ఢిల్లీలో పోరాడుతున్న మహిళా రెజ్లర్లకు మద్దతుగా AIDSO
1 min read– AIDSO ఆధ్వర్యంలో మే 4వ తేదీన అఖిల భారత కమిటీ పిలుపు మేరకు కర్నూలు నగరంలోని అవుట్ డోర్ స్టేడియం నందు మహిళా రెజ్లర్లకు సంఘీభావం తెలిపారు…
– ఈ కార్యక్రమానికి AIDSO నగర కార్యదర్శి హెచ్. మల్లేష్ అధ్యక్షత వహించారు…
పల్లవెలుగు వెబ్ కర్నూలు: కార్యక్రమంలో AIDSO రాష్ట్ర అధ్యక్షులు వి. హరీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ – మహిళా రెజ్లర్లు ఒట్టి చేతులతో ప్రత్యర్థుల్ని మట్టి కరిపించగల కండ బలం వారి సొంతమని, అనుకుంటే రెప్పపాటులో రెక్కలు విరిచి పాతాళానికి తొక్కేయగల శక్తి యుక్తులలో ఆరితేరిన వారని, అయినా ఈ దేశ జాతి పతాకను సమున్నత శిఖరాలకు తీసుకువెళ్లిన భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, శరత్ చంద్ర, కందుకూరి వీరేశలింగం వంటి ఎంతో మంది రాజీలేని సంస్కృతిక, స్వాతంత్ర సమరయోధులు, సాహిత్యకారులు నేర్పిన విలువలకు కట్టుబడి న్యాయం కోసం నేడు ఢిల్లీలో పోరాడుతున్నారని తెలిపారు… బిజేపి పార్టీకి చెందిన ఎంపీ, రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) ప్రెసిడెంట్ గా ఉన్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని వినేశ్ ఫోగాట్, సాక్షి మలిక్, బజరంగ్ పునియా, ఇతర రెజ్లర్లు, కోచ్‌లు ప్రధానమంత్రికి, క్రీడాశాఖ మంత్రికి ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోగా దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగారని అన్నారు… ఈ రెజ్లర్లు తనపై చేస్తోన్న ఆరోపణలనీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కొట్టిపడేస్తు తన ధనబలంతో, పాలకవర్గ పార్టీల మద్దతుతో తొండ ముదిరి ఊసరవెల్లి అయిన చందంగా తయారై దబాయిస్తూ, దౌర్జన్యాలు చేస్తున్నాడని విమర్శించారు… బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను వెంటనే WFI అధ్యక్ష పదవి నుండి తొలగించాలని, తన ఎంపీ పదవి నుండి కూడా బహిష్కరించాలి డిమాండ్ చేశారు… అలాగే మహిళా రెజ్లర్లకు న్యాయం కలిగేలా, లైంగిక వేధింపులకు పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు… మహిళలకు అన్ని రకాలుగా భద్రత కల్పించేలా ప్రభుత్వం మరియు పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.అనంతరం AIMSS రాష్ట్ర కార్యదర్శి ఎం.తేజోవతి మాట్లాడుతూ ఈ మల్ల యోధులు న్యాయం కోసం ఢిల్లీలో నిరసన చేస్తున్నప్పటికీ నాయకులకు, అధికారులకు చీమకుట్టినట్టైనా లేదని, సాక్షాత్తు ప్రధానమంత్రి కి, కేంద్ర క్రీడల శాఖ మంత్రికి తెలియజేసిన అతనిపై చర్యలు తీసుకోవడం లేదు సరికదా తిరిగి వారి (ఫిర్యాదు చేసిన మహిళ మల్లయోధులపై) వ్యక్తిత్వం పైన దాడులు చేస్తున్నారని, మాయ మాటలతో మభ్య పెడుతున్నారని విమర్శించారు… దీనితో ఈ అధికార పార్టీ పాలక వర్గ ఎంపీ అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి నాయకులు గతములో కూడా ఇదే విధంగా కార్మికులతో,రైతులు తో వ్యవహరించారని, నేడు క్రీడాకారులుతో వ్యవహరిస్తున్నారని గుర్తు చేశారు… రేపు మనలో ఇంకెవరు అవుతారో? ప్రజలారా మన సోదరులు, పిల్లలు, సహచరులు ఇలాంటి లైంగిక వేధింపులకు గురైతే మనమేం చేస్తాం..? అనేది ఓ సారి ఆలోచించండని చెప్తూ న్యాయం కోసం పోరాటం చేస్తున్న కుస్తీ యోధులకు న్యాయం జరిగే వరకూ మనమందరం వారికి మద్దతుగా ఉండాలని పిలుపునిచ్చారు…కార్యక్రమంలో AIDSO నాయకులు శివ ప్రసాద్, శక్రప్ప, నారాయణ, ఖాదర్ మరియు అథ్లెట్లు స్పోర్ట్స్ కోచ్ లు, విద్యార్థులు పాల్గొన్నారు.