స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణతో క్రమశిక్షణ, సేవా భావం పెంపొందుతుంది
1 min read– డీఈఓ ఎద్దుల రాఘవరెడ్డి
పల్లెవెలుగు అన్నమయ్య జిల్లా రాయచోటి: స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణతో విద్యార్థులలో క్రమశిక్షణ, సామాజిక సేవ, దేశ భక్తి పెంపొందుతుందని జిల్లా విద్యాశాఖాధికారి ఎద్దుల రాఘవరెడ్డి తెలిపారు. కడప, అన్నమయ్య జిల్లాలలోని స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లకు బేసిక్, అడ్వాన్స్డ్ శిక్షణ శంకరాపురంలోని స్కౌట్ ప్రాంతీయ కార్యాలయంలో శుక్రవారం నుండి ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాఘవరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం ద్వారా మంచి పౌరులుగా తీర్చిదిద్దేందుకు స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ కు చెందిన స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లు అందరూ ఏడు రోజులపాటు ఇచ్చే ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బేసిక్ శిక్షణ పొందిన వారే తమ విద్యార్థులకు సక్రమంగా శిక్షణ ఇచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. కాబట్టి యూనిట్ లీడర్లు అందరూ సేవాభావం కలిగి క్రమ శిక్షణతో పనిచేయాలన్నారు. స్కౌట్ క్రమశిక్షణకు మారు పేరని, విద్యార్థి దశలో ప్రతి విద్యార్థి స్కౌట్‌లో చేరాలన్నారు. స్కౌట్ సర్టిఫికెట్ కలవారికి విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ సౌకర్యం కలదన్నారు. ప్రతి పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని స్కౌట్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ సెక్రటరీ మడితాటి నరసింహారెడ్డి, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ లక్ష్మీకర, అసిస్టెంట్ సెక్రటరీ శివప్రసాద్, ట్రెజరర్ రమణయ్య, ఎల్ ఓ సి లు జి.వెంకటేశ్వర్లు, శకుంతలమ్మ స్టాప్ శివప్రసాద్, రెండు జిల్లాల స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లు తదితరులు పాల్గొన్నారు.