ఘనంగా శ్రీ శ్రీ భగీరథ మహర్షి జయంతి
1 min readపల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు శ్రీ శ్రీ భగీరథ మహర్షి జయంతిని సగర సేవా సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పరి సుబ్బారావు ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీ శ్రీ భగీరథ మహర్షి చిత్రపటానికి పూల మాల వేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సగర సేవా సంఘం నాయకులు మాట్లాడుతూ సగరుల కులదైవం శ్రీ శ్రీ భగీరథ మహర్షి జయంతి జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం కూడా శ్రీ శ్రీ భగీరథ మహర్షి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని జీవో జారీ చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. అలాగే తాడేపల్లి లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి భగీరథ జయంతి వేడుకలు నిర్వహించడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. అలాగే గుంటూరు జిల్లాలో టిడిపి ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భగీరథ మహర్షి జయంతి వేడుకల్లో పాల్గొనడం జరిగిందన్నారు. కర్నూలు జిల్లా కేంద్రంలో కూడా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించడం జరిగిందన్నారు. దివిలో ఉన్న గంగను తన తపస్సుతో భువికి రప్పించి సగర పుత్రులకు ఉత్తమగతులు లభించేలా చేసిన మహానుభావులు శ్రీ శ్రీ భగీరథ మహర్షి అని కొనియాడారు. ఇప్పుడిప్పుడే రాజకీయ పార్టీలు సగరులను గుర్తిస్తున్నాయని, సగరులు అందరూ ఐక్యంగా ఉంటేనే ఎక్కడైనా గుర్తింపు లభిస్తుందన్నారు. భగీరథ మహర్షి ఆశీస్సులతో సగరులు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సగర సేవా సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పరి సుబ్బారావు, బాలకృష్ణ, పోలూరు వెంకటసుబ్బయ్య, పోలూరు కృష్ణ, అంగడి కృష్ణ, రిటైర్డ్ ఎస్ఐ చింతల పుల్లయ్య, శ్రీరాములు, చిందుకూరి గోపాల్, నీరుకట్టు రామకృష్ణుడు, గుండ్ల సింగవరం మద్దిలేటి, దస్తగిరి, బివి రమణ తదితరులు పాల్గొన్నారు.