ఆ నలుగురు… వారే..
1 min read– వృద్దురాలి అంత్యక్రియలు జరిపిన తహసీల్దార్, సర్పంచ్
పల్లెవెలుగు వెబ్, గడివేముల: మండలంలో కరోన కేసులు రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో.. కుటుంబీకుల మధ్య సత్సంబంధాలు కూడా దూరమవుతున్నాయి. మండలంలోని కొరటమద్ది గ్రామంలో ఓ కుటుంబ సభ్యులందరికీ కోవిడ్ పాజిటివ్ వచ్చింది. వారందరూ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆ కుటుంబంలోని 85 ఏళ్ల వృద్ధురాలు ఆకస్మికంగా మృతి చెందడంతో.. ఆమె అంత్యక్రియలు కుటుంబ సభ్యులు జరపలేని పరిస్థితి.
విషయం తెలుసుకున్న గడివేముల తహసీల్దార్ నాగమణి దగ్గరుండి అంత్యక్రియలు జరిపి మానవత్వం చాటుకున్నారు. తహసీల్దార్‌తోపాటు సర్పంచ్ నాగేశ్వర రెడ్డి, రెవెన్యూ సిబ్బంది ఇద్దరు వృద్దురాలి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ వృద్ధురాలి కుటుంబ సభ్యులకు కోవిడ్ పాజిటివ్ రావడంతో.. వారు చికిత్స పొందుతున్నారు. ఆ కుటుంబంలోని వృద్దురాలు చనిపోతే.. ఎవరూ లేరని తెలుసుకుని.. అంత్యక్రియలు జరిపించినట్లు వివరించారు.