కిలో ‘ఈల్’ చేపల ధర రూ.25 లక్షలు..!
1 min readపల్లెవెలుగు వెబ్: జపాన్ లో ఈల్ చేపలకు భారీగా డిమాండ్ ఉంది. ఈల్ చేపలు తినేందుకు జపనీయులు తెగ ఇష్టపడతారు. ఒక కిలో బేబీ ఈల్ చేపలు కావాలంటే.. 35 వేల డాలర్లు చెల్లించాలి. మన రూపాయల్లో అక్షరాల 25 లక్షల పై మాటే. ఈల్ చేపలకు ఎందికింత ధర చెల్లిస్తారంటే.. సాధారణంగా ఈల్ చేపల పెంపకం చాలా కష్టమైనది. వీటిని ప్రత్యేకంగా నీటికుంటల్లో ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితుల మధ్య.. అత్యంత జాగ్రత్తగా పెంచుతారు. ఒక్కో నీటికుంటలో కొన్ని లక్షల ఈల్ చేపలు పెరుగుతాయి.
వీటిలో ఒక్క ఈల్ చేపకు ఏదైన వ్యాధి సోకితే.. మొత్తం నీటికుంటలోని చేపలన్నింటికీ సోకుతుంది. దీంతో మొత్తం ఈల్ చేపలు తినడానికి పనికిరావు. ప్రతిరోజు పర్యవేక్షణతో ఈల్ చేపలను పెంచాలి. ఫిష్ మీల్, సోయాబీన్ మీల్, ఫిష్ ఆయిల్ తో కూడిన ఆహారాన్ని ఈల్ చేపలకు అందిస్తారు. ఆహారం అందించే సమయంలో.. మిగతా సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒక్క నీటికుంటలోని ఈల్ చేపలకు ఏమైనా జరిగితే .. అది మొత్తం నీటి కుంటల మీద ప్రభావం చూపుతుంది. ఫలితంగా మొత్తం నాశనం అవుతుంది. ఈల్ చేపల పెంపకం ఇంత కష్టంతో.. జాగ్రత్తతో కూడుకుని ఉంటుంది కాబట్టే వాటి ధర కూడ ఆ స్థాయిలో ఉంటుంది.
ధరలు పెరగడానికి కారణం:
ఈల్ చేపల పెంపకంలో ఉన్న ఇబ్బందుల కారణంగా వాటి సరఫరా తగ్గుతోంది. వేరే దేశాల నుంచి ఈల్ చేపలను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. డిమాండ్ మేరకు జపాన్ లో ఈల్ చేపల సాగు చేపట్టలేకపోతున్నారు. ఫలితంగా ధరలు పెరిగిపోతున్నాయి. ప్రతి సంవత్సరం ఈల్ చేపల ధరల్లో భారీ వ్యత్యాసంతో పెరుగుదల కనిపిస్తోంది. ఈల్ చేపలు స్థానికంగా లభ్యం కాకపోవడం కారణంగా జపాన్ లోని రెస్టారెంట్లకు లైఫ్ అండ్ డెత్ పరిస్థితి ఏర్పడింది.