శుభాల వసంతం రంజాన్
1 min read– రంజాన్ మాసపు ప్రారంభపు శుభాకాంక్షలు తెలిపిన చైర్మన్
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రంజాన్ మాసం శుభాల వసంతమని నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రంజాన్ ఒక మహత్తర మాసమని ,ఈ పేరు వినగానే మనస్సు భక్తితో,ఆనందంతో పులకరిస్తుందన్నారు .ఈ మాసంలోనే పవిత్ర ఖురాన్ గ్రంధంఅవతరించిందని, రోజా (ఉపవాస వ్రతం)ఆరాధనను దైవం ఈ మాసంలోనే నిర్ణయించి నందున ఈ మాసానికి పవిత్రత, గొప్పదనం వచ్చాయన్నారు. నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో కఠోర ఉపవాసాలు చేయడం మహా పుణ్య కార్యమన్నారు.మహనీయుడైన మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించిన ఈ రంజాన్ మాసంలో నెల రోజులపాటు నియమ నిష్ఠలతో ముస్లింలు కఠిన ఉపవాస వ్రతం ఆచరించి అల్లాహ్ కృపకు పాత్రులవుతారని అన్నారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం ఇచ్చే గొప్ప సందేశం అని ఆయన అన్నారు. కఠినమైన ఉపవాస దీక్ష(రోజా) ఆచరిస్తూ, దైవ చింతనతో గడిపే ఈ రంజాన్ మాసంలో ముస్లింలు తమ సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు దానధర్మాల ద్వారా ఖర్చు చేస్తారని అన్నారు. మనిషిలోని చెడు భావాల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపుతూ మానవాళికి హితాన్ని బోధించే పండుగ రంజాన్ అని ఆయన అన్నారు . ఈ మాసం వాతావరణమంతా పుణ్యకారం, దైవభీతి అనే సుగుణాలతో నిండాలని,ఈ పవిత్ర రంజాన్ మాసం మానవాళికి శాంతి సందేశం అందించాలని ,అందరి ఇంట సుఖ శాంతులు నిండాలని, రంజాన్ శోభతో నందికొట్కూరు పట్టణం విరాజిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఉపవాస దీక్షలుకు, ప్రత్యేక ప్రార్థనలుకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా విద్యుత్, మున్సిపాలిటీ శాఖలు ప్రత్యేక చొరవ చూపాలని ఆయన సూచించారు. ఈ సంధర్బంగా చైర్మన్ సుధాకర్ రెడ్డి ముస్లిం సోదరులుకు రంజాన్ మాసపు ప్రారంభపు శుభాకాంక్షలు తెలిపారు.