ఫెడ్రిక్ అటాక్సియా’ బాధితుడికి..మెరుగైన చికిత్స..
1 min read– కండరాలు.. నరాల బలహీనత..సరిగా నడవలేడు.. నిల్చోలేడు..
– ఆదోని యువకుడికి వింత వ్యాధి, ‘ఫెడ్రిక్ అటాక్సియా’ గా వైద్యుల నిర్ధారణ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: నరాల స్పెషలిస్టుకే సవాల్ విసిరిన వ్యాధి… పది లక్షల మందిలో ఒకరిద్దరికే మాత్రమే వచ్చే అరుదైన వ్యాధి.. ఈ జబ్బు వచ్చిన వారు నిల్చోలేరు…నడవలేరు.. ఇక ఆటల గురించి మాట్లాడకూడదు… మానసికంగా.. భౌతికంగా నరకం అనుభవించేలా చేస్తోంది… ఈ వ్యాధికి మందు లేదు… కేవలం లక్షణాలతోనే చికిత్స చేయాలి. ఆ వ్యాధి పేరు ‘ఫెడ్రిక్ అటాక్సియా’గా వైద్యులు నిర్ధారించారు. ఆదోని ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి… ఈ అరుదైన వ్యాధి రావడంతో న్యూరాలజిస్ట్ డా. కె.హేమంత్ కుమార్ వైద్యచికిత్సలు చేసి సఫలమయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యవకుడికి ఏడేళ్ల నుంచి నడకలో ఇబ్బంది ఏర్పడింది. పలు ప్రాంతాల్లో వైద్యచికిత్సలు చేయించుకున్నా ఫలితం లేకపోవడంతో… బాధితుడి కుటుంబీకులు కర్నూలు హార్ట్ అండ్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి న్యూరాలజిస్ట్ డా. కె. హేమంత్ కుమార్ వద్దకు తీసుకొచ్చారు. యువకుడిని పరీక్షించిన తరువాత ఎంఆర్ఐ తోపాటు జెనటిక్ టెస్ట్ నిర్వహించారు. దీంతో ఆ యువకుడికి ఫెడ్రిక్ అటాక్సియా వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. వ్యాధికి మందులు లేవు…వ్యాధి లక్షణాలను బట్టి సపోర్టివ్ మెడిసిన్స్ మాత్రమే ఇచ్చి చికిత్స చేస్తున్నారు. దీని వల్ల వ్యాధి తీవ్రత పెరగకుండా ఉంటుందని డాక్టర్ కె. హేమంత్ కుమార్ వెల్లడించారు. మేనరికపు వివాహాల కారణంగా జెనటిక్ వస్తుందని, కొన్ని సార్లు విటమిన్–ఇ, బి 12 లోపం వల్ల, సెరిబెల్లమ్లో కణితి ఉండటం వల్ల, వెన్నుపూసలో సమస్య కారణంగా వస్తుందన్నారు. ఐదేళ్ల పిల్లాడ వరకు ఎలాంటి లక్షణాలు బయటపడవని, 10 నుంచి 15 ఏళ్ల వయస్సులో వ్యాధి తీవ్రమవుతుందన్నారు. ఎఫ్.ఎక్స్.ఎన్.జీన్ మ్యూటేషన్ చెందడం వల్ల ఈ వ్యాధి వస్తుందన్నారు. దీనికి చికిత్స లేదని, గత ఫిబ్రవరిలో ఒమవెలోక్సోలోన్ 150 ఎంజీ అనే మందుకు ఎఫ్డీఐ అనుమతి ఇచ్చిందని, ఇది ఇంకా మన దేశంలోకి రాలేదన్నారు. ప్రస్తుతం ఫిజియో థెరపే చికిత్స. సపోర్టివ్ డ్రగ్స్ ఇవ్వడం ద్వారా వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చని ఈ సందర్భంగా న్యూరాలజిస్ట్ డా. కె. హేమంత్ కుమార్ వెల్లడించారు.