నందికొట్కూరు సైకిల్ ఎక్కేదేవరు..?
1 min readనందికొట్కూరులో టీడీపీ అభ్యర్థి ప్రకటన పై సందిగ్ధత.
నియోజకవర్గంలో పుంజుకుంటున్న తెలుగుదేశం.
టీడీపీలో జోష్ నింపిన ఎమ్మెల్సీ ఫలితాలు..
టికెట్ ఆశిస్తున్నా ఆశావహుల జాబితా పెద్దాదే..
రేసులో.. కాకరవాడ చిన్న వెంకటస్వామి..గిత్త జయసూర్య.. బండి జయరాజు.. మరో వైద్యాధికారి.. ?
జిల్లా అధ్యక్షునిగా గౌరు వెంకటరెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి పార్టీ బలోపేతం
వై కాపా వైఫల్యాలే అజెండాగా ముందుకు వెళ్తున్న టీడీపీ నేతలు..
సమీపిస్తున్న 2024 సార్వత్రిక ఎన్నికలు..
గౌరు వెంకట రెడ్డి ఆధ్వర్యంలో పుంజుకుంటున్న టీడీపీ .
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: అధికార.. ప్రతిపక్ష.. చిన్న చితక పార్టీలు అనధికారికంగా ఎన్నికలకు శంఖారావం పూరించాయి. ఎమ్మెల్సీ ఫలితాలతో జోష్ మీదున్న టీడీపీ 2024 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధంకండి అని ప్రకటించి రాజకీయంగా ఎన్నికల వేడిని పుట్టించింది.జగనన్నే మా భవిష్యత్తు.. గడప గడపకు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రజల్లో మమేకం కావాలని వైకాపా తమ పార్టీ నాయకులను వెంటబడుతుంటే, టి.డి.పి. నాయకత్వం నియోజకవర్గాల పర్యటనలతో ప్రజలకు చేరువయ్యే ప్రణాళిక సిద్ధ చేస్తుంది. అయితే ఇవన్ని మరింత ముందుకు సాగాలంటే ఏ పార్టీకైనా అభ్యర్థులు అవసరం. ఇప్పటికే అందరి దృష్టి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలు పెట్టారు. కాగా అధికార పార్టీకి ప్రజా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనే ప్రచారం ఊపందుకోవడంతో తెలుగుదేశం స్థానాలకు అభ్యర్థుల ఎంపికకు ప్రాధాన్యత పెరిగింది. పాత కొత్తవారు టిడిపిలో తెరపైకి వస్తున్నారు. కొన్ని చోట్ల రాబోయే ఎన్నికల్లో అభ్యర్థులు వీరే నంటూ ఇప్పటికే కొన్ని చోట్ల తెలుగుదేశం ప్రకటించింది. అయితే ఆ ఎన్నికల అలజడి నందికొట్కూరులోని టీడీపీలో కూడా మొదలైంది. తెలుగుదేశం పార్టీ తరపున అభ్యర్థులు ఎవరా అంటు అప్పుడే చర్చ మొదలైంది.ఆశావహుల పేర్లు కూడ బయటికి వస్తున్నాయి.
టిడిపి టికెట్ ఆశిస్తున్నా ఆశావహులు.. నందికొట్కూరు ఎస్.సి.లకు నియోజక వర్గం రిజర్వు కావడంతో కొత్త అభ్యర్థులు తెరపైకి వచ్చి ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. నందికొట్కూరు నియోజకవర్గానికి ప్రత్యక రాజకీయ చరిత్ర వుంది. అతిరథ మహారథులు రాజకీయ ఉద్ధండులు. కొలువైన ప్రాంతమైన వారంత ఇతర నియోజకవర్గాల్లో రాజకీయంగా స్థిరపడిన వారి ప్రభావంతోనే ఇక్కడ ఇప్పటికీ రాజకీయాలు కొనసాగుతు న్నాయి. ఇప్పుడు వైకాపా పార్టీ ఎమ్మెల్యేగా తొగురు ఆర్డర్, శాప్ చైర్మన్ గా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వుండ గా నియోజకవర్గ టి.డి.పి. ఇన్చార్జి గా గౌరు వెంకటరెడ్డి కొన సాగుతున్నారు. గతంలో టి.డి.పి. నంద్యాల ఎంపిగా బరిలోకి దిగిన మాండ్ర శివానందరెడ్డి వర్గానికి చెందిన బండి జయరాజు గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోలాహాలం మొదలైంది . రాష్ట్రంలో వైకాపా వట్ల ప్రజా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనే ప్రచారం జోరు అందుకోగా ఇక్కడ టి.డి.పి. అభ్యర్థి ఎవరా అనే చర్చ మొద లైంది. నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి గౌరు వెంకట రెడ్డి కి స్వయాన బావ అయిన మాండ్ర సూచించిన బండి జయరాజ్ మరోసారి బరిలోకి దించుతారా లేక అధిష్టానం సూచనలతో గౌరు వెంకట రెడ్డి మరో అభ్యర్థిని ఎంపిక చేస్తారా .. లేక ఒకే మాటకు కట్టుబడి ఒకే అభ్యర్థిని రంగంలోకి దించి తమ సత్తాను చాటుతారా అనే విషయం ప్రశ్నగానే వుంది. గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఉంటుందని ఇందులో సీనియర్లు అని ఓటమి పాలయ్యే వ్యక్తులకు సీటు ఇచ్చే ప్రసక్తేలేదని ఇటీవలే పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. కాగా నంది కొట్కూరులో టి.డి.పి.అభ్యర్థిగా కాకరవాడ చిన్న వెంకటస్వామి..గిత్త జయసూర్య.. మరో ప్రముఖ వైద్యాధికారి పేరు తెరపైకి వచ్చిందనే ప్రచారం జరుగుతుంది. నియోజక వర్గంలో ప్రచారం చేసుకునేందుకు పార్టీ పెద్దలు ఆయనకు గ్రీన్ సిగ్నిల్ ఇచ్చినట్లే నని అదే పార్టీలోని కొందరు నాయకుల మధ్య చర్చ జరుగుతుంది. కుల సమీకరణాలు నేపధ్యంలో ఎస్సి లలోని ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తా రోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తెలుగుదేశం పార్టీకి కంచుకోట… నంద్యాల జిల్లా నంద్యాల పార్లమెంట్ పరిధిలోని నందికొట్కూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రోజు రోజుకు బలపడుతుంది. వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక్కటే లేకున్నా ఒక్కటే అనే పరిస్థితుల్లో వైకాపా నాయకులు వున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి 4 ఏళ్ళు అవుతున్న ఇప్పటికీ కార్యకర్తలకు ఎలాంటి కాంట్రాక్టు పనులు , పదవులు , గ్రామాల్లో అభివృద్ధి కనిపించకపోవడంతో తెలుగుదేశం పార్టీ వైపు కార్యకర్తలు వెళ్లే ఆలోచనల్లో వున్నారు. 10 ఏళ్ళు తిరుగులేని పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీకి 2004 ఎన్నికల్లో చుక్కెదురైంది. ఒకప్పుడు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి హాయంలో తిరుగులేని పార్టీగా నందికొట్కూరుకు కంచుకోటగా ఉన్న తెలుగుదేశం పార్టీకి 2004,2009 లో అపజయం ఎదురైంది.ఆ తర్వాత 2014 నుంచి పూర్తిగా గత పది సంవత్సరాలుగా వైకాపా జెండా నియోజకవర్గంలో ఎగురుతుంది. అందుకు కారణం తెలుగుదేశం పార్టీకి బలమైన నాయకుడు లేకపోవడమే కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నంద్యాల పార్లమెంట్,జిల్లా అధ్యక్షులుగా గత ఏడాది నుండి గౌరు వెంకట రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఆయన అనుచర వర్గం అంత ఆయనతో పాటు నడుస్తూ , ఆయన ఆధ్వర్యంలో నందికొట్కూరు నియోజకవర్గ కార్యకర్తలు వైకాపా పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీకి ఒక వన్నె తీసుకొని వస్తున్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా గెలవని పరిస్థితి. అందులో భాగంగా అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, పార్టీ గెలవాలంటే ఎంత కష్టపడాలి అన్న విషయాలు కార్యకర్తలకు చెబుతూ పార్టీని అభివృద్ధి పథంలో నడిపించేందుకి సలహాలు సూచనలు ఇస్తున్నారు. 2024 ఎన్నికల్లో వై కాపా పార్టీని చిత్తు చిత్తుగా ఓడగొట్టాలని ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు గౌరు వెంకటరెడ్డి, మాండ్ర శివానంద రెడ్డి . నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రజల్లో తెలుగుదేశం పార్టీ బలం గా ఉన్నప్పటికి నమ్మకమైన నాయకుడు లేరని కార్యకర్తలలో ఆందోళన కలిగిస్తోంది. గౌరు వెంకటరెడ్డి రాకతో ఆ లోటు తీరిపోయి టీడీపీ బలపడుతుందని నియోజకవర్గ కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు .
ఇప్పటి వరకు నియోజకవర్గ ప్రజల తీర్పు ఇలా.. నందికొట్కూరు నియోజకవర్గంలో 6 మండలాలు 245 పోలింగ్ బూతులు, 1,97, 451 మంది ఓట్లర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 97827, మహిళలు 99614 మంది ,ఇతరులు 10 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటి వరకు 14 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో రెండు సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గెలుపొందారు. ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అప్పట్లో బలంగా ఉండేది. 1994 నుండి 2004 వరకు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే గా పని చేయగా 2004 లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన గౌరు చరితా రెడ్డి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పై గెలుపొందారు. ఆ తరువాత నియోజకవర్గాల పునర్విభజన లో భాగంగా నందికొట్కూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు కావడంతో కాంగ్రెస్ పార్టీ తరపున అప్పటి దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి 2009లో లబ్బి వెంకట స్వామికి కేటాయించగా ఆయన గెలుపొందారు. ఆ తరువాత 2014 ఎన్నికల్లో ఎక్కలదేవి ఐజయ్య వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి భారీ మెజారిటీ తో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుండి తొగురు ఆర్థర్ ఎమ్మెల్యే అభ్యర్థి గా మళ్ళీ 38,691 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. గత 10 ఏళ్లుగా వై కాపా పార్టీ తిరుగులేని పార్టీగా నియోజకవర్గంలో స్థానం ఏర్పాటు చేసుకుంది. కానీ అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం గత మూడు సంవత్సరాలు పూర్తయిన కూడా నేటికి ఒక మండల స్థాయి నాయకుడు కానీ, సామాన్య కార్యకర్త కు కానీ ఎవరికి పార్టీ న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వైకాపా పార్టీ ప్రజలకు సంక్షేమం పేరుతో నిత్యావసర ధరలు పెంచడం, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం చేస్తూ పాలనలో పూర్తిగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శలు కురిపిస్తూ బాదుడే బాదుడు..ఇదేమి ఖర్మ రాష్ట్రానికి వంటి కార్యక్రమాలను చేపట్టి ప్రజలకు వివరిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలకు ఇచ్చిన హామీలు, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పై గళం విప్పేందుకు తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకట రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలంటే నియోజకవర్గంలో బలమైన గళం విప్పే నేతలకు పార్టీ అభ్యర్థులుగా నియమిస్తే ఇంకా ఉత్షాహంతో పార్టీని ఇంకా బలోపేతానికి కృషి చేసి అవకాశం ఉంటుందని సీనియర్ నాయకులు చెబుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న నియంతృత్వ పాలనను ఎండగడుతూ ప్రజలకు మరింత అవగాహన కల్పిస్తూ ప్రజల్లోకి ప్రభుత్వ వైఫల్యాలను వివరించి ముందుకు తీసుకెళ్ళే నాయకులకు టిక్కెట్ కేటాయిస్తే నందికొట్కూరు నియోజకవర్గంలో మళ్ళి తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరే అవకాశం ఉందని నియోజకవర్గ ప్రజలు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.