వైశాఖమాస తిరుకళ్యాణ మహోత్సవాలు..కలెక్టరుకు ఆహ్వానం
1 min read– జిల్లా కలెక్టర్ వారికి ఆహ్వాన పత్రికను అందించిన ఆలయ ఈఓ..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి వైశాఖమాస తిరుకళ్యాణం మహోత్సవాలకు విచ్చేయాలని సంయుక్త కమీషనరు, ఆలయ కార్యనిర్వహణాధికారి వేండ్ర త్రినాధరావు గురువారం జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ వారిని ఆహ్వానించారు. స్ధానిక కలెక్టరేట్ లో కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ వారిని కలిసి స్వామివారి వైశాఖమాస తిరుకళ్యాణం మహోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం స్వామివారి తీర్ధప్రసాదాలు అందించారు. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దేవస్ధానంలో ఏప్రియల్ 30వ తేదీ నుంచి మే 7వ తేదీ వరకు స్వామివారి వైశాఖమాస తిరుకళ్యాణ మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఈఓ తెలిపారు. స్వామివారి కళ్యాణం మే 4వ తేదీ రాత్రి 8.30 గంటల నుంచి నిర్వహించబడుతుందని అదే విధంగా మే 5వ తేదీ రాత్రి 7.30 గంటల నుండి రథోత్సవం నిర్వహించబడుతుందని వివరించారు. స్వామివారి వైశాఖమాస తిరుకళ్యాణ మహోత్సవాలు సందర్బంగా ఏప్రియల్ 30వ తేదీ నుంచి మే 7వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 9.00 గంటల వరకు ఆలయ వేదపండితులచే వేద పారాయణంను మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.