మహిళల గౌరవంపై కెజి నుంచి పిజి వరకు పాఠ్యాంశాలు!
1 min read– మహిళల స్వయం ఉపాధికి ప్రత్యేక కార్యాచరణ చేపడతాం
– పెట్రోలు, డీజిల్ తో సహా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తాం
– మహిళలతో ముఖాముఖిలో యువనేత నారా లోకేష్
పల్లెవెలుగు వెబ్ పాణ్యం: టిడిపి అధికారంలోకి వచ్చాక మహిళల రక్షణకు చట్టాలు మాత్రమే కాదు, మహిళల్ని గౌరవించడం చిన్నప్పటి నుండే నేర్పిస్తాం. మహిళల గొప్పతనం, వారి కష్టం అందరికీ తెలిసేలా కేజీ నుండి పీజీ వరకూ ప్రత్యేక పాఠ్యాంశాలు తీసుకొస్తామని యువనేత నారా లోకేష్ చెప్పారు.పాణ్యం నియోజకవర్గం బొల్లవరంలో మహిళలతో ముఖాముఖిలో యువనేత లోకేష్ మాట్లాడుతూ…ఫ్యాన్ ఆరోగ్యానికి హానికరం. ఫ్యాన్ ఆపేస్తే మహిళలకు మంచి రోజులు వస్తాయి. దిశ చట్టం పెద్ద మోసం. అసలు చట్టమే లేకుండా స్టేషన్లు ప్రారంభించారు.వైసిపి నాయకులే మహిళల్ని అసెంబ్లీ సాక్షి గా అవమానపరుస్తున్నారు. అందుకే మహిళల పై దాడులు విచ్చలవిడిగా జరుగుతున్నాయి.మా అమ్మని అసెంబ్లీ సాక్షి గా అవమానించారు. లోకేష్ కి చీర, గాజులు పంపుతాం అని మహిళల్ని అవమానించే విధంగా మంత్రి రోజా మాట్లాడారు.
నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తాం!
అమ్మ ఒడి ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఇస్తామని జగన్ మోసం చేసాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్ ఇస్తామని జగన్ హామీ ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఊసే లేదు. జగన్ పాలనలో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి ఒక కారణం పెట్రోల్, డీజిల్ ధరలు. దేశంలోనే అత్యధిక పెట్రోల్, డీజిల్ ధరలు ఏపి లో ఉన్నాయి. జగన్ బాదుడే బాదుడు కి ప్రజలు అల్లాడుతున్నారు. విద్యుత్ ఛార్జీలు 8 సార్లు పెంచారు, ఆర్టీసి ఛార్జీలు 3 సార్లు పెంచారు, ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను వేసారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్ పై పన్ను తగ్గించి ధరలు తగ్గేలా చేస్తాం. నిత్యావసర సరుకుల ధరలు, పన్నుల భారం తగ్గిస్తాం.
మహిళల స్వయం ఉపాధికి కార్యాచరణ
డ్వాక్రా వ్యవస్థను జగన్ నిర్వీర్యం చేశారు. వడ్డీ లేని రుణాలు ఇస్తాం అని మోసం చేశారు. ఆఖరికి మీరు దాచుకున్న అభయహస్తం డబ్బులు రూ.2500 కోట్లు కూడా జగన్ ప్రభుత్వం కొట్టేసింది. మహిళల స్వయం ఉపాధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాం. మంగళగిరి లో మహిళలకు టైలరింగ్ కోర్సులో శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్లు ఇచ్చాం. అక్కడితో ఆగకుండా ఒక మార్కెట్ లింకేజ్ చేసాం. అన్ని రంగాల్లో మహిళల్ని ప్రోత్సహించే విధంగా ప్రోత్సహిస్తాం. సబ్సిడీ రుణాలు అందజేసి మహిళా పారిశ్రామిక వేత్తలుగా మారేందుకు సహకరిస్తాం.
విద్యావ్యవస్థను నిర్వీర్యం చేశారు!
విద్యా వ్యవస్థను జగన్ నిర్వీర్యం చేశారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు ఫెయిల్ అయ్యాయి.టిడిపి హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో భాగంగా ఫీజులు నేరుగా కాలేజీలకు చెల్లించాం.జగన్ పాలనలో ఫీజులు నేరుగా తల్లుల ఖాతాలో వేస్తామని చెప్పి చెల్లించడం లేదు. విద్యా దీవెన, వసతి దీవెన వలన తల్లిదండ్రులు, విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కాలేజీలకు బకాయి పడ్డ ఫీజులు అన్ని సింగిల్ సెటిల్మెంట్ చేసి విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇప్పిస్తాం.
మద్యనిషేధంపై మడమతిప్పాడు!
జగన్ సంపూర్ణ మద్యపాన నిషేదం చేస్తానని మోసం చేశాడు. మద్యపాన నిషేదం తరువాతే ఓట్లు అడుగుతా అన్నాడు ఇప్పుడు ఎం మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు.మందుపై వచ్చే ఆదాయం తాకట్టు పెట్టి రూ.25 వేల కోట్లు అప్పు తెచ్చాడు.జె-బ్రాండ్ లిక్కర్ తయారు చేసి మద్యాన్ని ఏరులై పారిస్తున్నాడు.జే బ్రాండ్ లిక్కర్ విషం కంటే ప్రమాదం. డబ్బు పిచ్చితో ప్రజల ప్రాణాలు తీస్తున్నాడు. ఆ మద్యం తాగితే పైకి పోవడం ఖాయం.
మహిళలు మాట్లాడుతూ…
ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు కావడం లేదు. ప్రభుత్వం ఫీజులు చెల్లించక కాలేజీలు సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి.జగన్ పాలనలో మహిళలకు రక్షణ లేదు. దిశ చట్టం అంటూ మోసం చేశారు.డ్వాక్రా సంఘాలను జగన్ నిర్వీర్యం చేశారు. వడ్డీ లేని రుణాలు ఇవ్వడం లేదు. జగన్ మద్యపాన నిషేదం చేస్తానని మోసం చేశారు. వైసిపి పాలనలో నిత్యావసర సరుకుల ధరలు, పన్నుల భారం విపరీతంగా పెంచేశారు.
మహిళలతో ముఖాముఖిలో వ్యక్తమైన అభిప్రాయాలు:
రాధిక : నేను పొదుపులక్ష్మీ గ్రూపులో లీడర్ గా ఉన్నా. ఎన్నికల సమయంలో రుణమాఫీ అని జగన్ హామీ ఇచ్చారు..కానీ చేయలేదు. మీరొచ్చాక పొదుపులక్ష్మి మహిళలకు న్యాయం చేయండి.
మౌనిక : నేను 2021లో బీటెక్ పూర్తి చేశాను. చివరి సంవత్సరం ఫీజు రీయింబర్స్ మెంట్ రాలేదు. దీంతో బకాయిలు చెల్లించాలని యాజమాన్యం వత్తిడి తెస్తోంది. ఉద్యోగాలకు వెళ్లాలంటే సర్టిఫికేట్లు అవసరం అవుతున్నాయి. ఈ సమస్యకు మీరు పరిష్కారం చూపించండి.
నాగమణి : దిశ చట్టం అని జగన్ అన్నారు. దిశ చట్టంతో న్యాయం అంటున్నారుగానీ న్యాయం జరగడం లేదు. దిశ చట్టం అమల్లో లేదు. మీరొచ్చాక మహిళలకు రక్షణ కల్పించండి.
కృష్ణవేణి : మా అక్క చనిపోయింది. ఆమె కూతురు వికలాంగురాలైనా వివాహం చేశాను. ఇద్దరు పిల్లలున్నారు. తాగితాగి ఆమె భర్త చనిపోయారు. వచ్చే పెన్షన్ తో ఇల్లు గడవదు. ఇద్దరు పిల్లలను పోషించాలన్నా ఇబ్బందిగా ఉంది. సొంత ఇల్లులేదు. ఎన్నిసార్లు స్థలంకోసం అర్జీలు పెట్టినా ఇవ్వడం లేదు.
ఎమ్.నాగేశ్వరి, ప్రైవేట్ టీచర్ : ప్రైవేట్ టీచర్స్ కు కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి కొంతమేర పెన్షన్ ఇచ్చే విధానం తీసుకురండి.
కృష్ణమ్మ : నిత్యవసర సరుకులన్నీ పెరిగాయి. చంద్రబాబు ఉన్నప్పుడు బాగా బతికాం. రూ.200 కూలీతో ఎలా బతకాలి.? మందు రేటు పెంచడంతో తెచ్చుకున్న సొమ్మును కూడా మా భర్తలు తాగికాజేస్తున్నారు.
శ్రీదేవి : మా అమ్మాయి ఫార్మసీ చివరి సంవత్సరం చేస్తోంది. నేను జాయిన్ చేసిన మొదట్లో 6 ఏళ్ల పాటు ఫ్రీ అన్నారు. తర్వాత నాలుగేళ్లే అన్నారు..కానీ ఇప్పుడు ఆరో యేటలో రూ.2.20లక్షలు కట్టాలని చెప్తున్నారు.
హసీనా : అన్ని కళాశాలల్లో జర్నలిజం ఏర్పాటు చేయాలి. డిగ్రీలో ఒక సబ్జెక్టును ఏర్పాటు చేయాలి. ప్రజా ప్రతినిధులు దగ్గర జర్నలిజం చేసిన వాళ్లనే పీఆర్వోగా పెట్టాలి.
నాగలక్ష్మి : గతంలో 200 తీసుకెళ్తే ఇంట్లోకి సరిపడా సరుకులు వచ్చేవి. ఇప్పుడు రూ.2 వేలు తీసుకెళ్లినా రావడం లేదు. బుడగజంగాల సామాజికవర్గానికి చెందిన మేము దశాబ్దాల క్రితం ఊరి చివర ఇల్లు కట్టుకుని జీవిస్తున్నాం.దానికి పట్టా చూపించాలని, లేకుంటే కూల్చేస్తామని బెదిరిస్తున్నారు.
కృష్ణమ్మ : నాకు పెన్షన్ ఎప్పటి నుండో వస్తోంది. ఈ ప్రభుత్వం వచ్చిన మొదట్లో ఇచ్చారు. తర్వాత కరెంటు మీటర్ ఎక్కువగా తిరుగుతోందని పెన్షన్ తొలగించారు.