నందికొట్కూరు .. టీడీపీ టిక్కెట్ గట్టు తిలక్ కేనా..?
1 min readనారాలోకేష్ ‘యువగళం’లో పేరు ప్రకటించే అవకాశం…!
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో సన్నిహిత బంధం..
మాండ్ర శివానంద రెడ్డి, గౌరు వెంకట రెడ్డికి వీరవిధేయుడు..
ఐ టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా సుపరిచితుడు..
వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను… ప్రజల్లోకి దూసుకెళ్లడంలో దిట్ట..
టీడీపీ పెద్దల ఆశీస్సులతో.. బరిలోకి..
రేసులో ఎంత మంది ఉన్నా…గెలిచే వారికే టిక్కెట్ ఇస్తానని స్పష్టం చేశారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పార్టీ కష్టకాలంలో ఉన్నా…. తమనే నమ్ముకున్న సీనియర్ నాయకులకు… కార్యకర్తలకు ప్రాధాన్యతనిస్తూనే…. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించే ఆశావహులకు టిక్కెట్ ఇచ్చేందుకు పార్టీ సిద్ధంగా ఉందని పలు బహిరంగ సభల్లో పార్టీ అధినేత వెల్లడించిన విషయం తెలిసిందే… వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కొత్తరక్తం( యువత) కు అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ దృఢనిశ్చయంతో ఉన్నారు. ఈ క్రమంలో నందికొట్కూరు టీడీపీ టిక్కెట్ గట్టు తిలక్ పేరును ఖరారు చేస్తూ… ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు బాహాటంగా చెబుతున్నాయి.
పల్లెవెలుగు, నందికొట్కూరు: రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన టీడీపీ… ఫుల్ జోష్‌లో ఉంది. నంద్యాల జిల్లాలో నిరుద్యోగ యువత అధిక సంఖ్యలో ఉన్నారన్న విషయం పసిగట్టిన నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకట రెడ్డి నిరుద్యోగ యువత ఓటర్లను రాజకీయ చాతుర్యంతో తన వైపు తిప్పుకోవడంలో సఫలీకృతమయ్యారు. ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లాను టీడీపీ కైవసం చేసుకుని… పార్టీ అధినేతకు గిఫ్ట్ ఇచ్చేందుకు.. పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నారు నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకట రెడ్డి.
గట్టు తిలక్… పార్టీకి సుపరిచితుడే…:
దేవమ్మ, గట్టు బజారి దంపతుల కుమారుడు గట్టు తిలక్ విద్యాసాగర్ బీటెక్ వరకు చదివాడు. వ్యాపార రంగంలో రాణిస్తూ… ఎందరికో ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నాడు. ఐ టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ… వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో దిట్ట. వైసీపీ నాయకుల అరాచకాలు.. భూ దందా… తదితర అంశాలపై ప్రశ్నించడంలో ముందుండే గట్టు తిలక్ పై ఎన్నో కేసులు నమోదయ్యాయి. వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంటున్నాడు.
సేవ చేయాలనే సంకల్పం…:
ఐ టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ… పార్టీకి ఎంతో సేవ చేసిన గట్టు తిలక్ విద్యాసాగర్… పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగనున్నాడు. ముక్కు సూటి తనం… నిజాయితీ.. ప్రజా సేవ చేయాలన్న తపన… యువతను ఆదుకోవాలన్న లక్ష్యంతో బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. కరోన సమయంలో నియోజకవర్గ ప్రజలకు మాస్క్‌లు, ఆహారం, తాగునీరు, మజ్జిగ పంపిణీ చేశారు. ఎస్సీ రిజర్వేషన్ కోటాలో భాగంగా నందికొట్కూరు నియోజకవర్గంలో గట్టు తిలక్ ( ఎస్సీ మాదిగ) పోటీలో నిలబెడేందుకు ఇప్పటికే పార్టీ పెద్దలతో చర్చించినట్లు తెలుస్తోంది.
పార్టీ పెద్దలతో… గ్రీన్ సిగ్నల్ ?
నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకట రెడ్డి, కర్నూలు జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, సీనియర్ నేత మాండ్ర శివానంద రెడ్డి, ఐటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు చింతకాయల విజయ్‌కు వీరవిధేయుడుగా ఉంటూ…పార్టీ నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో గట్టు తిలక్ కీలకపాత్ర పోషించారు. నందికొట్కూరు టీడీపీ టిక్కెట్ పై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగానే ‘ యువగళం’లో నారా లోకేష్ నందికొట్కూరు టీడీపీ టిక్కెట్‌ను గట్టు తిలక్ విద్యాసాగర్‌ను ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.