కార్మికుల హక్కుల పరిరక్షణకై కలిసి పోరాటం చేద్దాం
1 min read– కార్మిక చట్టాలపై అవగాహన కల్పించిన జూనియర్ సివిల్ జడ్జి దివ్య.
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: కార్మికుల హక్కుల పరిరక్షణకై ఉద్యమాలను చేపడతామని ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ కార్యదర్శి ఎన్.కృష్ణయ్య, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నబి రసూల్, డి.రాజా సాహెబ్ లు పిలుపునిచ్చారు. సోమవారం పత్తికొండలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో 137 వ మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి పట్టణ పురవీధుల గుండా మేడే వర్థిల్లాలి- ప్రపంచ కార్మికులారా ఏకంకండి అంటూ నినాదాలు చేస్తూ కార్మిక ప్రదర్శన చేపట్టారు. అనంతరం నాలుగు స్తంభాల మండపం దగ్గర ఏర్పాటుచేసిన బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా జూనియర్ సివిల్ జడ్జి దివ్య హాజరై కార్మికుల ను ఉద్దేశించి, చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కార్మికుల హక్కుల పరిరక్షణకై సంఘటితంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేద్దామని పిలుపునిచ్చారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను కేవలం నాలుగు కోడ్ లుగా కుదించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. వివిధ రంగాలలో పనిచేస్తున్న సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులకు ప్రమాద భీమా పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కార్మిక ప్రదర్శన ముందు భాగంలో చిన్నారుల కోలాటం పట్టణ ప్రజలను ఎంతో ఆకట్టుకుంది. ఏఐటీయూసీ తాలూకా అధ్యక్షులు నెట్టికంటయ్య అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఏఐటీయూసీ తాలూకా కార్యదర్శి రంగన్న, తుగ్గలి, మద్దికేర సిపిఐ మండల కార్యదర్శులు సుల్తాన్, నాగరాజు, పట్టణ కార్యదర్శి రామాంజనేయులు, సిపిఐ జిల్లా సమితి సభ్యులు సురేంద్ర కుమార్, కారన్న, తిమ్మయ్య, గురుదాస్, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు వెంకట రాముడు, ప్రజాసంఘాల నాయకులు పెద్ద ఈరన్న, అల్తాఫ్, నజీర్, హనుమేష్, పెద్దయ్య, మాదన్న, రాజప్ప, సుంకమ్మ, నాగరాజు, లక్ష్మన్న, ఉచ్చన్న, హమాలి, ఆటో యూనియన్, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు వివిధ రంగాల ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.