పొట్టి శ్రీరాములు త్యాగం నేటి యువతకు ఆదర్శం
1 min read– పట్టుదలతో లక్ష్యాలను సాధించిన అమరజీవి పొట్టి శ్రీరాములు
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: భాషా ప్రయుక్త రాష్ట్రాల పితామహులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతినిగురువారం పట్టణంలోని శ్రీపొట్టి శ్రీరాములు విగ్రహానికి మున్సిపల్ కమిషనర్ పి. కిషోర్ పూలమాలలు వేసి జయంతినీ ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి తెలుగు మాట్లాడే వారి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని నిరాహార దీక్ష చేస్తూ ప్రాణాలు విడిచిన మహా నేత అని కొనియాడారు. ఆయన తెలుగువారి కోసం పోరాటం చేసి ప్రాణాలు వదిలిన మహానేత అన్నారు. తెలుగువారికి కోసం చేసిన ప్రాణత్యాగం మరువరానిదన్నారు.పొట్టి శ్రీరాములు త్యాగం నేటి పోరాట యోధులకు స్ఫూర్తిదాయకమన్నారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని 1952 అక్టోబర్ 19న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారన్నారు. 58 రోజుల పాటు కఠిన నిరాహారదీక్ష చేసి తన ఆశయసాధనలో ప్రాణాలర్పించి 1952 డిసెంబర్ 15న అమరజీవి అయ్యారన్నారు. ఆయన ప్రాణత్యాగం తర్వాత డిసెంబర్ 19న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేస్తూ అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిందన్నారు. అమరణ దీక్షలో రోజులు గడిచే కొద్దీ ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ మనోధైర్యంతో, పట్టుదలతో తన లక్ష్యాలను సాధించిన అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన చూపిన పోరాట పటిమ నేటి యువతకు ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఆర్ ఐ , రంగన్న, మున్సిపల్ అధికారులు విక్రమ్ ,ప్రసాద్, దామోదర్ రెడ్డి, పాల్గొన్నారు.