RARS ను నిర్వీర్యం చేసి చరిత్ర హీనులుగా మారకండి
1 min read– ప్రభుత్వాన్ని మభ్యపరిచే కార్యక్రమాన్ని ఇకనైనా ప్రజాప్రతినిధులు మానుకోవాలి
– పరిశోధనా స్థానాన్ని పరిరక్షణ చేపట్టకపోతే రైతులే గుణపాఠం చెపుతారు
– బొజ్జా దశరథరామిరెడ్డి.
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: నంద్యాల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ అభివృద్దిలో చారిత్రాత్మిక నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంకు గణనీయమైన పాత్ర ఉందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి పేర్కొన్నారు.సోమవారం నంద్యాల రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో దశరథరామిరెడ్డి మాట్లాడుతూ.అభివృద్ధి ఇంజిన్‌గా పనిచేసిన వ్యవసాయ పరిశోధనా స్థానం వలన ఈ ప్రాంతం విత్తన కేంద్రంగా అభివృద్ధి చెందిందనీ, దీనితో ఈ ప్రాంతంలో అనేక విత్తన, వర్తక, వాణిజ్య సంస్థల అభివృద్ధి, అనేక మందికి ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు కొందరు వ్యక్తులు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగడానికి కూడా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం దోహదపడిందని ఆయన తెలిపారు.నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూములను వైద్య కళాశాల నిర్మాణానికి కేటాయించడం వలన జరిగే నష్టాన్ని ప్రజలు గ్రహించడానికి బీహార్‌లోని ఇంపీరియల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కథ గురించి ప్రజలందరూ తప్పక తెలుసుకోవాలని ఆయన అన్నారు.అప్పటి భారత దేశ వైస్రాయ్ లార్డ్ కర్జన్ భార్య అభ్యర్థన మేరకు ఆమె సమీప బంధువు అమెరికన్ వ్యాపారవేత్త మిస్టర్ హెన్రీ ఫిప్స్ అందించిన నిధులతో 1905 లో పూసా ఇన్స్టిట్యూట్ గా పిలవబడే ఇంపీరియల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ స్థాపించబడిందనీ, ఈ క్రమంలో బ్రిటిష్ ప్రభుత్వం నంద్యాల మరియు అనకాపల్లిలలో వ్యవసాయ పరిశోధనా సంస్థలను ఏర్పాటు చేసిందని ఆయన అన్నారు. భూకంపం కారణంగా బీహార్ లోని పూసా ఇన్స్టిట్యూట్ భవనాలు (PUSA – Phipps of USA) 1934 లో ధ్వంసమవ్వడంతో ఈ ఇన్స్టిట్యూట్ ను డిల్లీకి తరలించారని ఆయన పేర్కొన్నారు. ఈ ఇన్స్టిట్యూట్ బీహార్ నుండి డిల్లీకి మారిన తరువాత, బీహార్ వ్యవసాయ పరిస్థితి దిగజారడమేగాక పురోగతి కూడా మందగించిందని తెలిపారు.నంద్యాల, అనకాపల్లి మరియు మచిలిపట్నం వద్ద వ్యవసాయ పరిశోధనా సంస్థలకు చెందిన భూములలో వైద్య కళాశాలలను నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాధించినప్పుడు, 1934 లో పూసా, బీహార్‌ను తాకిన భూకంపం కంటే ఈ చర్యలు తక్కువ కాదని గ్రహించి, ఈ విధ్వంసకర చర్యను ఆపడానికి రాయలసీమ సాగునీటి సాధన సమితి అనేక ప్రయత్నాలు చేసిందని దశరథరామిరెడ్డి గుర్తు చేసారు. ఈ ప్రయత్న పలితంగా ముఖ్యమంత్రి గారితో రైతు నాయకులకు ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రజా ప్రతినిధులు హామీ ఇచ్చారని, కానీ ఆ హామీని వారు నెరవేర్చక ముఖంచాటు వేసారని ఆయన ద్వజమెత్తారు. ఈ నేపథ్యంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఏడాది పొడవునా నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు, పాలకుల అభివృద్ధి నిరోధక చర్యలను ఆపడానికి బహిరంగ బిక్షాటన కార్యక్రమాలు చేపట్టామని ఆయన అన్నారు. ఈ ప్రయత్నాలు ఫలించని నేపథ్యంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి హైకోర్టుకు వెళ్ళవలసి వచ్చిందని ఆయన అన్నారు.ఈ సందర్భంగా రైతాంగ ఆశాలను, ఆకాంక్షలను గమనించిన అనకాపల్లి ప్రాంత ప్రజా ప్రతినిధులు ప్రభుత్వాన్ని ఒప్పించి వైద్య కళాశాల ఏర్పాటుకు పరిశోధనా స్థానం భూములు తీసుకోకుండా పరిశోధనా స్థానంను పరిరక్షించారని ఆయన అన్నారు.కానీ నంద్యాల స్థానిక ప్రజా ప్రతినిధులకు తమ వ్యక్తిగత ప్రయోజనాలే ప్రాధాన్యమయ్యాయనీ, ప్రాంతీయ పరిశోధన స్థానంను తొలిగించి అందులో వైద్య కళాశాల, కలెక్టరేట్ ఏర్పాటు తో ఈ ప్రాంతం చుట్టూ ఉన్న తమ భూములకు విలువను, తమ వ్యాపార సామ్రాజ్యన్ని మరింత విస్తృత పరుచుకునే చర్యలకు వీరు తెరలేపారని ఆయన దుయ్యబట్టారు. నంద్యాల స్థానిక ప్రజా ప్రతినిధులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం “రైతాంగ సమస్య” ను “రాజకీయ సమస్య” గా ప్రభుత్వం ముందు చిత్రీకరించారని ఆయన విమర్శించారు. దీనికి నిలువెత్తు నిదర్శనాలు శాసనసభలో మరియు ముఖ్యమంత్రి పాల్గొన్న నంద్యాల సభలో సహా అనేక సందర్భాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు దీనిని రాజకీయ అంశంగా ప్రస్తావించడమేనని ఆయన తెలిపారు.వైద్య కళాశాల భవనాల నిర్మాణానికి 20 ఎకరాలు పరిమితం చేస్తూ, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం దగ్గరే ఉన్న వ్యవసాయ శాఖ (రైతు శిక్షణా కేంద్రం) భూములను ప్రాంతయ పరిశోధనా స్థానం కు బదలాయింపు చేసి పరిశోధనా స్థానంను పరిరక్షించాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధుల పైననే ఉన్నదని ఆయన అన్నారు. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం రక్షించడంలో స్థానిక శాసన, పార్లమెంటు సభ్యులు విఫలమైతే వారు చరిత్రహీనులుగా మిగులుతారని ఆయన హెచ్చరించారు. ఈ అంశాన్ని ఇంకా రాజకీయ కోణంగానే ప్రభుత్వాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ, దిద్దుబాటు చర్యలు చేపట్టక పోతే రాబోయే ఎన్నికలలో రైతులు తగిన గుణపాఠం చెబుతారని దశరథరామిరెడ్డి హెచ్చరించారు.
ఈ సమావేశంలోఉపాధ్యక్షులు వై.యన్.రెడ్డి, ఏరువ రామచంద్రారెడ్డి, కార్యదర్శి మహేశ్వరరెడ్డి,
బనగానపల్లె మండల నాయకులు M.C.కొండారెడ్డి, సుబ్బారెడ్డి, గోస్పాడు మండల నాయకులు బాలీశ్వరరెడ్డి,మహిపాల్ రెడ్డి, ఆళ్ళగడ్డ మండల నాయకులు జాఫర్ రెడ్డి, కొత్తపల్లి మండల నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, గడివేముల మండల నాయకులు సంజీవరెడ్డి, ఈశ్వర్ రెడ్డి, కర్నూలు జిల్లా నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి,K.సుదర్శన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, పాణ్యం మండల నాయకులు బీరం సుబ్బారెడ్డి, రామసుబ్బారెడ్డి, శిరివెళ్ళ మండల నాయకులు మనోజ్ కుమార్ రెడ్డి, బండిఆత్మకూరు మండల నాయకులు రాఘవేంద్ర గౌడ్,కోవెలకుంట్ల మండల నాయకులు వెంకటేశ్వర రెడ్డి, నంద్యాల రైతు సంఘం నాయకులు కొమ్మా శ్రీహరి, పర్వేజ్, నంద్యాల మండల నాయకులు భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.