ఘోర రోడ్డు ప్రమాదం..
1 min read– ట్రాక్టర్ ను ఢీకొట్టిన బైక్ ..ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి..
– ఒకరికి తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం.కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.
– మృతదేహాలను నందికొట్కూరు ఆసుపత్రికి తరలించారు.బ్రాహ్మణకొట్కూరు పోలీసులు కేసు నమోదు.
– ముగ్గురు ప్రాణ స్నేహితులు..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: గడివేముల మూల పెద్దమ్మ జాతరను కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో ఆనందంగా జరుపుకున్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడిపారు. అంతలోనే అనంత లోకానికి ఇద్దరు వెళ్లిపోయారు. మరొకరు మృత్యువుతో పోరాడుతున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం బ్రాహ్మణ కొట్కూరు సమీపంలో కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో బైక్ ట్రాక్టర్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరొక యువకుడు తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతున్న ఘటన బుధవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. నందికొట్కూరు పట్టణం పగిడ్యాల రోడ్డు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నగర్ కు చెందిన ముగ్గురు యువకులు దీపక్, జనార్దన్ లు నందికొట్కూరు నుండి కర్నూలుకు తమ స్నేహితుడు మధును వదిలి రావడానికి ఏపీ 21 సి హెచ్ 5910 బైక్ పై వెళ్తున్నారు.ఈ క్రమంలో బ్రాహ్మణకొట్కూరు గ్రామం దాటినా తరువాత ముందుగా వెళ్తున్న ట్రాక్టర్ ను తప్పించబోయి ప్రమాదవ శాత్తు బైక్ ట్రాక్టర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జనార్దన్ (23), దీపక్ (22) లు అక్కడికక్కడే మృతి చెందగా మధు (22) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న బ్రాహ్మణకొట్కూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడిన మధును కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి , మృతి చెందిన వారి మృత దేహాలను నందికొట్కూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. యువకుల కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ ఓబులేష్ తెలిపారు. ఆసుపత్రి ఆవరణలో బంధువుల రోదనలు మిన్నంటాయి. అతివేగమే ప్రమాదానికి కారణమని సమాచారం .
జనార్దన్ మృతి కుటుంబానికి తీరనిలోటు ..
నందికొట్కూరు పట్టణానికి చెందిన అంబన్న, కృష్ణవేణమ్మ లకు ఇద్దరు కుమారులు. అయితే పెద్ద కుమారుడు జనార్దన్. ఈ యువకుడు హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ సంస్థలో సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నాడు. కుటుంబ సభ్యులు గడివేములలో మూల పెద్దమ్మ జాతర చేయడంతో పండగకు వచ్చాడు. జాతర ముగిసిన అనంతరం స్నేహితులతో కలిసి కర్నూలు కు వెళుతూ మృతి చెందడం తో కుటుంబం శోకసంద్రంలో వున్నారు.
సాఫ్ట్ వేర్ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న దీపక్ :
దీపక్ తల్లి ఉమాదేవి కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. పెద్దమ్మ రమాదేవి వద్ద ఉంటూ డిగ్రీ పూర్తి చేసుకొని సాఫ్ట్ వేర్ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు. దీపక్ కు ఈ మధ్యలోనే సాఫ్ట్ వేర్ ఉద్యోగం వచ్చినట్లు తెలిసింది. త్వరలోనే సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో చేరాల్సి ఉంది. అంతలోనే ఈ ఘటనా జరగడం తో కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు.జనార్దన్, దీపక్ లు ఇద్దరు ప్రాణ స్నేహితులు. అయితే ఇద్దరు కి మంచి మిత్రుడైన మధు కలిసి కర్నూలు కు బయలుదేరారు. మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదం జరగడం వల్ల మధ్యలోనే మృతి చెందారు. దీపక్ మృతితో కుటుంబానికి తీరని లోటని కాలనీ వాసులను, బంధు మిత్రులను ఈ సంఘటన కలచివేసింది.సన్నాయి తోనే కుటుంబ పోషణ : సన్నాయి వాయిస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటూ కుటుంబానికి ఆసరాగా వున్నారు మధు. మిత్రులు అయిన జనార్దన్, దీపక్ లతో కలిసి కర్నూలుకు బయలు దేరారు మధు. మార్గమద్యంలో ముందుగా వెళ్తున్న ట్రాక్టర్ ను తప్పించబోయి ప్రమాదవశాత్తు బైక్ ప్రమాదానికి గురైంది.