విజయవాడ మార్గం ద్వారా కాశ్మీర్‌కు నూతన రైలు
1 min readపల్లవెలుగు వెబ్ విజయవాడ: భారతీయ రైల్వే ప్రారంభించిన భారత్ గౌరవ్ పథకం కింద రైలు సేవలనందిస్తున్న సౌత్ స్టార్ రైల్, ఇప్పుడు కాశ్మీర్ లోయకు రైలు సర్వీసును ప్రారంభించిందని ట్రావెల్ టైమ్స్ ఇండియా ప్రొడక్ట్ డైరెక్టర్ విఘ్నేష్ తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఈ రైలు కోయంబత్తూర్‌లో ప్రారంభమై, బెంగళూరులోని యెలహంక మీదుగా ప్రయాణిస్తుంది. ఈ సమ్మర్ హాలీడే ప్రత్యేక రైలు బుక్కింగ్స్ ప్రారంభమయ్యాయి. సౌత్‌స్టార్ రైల్ యొక్క కాశ్మీర్ ప్యాకేజీ మే 11న ప్రారంభంకానుంది. ఈ రైలు కోయంబత్తూరు వద్ద ప్రారంభమై, తమ తుది గమ్యం చేరే లోపుగా ప్రయాణీకులు ఈరోడ్, సేలం, ధర్మపురి, హోసూర్, యెలహంక, పెరంబూర్, విజయవాడ, వరంగల్‌లలో రైలు ఎక్కవచ్చు. ఈ టూరింజం ప్యాకేజీ మొత్తం వ్యవధి 12రోజులు. ఈ రైల్‌లో ఎన్నో ప్రత్యేక ఆకర్షణలు ఉన్నాయి. సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక సదుపాయాలు ఉంటాయి. అపరిమిత దక్షిణాది వంటకాలు లభ్యమవుతాయి. భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. ప్రయాణీకులు కోచ్‌లలోని లాకర్లలో తమ లగేజీని భద్రపరుచుకుని సైట్ సీయింట్‌కు వెళ్లవచ్చు. ఈ రైల్ టిక్కెట్ ధరలో ట్రైన్ ఫేర్, బీమా, బెడ్ కిట్ , రూమ్స్, భోజనాలు, బేవరేజస్, సైట్ సీయింగ్, ట్రాన్స్‌ఫర్స్ ఖర్చులు కూడా కలిసి ఉంటాయి. ఈ టూర్ అంతటా టూర్ మేనేజర్లు తగిన సహాయం అందించడానికి సిద్ధంగా ఉంటారు’ అని వివరించారు. ఈ సమావేశంలో ట్రావెల్స్ టైమ్స్ ఇండియా రీజనల్ మేనేజర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.