ఉత్తమ సేవలతోనే గుర్తింపు
1 min read– ప్రధానోపాధ్యాయులు మడితాటి నరసింహారెడ్డి
పల్లెవెలుగు అన్నమయ్య జిల్లా బ్యూరో: ఉపాధ్యాయులు వృత్తిలో ఉత్తమ సేవలు అందించడం ద్వారానే గుర్తింపు లభిస్తుందని అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లోని సంబేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మడితాటి నరసింహారెడ్డి అన్నారు. పాఠశాలలో డిప్యూటేషన్ పై పనిచేస్తూ తిరిగి వెళ్లిన రాజా రాణెమ్మ, నాగార్జున ఉపాధ్యాయులకు, పదోన్నతి పై వచ్చిన రవీంద్ర రాజు, నాగరాణిలకు ఆదివారం ఉదయం హైస్కూల్ ఆవరణంలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మడితాటి నరసింహారెడ్డి మాట్లాడుతూ సమాజ సంస్కర్తలు గురువులన్నారు. సమాజంలో గురువులకే అత్యంత ఉన్నత స్థాయి హోదా కలిగి ఉందని తెలిపారు. ప్రతి ఉపాధ్యాయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ను ఆదర్శంగా తీసుకొని పనిచేసి సమాజాన్ని మంచి మార్గంలో నడిపించాలన్నారు. సమాజానికి గురువులే కళ్ళు, చెవులని, దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే గురువులే కీలకమని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి, పాఠశాల అభివృద్ధికి నాగార్జున, రాజా రాణెమ్మ, రవీంద్రరాజు, నాగరాణిలు విశేష కృషి చేశారన్నారు. ప్రతి ఒక్కరూ వీరిని ఆదర్శంగా తీసుకుని విధులను నిర్వర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంచల రామచంద్ర, విశ్రాంత మండల విద్యాశాఖాధికారి రామిరెడ్డి, పేరెంట్స్ కమిటీ మాజీ చైర్మన్ వాసుదేవ రెడ్డి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు,విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.