జగనన్న మాటంటే.. మాటే..!
1 min read– డ్వాక్రా మహిళలకు ఆసరా పథకంతో రుణమాఫీ
– గత ప్రభుత్వం మాదిరిగా మభ్యపెట్టే సంస్కృతి కాదు
– శాసనసభ్యులు తొగురు ఆర్థర్
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: అన్న మాటంటే మాటే..అని, ఇచ్చిన మాటకు కట్టుబడి డ్వాక్రా మహిళలకు వైఎస్సార్ ఆసరా పథకంతో రుణమాఫీ చేస్తున్నట్లు నందికొట్కూరు శాసనసభ్యులు తొగురు ఆర్థర్ పేర్కొన్నారు. రుణమాఫీ చేస్తానని ఇచ్చిన మాటను నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం మాదిరిగా ఎన్నికల ముందు పసుపుకుంకుమ పేరుతో మభ్యపెట్టే సంస్కృతి మాది కాదన్నారు.
జూపాడుబంగ్లా మండలంలో 725 సంఘాలకు రూ.3.84 కోట్లు.
జూపాడుబంగ్లా మండల సమాఖ్య పొదుపు భవనం ఆవరణలో వైయస్సార్ ఆసరా ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి శాసనసభ్యులు తొగురు ఆర్థర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అక్కచెల్లెమ్మల తరపున సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. జూపాడుబంగ్లా మండలంలోని 725 పొదుపు సంఘాల్లోని అక్కాచెల్లెమ్మలకు రూ.3,84,27,880 లను విడుదల చేసినట్లు వెల్లడించారు. జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఎన్నికల హామీలు అమలు చేయని గత ప్రభుత్వం.
గత ప్రభుత్వం ఎన్నికల ముందు దాదాపు 600 హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే 9 హామీలు ఇచ్చి వాటికి సంక్షేమ క్యాలెండర్ రూపొందించి, నీతికి, నిజాయితీకి మారుపేరుగా పేదలకు పథకాలను అమలు చేస్తున్నారన్నారు. కరోన సమయంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయినప్పటికీ ఆడిన మాట తప్పకుండా ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తుంటే, పనీపాట లేని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అసత్యప్రచారంతో బురదజల్లుతున్నాయన్నారు.
గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పిన అక్కచెల్లెమ్మలు: గత ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని చెప్పి, 2019లో ఎన్నికల ముందు ఓట్లు కొనేందుకు పసుపుకుంకుమ అని కొత్త ఎత్తుగడ వేస్తే దాన్ని అక్కచెల్లెమ్మలు తిప్పికొట్టి తగిన బుద్ధి చెప్పారన్నారు. మాట తప్పని, మడప తిప్పని నాయకుడు జగనన్నకు అధికారం అప్పగించారు కాబట్టే నేడు సంక్షేమ పథకాలైన అమ్మఒడి, ఆసరా, రైతుభరోసా, సున్నావడ్డీ, చేయూత, చేదోడు, వసతి, విద్యా దీవెన, పేదలందరికి ఇళ్లు, పింఛన్లు ఇలా ఏ పథకాన్ని వెనక్కి తగ్గకుండా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇలా ఏపీలో తమ ప్రభుత్వంలో రూ.2,35,000 కోట్ల రూపాయలను సంక్షేమ పథకాలకు చెల్లించినట్లు స్పష్టం చేశారు. పేదల సంక్షేమం పట్ల ఉన్న నిబద్ధతకు ఇది తార్కాణమన్నారు.అనంతరం డ్వాక్రా మహిళలకు ఆసరా మెగా చెక్ ను అందజేశారు.పొదుపు మహిళలు సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ సువర్ణమ్మ సర్పంచి మోతే బాలయ్య , ఇంచార్జి ఎంపీడీఓ మణి మంజరి, తహశీల్దార్ పుల్లయ్య, ఏపీఎం అంబమ్మ , ఏరియా కో ఆర్డినేటర్ డేగలయ్య, ఎస్సి ఎస్టీ సెల్ విజిలెన్స్ మానిటరింగ్ సభ్యులు దిలీప్ , వైసీపీ నాయకులు జంగాల పెద్దన్న, కరుణాకర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, పొదుపు గ్రూపు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.