గర్భిణీ స్త్రీలు రక్త హీనత తో ప్రసవానికి వెళ్లే పరిస్థితి రాకూడదు
1 min read– పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ ఇవ్వాలి
– ముఖ్యమంత్రి చీఫ్ ఎగ్జిక్యూటివ్ (సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు) డా.సమీర్ శర్మ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: మహిళలు, శిశువులు,విద్యార్థులకు రక్త హీనత నివారణ అంశంలో మెడికల్ అండ్ హెల్త్ , మహిళా శిశు సంక్షేమ శాఖ , విద్యాశాఖ , సంక్షేమ శాఖ అధికారులు సమన్వయంతో పని చేసి పురోగతి సాధించాలని ముఖ్యమంత్రి చీఫ్ ఎగ్జిక్యూటివ్ (సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు) డాక్టర్ సమీర్ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన, డిజిటలైజేషన్, డేటా ఇంటిగ్రేషన్ అవుట్రీచ్ పోర్టల్ అంశాలపై సంబంధిత జిల్లా అధికారులు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులతో, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో డాక్టర్ సమీర్ శర్మ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన అంగన్వాడీ లలో ఐదేళ్ల లోపు శిశువుల ఆరోగ్యం, రక్తహీనత, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రల పంపిణీ,సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు రక్త హీనత, గర్భవతులకు రక్త హీనత, నివారణ చర్యలపై క్షేత్ర స్థాయిలో అమలు జరుగుతున్న తీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.తొలుత ఆదోని మండలానికి సంబంధించి అంగన్వాడీల్లో ఎంతమంది పిల్లలు రిజిస్టర్ అయ్యారు, ఎంతమందికి బరువు మరియు ఎత్తు పరీక్షలు నిర్వహించారని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఐసీడీఎస్ ఇంఛార్జి పిడి, ఆదోని ఐసీడీఎస్ సిడిపివో లను ప్రశ్నించారు..తన పరిధిలో మొత్తం 226 అంగన్వాడీ సెంటర్లకు గాను 9,777 మంది రిజిస్టర్ అయ్యారని, అందులో 9,633 మందికి బరువు మరియు ఎత్తు పరీక్షలు నిర్వహించామని, ఇందులో 174 మంది వయస్సు కు తగిన బరువు లేరని ఆదోని ఐసీడీఎస్ సిడిపివో వివరించారు. వీరందరికీ వైఎస్సార్ సంపూర్ణ పోషణ కింద పౌష్ఠికాహారం ఇస్తున్నారా, ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రల పంపిణీ జరుగుతోందా అని ఆయన ఆరా తీశారు.. 160 మందికి ఇస్తున్నామని, మిగిలిన వారు గైరు హాజరు కావడం వల్ల ఇవ్వడం లేదని సిడిపివో తెలిపారు.. వైఎస్సార్ సంపూర్ణ పోషణ ఇచ్చిన తర్వాత పిల్లలు బరువు పెరుగుతున్నారా, పిల్లలు అనారోగ్యంగా ఉంటే డాక్టర్ కు రెఫర్ చేస్తున్నారా, వైద్య ఆరోగ్య శాఖ ఈ అంశంలో ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు అని ఆయన అధికారులను ప్రశ్నించారు..జగనన్న గోరుముద్దకి సంబంధించి మిడ్ డే మిల్స్ రికార్డ్ తో పాటు, ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రల పంపిణీ రికార్డ్ ను కూడా నిర్వహించాలని డిఈఓ రంగా రెడ్డిని ఆదేశించారు. మధ్యాహ్న భోజనం చేసే ప్లేట్ లో నే ఈ మాత్రలను పెడితే పిల్లలు తింటారని, ముందే ఇస్తే వాటిని వేసుకోకుండా ఉండే అవకాశం ఉందని ఆయన విద్యా శాఖ అధికారులకు సూచించారు . సంక్షేమ వసతి గృహాలలో 10-19 ఏళ్ల మధ్య ఎంతమంది బాలికలు ఉన్నారు, వారిలో ఎంతమంది రక్త హీనతతో ఉన్నారని సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ప్రతాప్ సూర్యనారాయణ రెడ్డి ని ఆరా తీయగా 140 మంది విద్యార్థులు రక్తహీనత తో ఉన్నారని తెలిపారు. … ప్రెగ్నెన్సీ మహిళలలో ఎంతమంది అనీమిక్ గా ఉన్నారని ఐసీడీఎస్ పిడి ని ఆరా తీయగా 4,733 మంది ఉన్నారని తెలిపారు.. జనవరి నుండి మార్చి మాసం వరకు ఎంతమంది డెలివర్ అయ్యారు వారిలో ఎంతమంది అనీమిక్ గా ఉన్నారని డిఎమ్ హెచ్ఓ ని ఆరా తీయగా 9,318 డెలివరీ లు జరిగితే, ఇందులో 34 మంది అనీమిక్ గా ఉన్నారని డిఎంహెచ్వో డా.రామగిడ్డయ్య వివరించారు. ఈ అంశంపై డా.సమీర్ శర్మ మాట్లాడుతూ మహిళలు, శిశువులు,విద్యార్థులకు రక్త హీనత నివారణ అంశంలో జిల్లా స్థాయిలో మెడికల్ అండ్ హెల్త్ , మహిళా శిశు సంక్షేమ శాఖ , విద్యాశాఖ , సంక్షేమ శాఖ అధికారులు, రాష్ట్రీయ బాల స్వాస్త కార్యక్రమం ప్రాజెక్ట్ అధికారి హేమలత కలిసి వారానికి ఒకసారి సమీక్షలు నిర్వహించుకుని సమన్వయంతో పని చేసి రక్త హీనత ను గుర్తించి నివారణ చర్యలు కూడా అమలు చేయాలని సూచించారు…ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో కూడా ఆయా శాఖలకు సంబంధించిన మండల, డివిజన్, గ్రామ స్థాయిలో అధికారులతో సమీక్షలు నిర్వహించాలని, తదనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు..ఎంపిడిఓ లు కూడా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో ఈ అంశంపై సమీక్షించి, వారి సేవలు కూడా ఇందుకోసం వినియోగించుకోవాలని సూచించారు..ఏ ఒక్క మహిళ కూడా రక్త హీనతతో ప్రసవం కాకుండా చర్యలు తీసుకోవాలని డిఎమ్ హెచ్ఓకు సూచించారు .హాస్టళ్లలో విద్యార్థులు రక్తహీనత కు గురి కాకుండా మెనూ లో మంచి పౌష్ఠికాహారం అందించేలా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.పదవ తరగతి తర్వాత విద్యార్థులు ఇంటర్మీడియట్, ఐటిఐ, పాలిటెక్నిక్ వెళ్తున్నారా, అదే విధంగా ఫెయిల్ అయిన విద్యార్థులు ఏం చేస్తున్నారనే విషయంపై కూడా విద్యా శాఖ అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు.. ఉన్నత విద్యకు వెళ్లని వారు, ఫెయిల్ అయిన విద్యార్థులను గుర్తించి వాటికి స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించిన శిక్షణ అందించి వారు ఏదో ఒక అంశంలో నైపుణ్యాన్ని సాధించి, ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.. విద్యార్థులు డ్రాప్ అవుట్ అవ్వకుండా చూడాలని సర్వ శిక్ష అభియాన్ పిఓ ని ఆదేశించారు.జిల్లా కలెక్టర్ పి కోటేశ్వర రావు మాట్లాడుతూ జిల్లాలో రక్త హీనత నివారణ అంశంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని వివరించారు..వైద్య, ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో బాలికలు, శిశువులు, గర్భవతులు రక్త హీనత పరీక్షలు నిర్వహించి, నివారణ చర్యలు కూడా చేపడుతున్నట్లు వివరించారు..ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోనే కాకుండా, డ్రాపవుట్ అయి బయట ఉన్న 10 నుండి 19 ఏళ్ల బాలిక లు అందరికీ హీమో గ్లోబిన్ పరీక్షలు నిర్వహించి, రక్త హీనత ఉన్న వారికి తగిన చికిత్స కూడా అందించడం జరుగు తోందని కలెక్టర్ వివరించారు.సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.రామ సుందర్ రెడ్డి, కర్నూలు మునిసిపల్ కమిషనర్ భార్గవ్ తేజ, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, సిపివో అప్పలకొండ, ఆర్డీవోలు,సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.