వరుణుడు దెబ్బకు రైతులు విలవిల -చేతికొచ్చిన పంట భూమి పాలు
1 min read– లబో దిబోమంటున్న రైతులు -మిడుతూరు మండలంలో దాదాపు ఐదు కోట్ల నష్టం
-ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలంటున్న రైతులు
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి గాను మిడుతూరు మండలంలో వివిధ రకాలైన చేతికొచ్చిన పంటలు నేలపాలు కావడంతో రైతులు లబోదిబో అంటున్నారు.మండల పరిధిలోని జలకనూరు,అలగనూరు,రోళ్లపాడు,ఖాజీపేట తలముడిపి,మిడుతూరు,49 బన్నూరు,చౌటుకూరు తదితర గ్రామాలలో రైతులు మొక్కజొన్న,మినుము, ఎండుమిర్చి,బొప్పాయి,అరటి తోటలు చేతికొచ్చిన సమయంలో వర్షానికి పంటలు నేలమట్టమయ్యాయి. ఈపంటలను అమ్ముకునే సమయంలో గురువారం రాత్రి అనుకోకుండా భారీ వడగండ్లతో వర్షానికి జలకనూరులో మొక్కజొన్న నేలమట్టమయింది.ఖాజీపేటలో ఎండుమిర్చి మొత్తం నేలపై రాలడంతో రైతులు అల్లాడిపోతున్నారు.అంతేకాకుండా గ్రామాల్లో రైతులు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి చేతికొచ్చిన పంటను అమ్ముకుంటే మేము పెట్టిన ఖర్చు అయినా వస్తుందేమోనని రైతులు ఆశపడ్డారు కానీ వర్షం రావడం వలన ఒక్క జలకనూరు గ్రామంలోనే మూడు కోట్ల రూపాయల వరకు పంట నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు.మండలం మొత్తం మీద ఐదు కోట్ల వరకు దాదాపుగా నష్టం వాటిల్లిందని వివిధ గ్రామాల ప్రజలు అంటున్నారు.ప్రభుత్వం వెంటనే స్పందించి మండలంలో జరిగిన వివిధ రకాలైన పంటల నష్ట పరిహారం సర్వే చేయించి రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని వివిధ గ్రామాల రైతులు కోరుతున్నారు.