ప్రసూతి మరణాలు.. శిశు మరణాలు జరగకుండా ప్రత్యేక శ్రద్ధ వహించండి
1 min readజిల్లా కలెక్టర్ డా.గుమ్మళ్ళ సృజన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రసూతి మరణాలు మరియు శిశు మరణాలు జరగకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ డా.గుమ్మళ్ళ సృజన వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ అంశాలపై వైద్యాధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలలో జరిగినటువంటి ప్రసూతి మరణాలు మరియు శిశు మరణాలకు సంబంధించి ఎక్కువ మంది చనిపోవడానికి గల కారణాలు, ఎన్ని రోజులలో చనిపోయారు వాటికి సంబంధించిన ప్రతి ఒక్క కేసును వచ్చే సమావేశానికి నివేదికల రూపంలో తీసుకొని రావాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.రామ గిడ్డయ్యను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గర్భవతులకు ఐ సి డి ఎస్ ద్వారా పౌష్టికాహారము మరియు గుడ్లు ఇచ్చినప్పటికీ కూడా ఇటువంటి మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి, వారికి పౌష్టికాహారము మరియు కోడిగుడ్లు అందుతున్నాయా, ఒకవేళ వారికి అందిన కూడ లోపాలు ఎక్కడున్నాయి అనే అంశంపై సంబంధిత అధికారులు శ్రద్ధ పెట్టాలన్నారు. గర్భవతి మహిళలు రిజిస్టర్ అయ్యారా లేదా చూసే విధంగా కూడ చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయాలు వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్లు పెరిగాయా లేదా అని డాక్టర్ రామ గిడ్డయ్య ను అడిగి తెలుసుకున్నారు. డెలివరీ కి సంబంధించి ఇన్స్టిట్యూషనల్ డెలివరీ తగ్గాయా హోమ్ డెలివరీ తగ్గిపోయాయ ఒకవేళ జరుగుతుంటే ఏ ప్రాంతాలలో జరుగుతున్నాయి అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఫ్లోరోసిస్ కి సంబంధించి ఫ్లోరోసిస్ ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన నివేదికలు ఇవ్వాలని అలాగే ఆ ప్రాంతాలలో ప్రొటెక్టెడ్ వాటర్ ఇస్తున్నారా లేదా అని ఆర్డబ్ల్యూఎస్ వారి నుండి నివేదికలు తెప్పించుకొని పది రోజుల్లో సమర్పించాలని జిల్లా కలెక్టర్ డిఎంహెచ్వో డా.రామగిడ్డ య్య ను ఆదేశించారు.నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాం, డెఫ్నెస్ అండ్ ఓరల్ హెల్త్ ప్రోగ్రామ్లకు సంబంధించి గత ఆరు నెలల్లో ఎంతమందిని గుర్తించారు వారికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అనే నివేదికలను సమర్పించాలని, అదేవిధంగా ఇప్పటినుండి వారపు నివేదికలు కూడా ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారిని ఆదేశించారు. మలేరియా మరియు డెంగ్యూ కేసులకు సంబంధించి గత నాలుగు నెలల్లో కర్నూలు జిల్లాలో 160 కేసులు నమోదయాయని నమోదైన ప్రాంతాలలో తగిన చర్యలు తీసుకోవాలని, స్ప్రేయింగ్ చేయించాలని అదేవిధంగా ఫ్రైడే డ్రై డే కూడా పాటించేలా చర్యలు చేపట్టాలని మలేరియా మరియు డెంగ్యూ అధికారి నూకరాజును జిల్లా కలెక్టర్ ఆదేశించారు.జిల్లాలో 1236 టిబి కేసులు ఉన్నాయని నిక్షయ్ మిత్ర ద్వారా కర్నూలు లో ఉన్న 90 ప్రైవేట్ హాస్పిటల్స్ వారు ఎన్రోల్ చేసుకుని డబ్బులకు బదులు కి ప్రతి ఒక్కరికి ఆరు నెలలపాటు ఫుడ్ బాస్కెట్ అందించేలా చర్యలు తీసుకోవాలని, ఈ ప్రక్రియ నెలలోపు పూర్తిచేసే విధంగా చూడాలని టీబీ నియంత్రణ అధికారిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.ఫ్యామిలీ డాక్టర్ విధానం జిల్లాలో మరింత పకడ్బందీగా అమలు కావాలని కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు. పాఠశాలలు, అంగన్వాడీలను సందర్శించి పిల్లలకు తగిన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు.. అలాగే వృద్ధులు ,మంచంలో ఉన్న వారి ఇళ్లకు వెళ్లి ప్రత్యేకమైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు.1255 ప్రభుత్వ పాఠశాలలకు గాను 1192 ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10 నుండి 19 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అమ్మాయిలకు హేమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించారని అందులో 65 శాతం మంది రక్తహీనతతో ఉన్నారని, రక్తహీనతతో ఉన్న వారికి సప్లిమెంటేషన్ ఫుడ్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.సచివాలయ పరిధిలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎం,వెల్ఫేర్ అసిస్టెంట్లు మరియు సి ఆర్ పి లు పాఠశాలలకు సెలవులు ఇచ్చిన సమయంలో జాయింట్ సర్వే నిర్వహించి ఎంతమంది విద్యార్థులు డ్రాప్ ఔట్ అయ్యారని సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి నాడు నేడు కింద 500 కోట్లతో మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్ నిర్మాణానికి శాంక్షన్ అయిందని ప్రస్తుతానికి 60 కోట్లతో విలువచేసే ఐపి బ్లాక్ పనులు మొదలయ్యాయని జిల్లా కలెక్టర్ గారికి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వివరించారు.ఆనంతరం డిఎంహెచ్ఓ, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, డి సి హెచ్ ఎస్, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ వారు వారికి సంబంధించిన అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్కి వివరించారు. సమావేశంలో డిఎంహెచ్వో డా.రామగిడ్డ య్య, డిసిహెచ్ఎస్ రాంజీ నాయక్, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రఘు, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ నరేంద్రనాథ్ రెడ్డి, ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమం ఆఫీసర్ డాక్టర్ బాలమురళి, జిల్లా మలేరియా అధికారి నూకరాజు, రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ప్రాజెక్ట్ ఆఫీసర్ హేమలత, తదితరులు పాల్గొన్నారు.