రాళ్ల సీమలో.. వజ్రాల రాశులు..!
1 min readపల్లె వెలుగు వెబ్: రాయలసీమలో రాజులు రత్నాలు, రాశులు పోసి అమ్మారని నానుడి. ఆ నానుడిని నిజం చేస్తాయి ఇక్కడి భూములు. తొలకరి కురవగానే..పులకరించి వజ్రాలను కంటాయి. రైతు కళ్లలో ఆనందం నింపుతాయి. కర్నూలు జిల్లా జొన్నగిరి ప్రాంతంలో ప్రతి సంవత్సరం తొలకరి పడగానే రైతులు పంట వేయడానికి బదులుగా.. వజ్రాల కోసం అన్వేషిస్తారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. జొన్నగిరిని స్వర్ణగిరి అని పిలుస్తారు. జొన్నగిరికి రెండు కిలోమీటర్లు దూరంలో అశోకుడు పెద్ద బండరాళ్ల మీద శాసనాలు వేయించారు.
ప్రతి ఏటా లభ్యం..
జొన్నగిరి పరిసర ప్రాంతాల్లోని చాలా గ్రామాల్లో ప్రతి సంవత్సరం తొలకరి పడగానే వజ్రాల వేట మొదలవుతుంది. కొందరు అదే పనిగా వజ్రాల వేటకు వెళ్తే.. మరికొందరు తమ పనుల్లో నిమగ్నమవుతూ.. వజ్రాల కోసం అన్వేషిస్తారు. ప్రతి ఏటా రెండు వేల నుంచి రెండు లక్షలు విలువ చేసే వజ్రాలు ఇక్కడ దొరుకుతుంటాయని సమాచారం. దొరికిన వజ్రాలను కొందరు గుట్టుగా అమ్ముకుంటారు. ధర నచ్చకపోతే ఇంకొకరికి అమ్ముకుంటారు. ఈ వజ్రాలను కొనేందుకు కొందరు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు. వజ్రాల విలువ తెలియని స్థానికులు వ్యాపారులకు తక్కువకే వీటిని అమ్మేస్తారు. ఇటీవల కూడ జొన్నగిరిలో మూడు వజ్రాలు లభ్యమయినట్టు ప్రచారం ఉంది. అయితే వీటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉండవు. కేవలం నోటి ప్రచారం మాత్రమే ఉంటుంది. దీంతో అధికారులు ఏమి చేయలేని స్థితిలో ఉంటారు. మరి కొందరు మాత్రం అధికారులకు వజ్రాల వ్యాపారుల నుంచి కమీషన్ అందడంతో.. మిన్నుకండి పోతారని ఆరోపణలు ఉన్నాయి.