ఆరోగ్య శ్రీ అవకతవకలపై విచారణ జరిపించాలి
1 min read – జిజిహెచ్‌లో రోగులకు కనీస సౌకర్యాలు కల్పించాలి.
– మందులు, టెస్టులు ప్రభుత్వ ఆసుపత్రిలోనే అందించాలి. వైద్య శాఖ మంత్రికి సిపిఎం జిల్లా కమిటీ వినతి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆరోగ్య శ్రీ నిధుల్లో జరుగుతున్న అవకతవకలు, కోవిడ్ నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించాలని, కర్నూలు జిజిహెచ్‌లో రోగులకు కనీస సౌకర్యాలు కల్పించాలని,మందులు, టెస్టులు ప్రభుత్వ ఆసుపత్రిలోనే అందించాలనీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనికి సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్ దేశారు, నగర కార్యదర్శి టి.రాముడు గురువారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మంత్రి గారితో మాట్లాడుతూ జిజిహెచ్‌లో రోగులకు మరుగుదొడ్లు సక్రమంగా లేవని, స్ట్రెచర్ వంటి కనీస సౌకర్యాలు కూడా లేవని తెలిపారు. సిబ్బంది, వార్డు బాయిల కొరత చాలా ఎక్కువ ఉందని తెలిపారు. అన్ని వార్డులకు వార్డుబాయిలు ఉండేలా కొత్త వార్డుబాయిలను నియమించాలని, అన్ని వార్డులో స్ట్రెచ్చర్స్ ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. న్యూరో సర్జికల్ వార్డులో పేషంట్లను వరండాలో పెడుతునన్నారని, దోమలను, చలికి బాధలు అనుభవిస్తూ ఎందుకైనా వచ్చామా అని పేషంట్లు తమ బాధలను వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. నత్తనడకన సాగుతున్న క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాల అభివృద్ధికి సరిపడ నిధులను ప్రభుత్వం నుండి రాబట్టాలని, అన్ని రకాల జబ్బులకు మందులు ఉచితంగా ఇవ్వాలని, అన్నిరకాల టెస్టులు, స్కానింగ్ ఆసుపత్రిలోనే ఉచితంగా చేయాలని కోరారు. గుండె చికిత్సకు ఉపయోగపడే క్యాథ్ ల్యాబ్ మిషన్ వెంటనే కొనుగోలు చేయాలని, ఆసుపత్రిలో ఉన్న ఎక్స్ రే మిషన్లు వెంటనే రిపేర్ చేయాలని, లేకుంటే కొత్తవి కొనుగోలు చేయాలని విన్నవించారు. పాడైపోయిన వార్డుల్లో ఫ్లోరింగ్, మరుగుదొడ్లు మరమ్మతు చేయాచాలని, ఆసుపత్రిలో పనిచేస్తున్న స్కావెంజర్స్, సెక్యురిటీగార్డ్స్, వార్డుబారు జీతాలు పెంచాలని, తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరారు.