వేసవిలో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోండి
1 min read– వడగాల్పులపై అప్రమత్తంగా ఉండండి
– అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: వేసవి దృష్ట్యా జిల్లాలో ఎలాంటి త్రాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసి ఆ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వైయస్సార్ సెంటినరీ హాలులో త్రాగునీటి సరఫరా, వడగాలులు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ నిశాంతి. టి., అడిషనల్ ఎస్పీ రమణ, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ మనోహర్, జిల్లా పరిషత్ డెప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ వేసవి దృష్ట్యా ఎండిపోయిన బోర్లకు డీపనింగ్, ఫ్లషింగ్ తదితర మరమ్మత్తులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. పాఠశాలలు, గ్రామాలలో ఫంక్షన్ లో లేని ఆర్.ఓ ప్లాంట్ లను గుర్తించి రిపేర్లు చేయాలన్నారు. నంద్యాల పట్టణంలో మరమ్మతులకు గురైన మూడు పవర్ బోర్ వెల్స్ ను తక్షణం వినియోగంలోకి తీసుకురావాలని మున్సిపల్ కమిషనర్ ను కలెక్టర్ ఆదేశించారు. పారిశుధ్య పనులను ముమ్మరం చేయడంతో పాటు దోమల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించి ఓఆర్ హెచ్ ఎస్ ట్యాంకులను శుభ్రపరచడంతో పాటు క్లోరినేట్ చేసిన నీటిని సరఫరా చేయాలని జిల్లా పంచాయతీ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాల్లో కూడా ఈఓఆర్డీలు, పంచాయతీ సెక్రటరీల ద్వారా పారిశుద్ధ పనులను ముమ్మరం చేయాలన్నారు. డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రబలకుండా ఫాగింగ్ చేయడంతో పాటు అత్యవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని డి ఎం హెచ్ ఓ, మలేరియా అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
వడగాల్పులపై అప్రమత్తంగా ఉండండి
ఎండ తీవ్రత, వడగాల్పుల బారినపడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండేలా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ వేసవికాలం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఐఎండి హెచ్చరిస్తున్న నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉంటూ మున్సిపల్, మండల కేంద్రాల్లో చలివేంద్రాలు, చలవ పందిళ్లు ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్ పోలీసులకు కూలింగ్ జాకెట్లు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మండల స్థాయిలో ఎండ తీవ్రత, వడగాలులపై అధికారులతో సమీక్షలు నిర్వహించుకొని చేపట్టాల్సిన ముందస్తు జాగ్రత్తలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డిపిఓ శ్రీనివాసులు డిఆర్డిఏ పిడి శ్రీధర్ రెడ్డి డ్వామా పిడి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.