లోక్ అదాలత్ తో సత్వర న్యాయం…
1 min read– జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సి.హెచ్. వెంకట నాగ శ్రీనివాస రావు
– పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారమే ధ్యేయం…. జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్
– మే 13 న నేషనల్ మెగా లోక్ అదాలత్ కార్యక్రమం.
– కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే ప్రదాన ఉద్దేశ్యం..
– లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు రెండవ పట్టణ పోలీసు స్టేషన్ లో సత్వర న్యాయ మేళా కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సి.హెచ్. వెంకట నాగ శ్రీనివాస రావు గారు, జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్ గారు హాజరై వివిధ కేసులలోని కక్షిదారులతో మాట్లాడారు.జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సి.హెచ్. వెంకట నాగ శ్రీనివాస రావు గారు మాట్లాడుతూ..సంవత్సరంలో మొత్తం 4 నేషనల్ లోక్ అదాలత్ లు జరుగుతున్నాయన్నారు. అదే విధంగా 3 స్పెషల్ లోక్ అదాలత్ లు పెట్టామన్నారు. మే 13 వ తేదిన జరిగే ఈ నేషనల్ లోక్ అదాలత్ లో ఎలాంటి ఖర్చు లేకుండా కక్షిదారులకు సత్వర న్యాయసేవలందించే లక్ష్యంతో , రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశమన్నారు. ఎక్సైజ్ కోర్టులో 6 వేల కేసులు పెండింగ్ లో ఉండి, పేరుకు పోయి ఉన్నాయన్నారు. ఒక్కో మేజిస్ట్రేట్ కోర్టు లో 3 వేలు, 3 వేల 5 వందలు, 4 వేల 5 వందల దాకా పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఈ కేసులన్నీ ట్రయల్ కు రావాలంటే ఎన్ని సంవత్సారాలు పడుతుందో ఆలోచించాలన్నారు. చిన్న చిన్న కేసులు పేరుకు పోయి పరిష్కారం కాకుండా కోర్టుకు భారంగా ఉన్నాయన్నారు. కేసులలో రాజీ అయితే కోర్టుకు పని భారం తగ్గుతుందన్నారు. రాజీ మార్గమే రాజ మార్గం భావించాలన్నారు. కోర్టులో ఎక్కువ కేసులు పెండింగ్ ఉండడంతో చిన్న చిన్న కేసు లకు కూడా 20 వాయిదాలకు తిరగాల్సి వస్తుందన్నారు. కూలీ పనులకు వెళ్ళే వారు కూడా కోర్టు వాయిదాలకు తిరిగి తిరిగి డబ్బులు, సమయాన్ని వృధా చేసుకుంటున్నారన్నారు. విలువైన సమయంతో పాటు డబ్బులు కూడా కోల్పోతున్నారన్నారు. ఎంత పెద్ద సమస్య అయినా కూడా కూర్చుని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. రాజీ అయితే కక్షలు, కార్పణ్యాలు పెరగకుండా ఉంటాయన్నారు. కక్షిదారులను కూర్చోబెట్టి కష్ట, నష్టాల గురించి మరియు రాజీ అయితే ఎలా ఉంటుందని తెలియజేయడం కొరకు సత్వర మేళ న్యాయ కౌన్సిలింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా బాగుందన్నారు. వివిధ కేసులలో కక్షిదారులైన వారిని ఈ విధంగా పోలీసు స్టేషన్ కు తీసుకువచ్చి సత్వర న్యాయ మేళా కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ గారు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారుజిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్మాట్లాడారు.కేసుల పరిష్కారం లో రాష్ట్రంలోనే కర్నూలు జిల్లా ను మొదటి స్ధానం లో ఉంచే విధంగా కృషి చేస్తామన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది బాగా కృషి చేయాలన్నారు. సైబర్ క్రైమ్ కేసులు కూడా ఎక్కువగా అవుతున్నాయన్నారు. కంపౌడబుల్ కేసులు, ఎక్కువ ప్రాధాన్యత ఉన్న కేసుల పై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. చిన్న, చిన్న కారణాలు, తగదాలతో కేసులు నమోదయినావని , ఎక్కువ సమయాన్ని వృధా కాకుండా చూసేందుకు సత్వర న్యాయం కొరకు మెగా లోక్ అదాలత్ లో పరిష్కరించుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. లోక్ అదాలత్ లో కర్నూలు జిల్లా టాప్ 5 లో ఉందన్నారు. డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలతో స్పెషల్ టీమ్ లు ఏర్పాటు చేశామన్నారు. కౌన్సిలింగ్ సెంటర్ లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహిళా పోలీసులు కూడా ఫిర్యాదుదాలకు నోటిసులు సర్వ్ చేసి వారిని కూడా కౌన్సిలింగ్ సెంటర్ లకు పిలిపించి కేసుల రాజీ లో వంద శాతం న్యాయం జరిగేవిధంగా చేస్తామన్నారు.సత్వర న్యాయ మేళా కౌన్సిలింగ్ కు వచ్చిన వారికి ధన్యవాదాలన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు పట్టణ సిఐలు, ఎస్సైలు ఉన్నారు.