PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఒక్క విద్యార్థి కూడా బడి బయట ఉండకూడదు

1 min read

– మహిళల విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి : జిల్లా కలెక్టర్ డా.జి.సృజన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : ఒక్క విద్యార్థి కూడా బడి బయట ఉండకూడదని, మహిళల విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన విద్యా శాఖ అధికారులను ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.తొలుత జిల్లాలో మొత్తం ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు కలిపి 2239 ఉన్నాయని, అందులో 13,637 మంది ప్రైవేట్, ప్రభుత్వ ఉపాధ్యాయులు అని, విద్యార్థులు 4,50,671 మంది ఉన్నారన్నారు. అందులో మోడల్ స్కూల్స్ 16, ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ పాఠశాలలు 8 ఉన్నాయని,వాటిలో బాలబాలికలకు ప్రత్యేక వసతి గృహాల ఉన్నాయని, జిల్లా వ్యాప్తంగా 4.50లక్షల మంది విద్యార్థులు పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారని డీఈవో వివరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేకంగా బాలికలకు వసతి గృహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, వాటికి సంబంధించిన నివేదికను అందజేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అదే విధంగా బడి బయట పిల్లలు ఎంత మంది ఉన్నారో CRP లు, సచివాలయాల్లో ఉన్న సంక్షేమ, ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, ANM లు ,అంగన్వాడీ వర్కర్స్ తో ఇంటింటి సర్వే జాయింట్ గా చేయాలని డీఈవో ను ఆదేశించారు..ఒకవేళ వారు వలసలు వెళ్ళి అయ్యింటే ఎక్కడికి వెళ్ళారు అన్న వివరాలను కూడా సేకరించాలన్నారు. గ్రామ,వార్డు సచివాలయాలు,విద్యా, వైద్య, మహిళా శిశు సంక్షేమ శాఖలు ఈ అంశంలో సమన్వయం తో పని చేయాలని సూచించారు..ఏ ఒక్క విద్యార్థి కూడా బడి బయట ఉండకూడదని, ప్రతి పిల్లవాడు విద్యను అభ్యసించడం చాలా ముఖ్యమని, దానితో పాటు విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం ముఖ్యమని కలెక్టర్ సూచించారు.జిల్లాలో మహిళల అక్షరాస్యత కేవలం 40 శాతం మాత్రమే ఉందని, దీనితో పోలిస్తే గిరిజన ప్రాంతాల్లోని మహిళలు చాలా ముందంజలో ఉన్నారన్నారు.. జిల్లా తొలి మహిళ సర్వోన్నత అధికారిగా మహిళల విద్య అభివృద్ధికి కృషి చేయడంతో పాటు బాల్య వివాహాల మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తానన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, ఇతర మండల స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేసి బాల్య వివాహాలు లాంటి మూఢనమ్మకాలు నుంచి వారిని బయటకు తీసుకొని రావాలన్నారు. . వసతి గృహాల నుండి ఇళ్లకు వెళ్లిన విద్యార్థినులకు పెళ్లి చేస్తారనే భయం ఉండకూడదన్నారు.. అందుకోసమే మండల స్థాయి స్పెషల్ అధికారి వ్యవస్థను ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. జిల్లాలో ఉన్న వెనుకబాటు నిర్మూలనకు పూర్తి స్థాయిలో సమిష్టి కృషి చేయాలన్నారు. టీచర్స్, స్టూడెంట్స్ అటెండెన్స్, ఆర్టీఐ యాక్ట్ 25 శాతం పేద పిల్లలు సీట్లు, కన్సిస్టెంట్ రిథమ్ ఇన్స్పెక్షన్స్, స్పాట్ వెలివేషన్, బైజుస్ ట్యాబ్స్ తదితర స్లైడ్స్ పై డిఈఓ వివరించారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి 1436 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందజేయడం జరుగుతుందని, రివైజ్డ్ మెనూ కూడా ప్రతి స్కూల్ లో ప్రదర్శించడం జరుగుతుందన్నారు. పాఠశాలల్లోని విద్యార్థులకు ఏ ఏజెన్సీ మధ్యాహ్న భోజనం వండుతున్నారని జిల్లా కలెక్టర్ అడుగగా స్వయం సహాయక సంఘాల మహిళలే వండుతున్నారని మధ్యాహ్న భోజన సహాయ సంచాలకులు శామ్యూల్ పాల్ జిల్లా కలెక్టర్ కు తెలిపారు. వారికి సరైన సమయంలో చెల్లింపులు చేసేలా చూడాలని కలెక్టర్ సూచించారు.. పాఠశాలలో విద్యార్థులకు రక్తహీనత లేకుండా ఐఎఫ్ఎస్ టాబ్లెట్స్ అందజేయాలన్నారు. నాడు-నేడుకు సంబంధించి ఫేజ్-1లో 594 పాఠశాలలు పూర్తి చేశామని, ఫేజ్-2లో 1081 స్కూల్స్ నిర్మాణం జరుగుతుందన్నారు. ఫేజ్-1లో అదనపు తరగతుల నిర్మాణం కానివి కూడా ఫేజ్-2 లో నిర్మించడం జరుగుతుందన్నారు. వీటిని నిర్మించే ఏజెన్సీలు ఏవి అని జిల్లా కలెక్టర్ ను అడుగగా పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఎస్ఎస్ఏ, ఏపీఈడబ్ల్యుడిసి, ఎంఐయుడిసి సమన్వయంతో నిర్మించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా నాడు-నేడులో మొదలుకాని వాటికి సంబంధించి కోర్టు కేసులు ఉన్నాయని జిల్లా కలెక్టర్ కు వివరించారు. సమావేశంలో డిఈఓ రంగా రెడ్డి, ఎస్ఎస్ఏ పిఓ వేణుగోపాల్, మధ్యాహ్న భోజన సహాయ సంచాలకులు శామ్యూల్ పాల్, సెక్టోరల్ ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు.

About Author