సమస్యలను నాణ్యతతో పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్
1 min read– జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని అధికారులు సీరియస్ గా తీసుకోవాలి
– జిల్లాకు సీనియర్ ఐఏఎస్ అధికారి రవాణా,ఆర్ అండ్ బీ సెక్రెటరీ ప్రద్యుమ్నను స్పెషల్ ఆఫీసర్ గా నియామకం
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని అధికారులు సీరియస్ గా తీసుకోవాలని, జిల్లా, మండల, డివిజన్ స్థాయిలోని అన్ని కార్యాలయాల్లో ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేసేందుకు ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ లను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన వినతులను జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు మరియు మండలాల నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.జి.సృజన మాట్లాడుతూ స్పందనకు మరింత మెరుగైన రూపం జగనన్నకు చెబుదాం కార్యక్రమమని కలెక్టర్ తెలిపారు.స్పందన ద్వారా అయితే అర్జీలను స్వయంగా దరఖాస్తు చేసుకుంటారని, కానీ ఈ జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమంలో అర్జీదారుడు సమస్యను 1902 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయడం ద్వారా నమోదు చేసుకోవడం జరుగుతుందన్నారు. ఈ సమస్యలను నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.. ముఖ్యమంత్రి కార్యాలయం ఈ కార్యక్రమానికి కనెక్ట్ అయి ఉంటుందని తెలిపారు.వెంటనే జిల్లా, డివిజన్,మండల స్థాయిలోని అన్ని కార్యాలయాల్లో ప్రాజెక్టు మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆ వివరాలను డిఆర్ఓకు అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ లాగిన్ ను నిరంతరం ఓపెన్ చేసుకుంటూ వచ్చిన అర్జీలను బియోండ్ ఎస్ఎల్ఏ వెళ్లకుండా పరిష్కరించాలన్నారు. జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐఎఎస్ అధికారులను నియమించిందన్నారు. మన జిల్లాకు రవాణా ఆర్ అండ్ బీ సెక్రెటరీ ప్రద్యుమ్నను స్పెషల్ ఆఫీసర్ గా నియమించారన్నారు.. వీరు జిల్లాలో రెండు పర్యాయాలు పర్యటించి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారని కలెక్టర్ తెలిపారు. ఫిర్యాదు చేసిన వ్యక్తికి సంతృప్తి కలిగించేలా సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎక్కువగా రీఓపెన్, రిజెక్టెడ్ అయిన ఫిర్యాదులపై దృష్టి సారించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.