్ర , రాష్ట్ర ఉద్యోగాలలో ప్రమోషన్ లలో బీసీ రిజర్వేషన్లు అమలు కావాలంటే కులగణన తోనే సాధ్యం అని పేర్కొన్నారు.తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం బీసీ జాబితా నుండి తొలిగించిన 26 బీసీ కులాలను తిరిగి బీసీ జాబితాలో చేర్చాలన్నా “సమగ్ర కులగణన” అవసరమని చెప్పారు. అప్పుడే దశాబ్దాలుగా కోర్టులలో అపరిష్కృతంగా ఉన్న బీసీ ల కేసులు పరిష్కారం దొరుకుతుందని అన్నారు, మండల్ కమిషన్ తో పాటు , రాష్ట్రంలో మొట్టమొదట ఏర్పడిన అనంత రామన్ కమిషన్ కూడా “సమగ్ర కులగణన” జరపాలని సిఫార్సు చేసి ఉన్నాయని తెలిపారు. కనుక ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే “సమగ్ర కులగణన” జరిపించేందుకు కార్యాచరణ రూపొందించాలని, దానికి రాష్ట్రంలోని అన్ని పార్టీలు ప్రభుత్వానికి మద్దతుగా ఉంటాయని సూచించారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణా సంఘం చైర్మన్ పాకా .వెంకట సత్యనారాయణ , కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు వి . గురున్నాధం , టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాజేశ్వర రావు ఆమ్ అద్మి పార్టీ కన్వీనర్ పణిరాజ్, జై భారత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట రమణ ,ఆర్ పి ఐ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టా వరప్రసాద్, నేషనల్ జనశక్తి పార్టీ కడియం సూరిబాబు , బీసీ సాధికార సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుబ్బల బాబ్జి ,మేడిసెట్టి ఇజ్రాయిల్ , ఉప్పాల భాస్కరరావు, బీసీ సంఘాల ప్రతినిధులు పలువురు పాల్గొన్నారు.