PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించండి

1 min read

– సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: వచ్చేనెల 3 నుండి 18 వ తేదీ వరకు జరిగే పదవ తరగతి పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన ఛాంబర్ లో10వ తరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ కే రఘువీర్ రెడ్డి తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ ఏప్రిల్ 3 నుండి 18 వ తేదీ వరకు జరిగే పదవ తరగతి పరీక్షల నిర్వహణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో 10 వ తరగతికి సంబంధించి 125 పరీక్షా కేంద్రాల్లో 25,411 మంది విద్యార్థులు ఉదయం 9:30 గంటల నుండి 12:45 నిమిషాల వరకు పరీక్షలు రాస్తున్న నేపథ్యంలో సంబంధిత అధికారులకు కేటాయించిన విధులు బాధ్యతాయుతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ చేయడంతో పాటు డిప్యూటీ తాసిల్దార్ ను ఫ్లయింగ్ స్క్వాడ్ లో నియమించాలని రెవిన్యూ అధికారులకు సూచించారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్త్ తో పాటు స్ట్రాంగ్ రూమ్ లో వద్ద నిగా ఉంచడం ప్రశ్నాపత్రాలు సమాధాన పత్రాలు వెంట ఎస్కార్ట్ ఏర్పాటు చేయడం తదితర ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులను సూచించారు. అదే విధంగా పరీక్షా కేంద్రాల వద్ద పారిశుద్ధంతోపాటు త్రాగునీటి వసతులు కల్పించాలని మున్సిపల్ కమీషనర్ అధికారులను సూచించారు. అలాగే ప్రతి పరీక్షా కేంద్రంలో అత్యవసర మందులతో ప్రధమ చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయాలనీ, ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లను సిద్ధంగా ఉంచాలని వైద్య ఆరోగ్య అధికారులను ఆదేశించారు. పరీక్షా సమయాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. విద్యార్ధులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు అనుకూలంగా ఉండేలా అన్ని రూట్లలో ఆర్టీసి బస్సులు నడపాలని ఆర్.టి.సి అధికారులకు ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద జిరాక్స్ కేంద్రాలను మూసి వేసేలా చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పరీక్షలు ముగిసిన తర్వాత సమాధాన పత్రాలను పార్సెల్ ద్వారా డిస్పాచ్ చేసేందుకు సాయంత్రం 4 గంటల వరకు అనుమతించాలని పోస్టల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.ఈ సమావేశంలో డీఈఓ అనురాధ మాట్లాడుతూ చీఫ్ సూపర్డెంట్లు, కస్టోడియన్ అధికారులు, డిపార్ట్మెంట్ అధికారులు, ఎంఈఓలకు 10వ తరగతి పరీక్షల పకడ్బందీ నిర్వహణపై గురువారం కలెక్టరేట్లోని వైయస్సార్ సెంటనరీ హాలులో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశామని కలెక్టర్కు నివేదించారు.

About Author