అంగరంగ వైభవంగా ముగిసిన శ్రీ రామాపురం క్షేత్ర బ్రహ్మోత్సవాలు
1 min read– అలరించిన ఎడ్లపందేలు, జబర్దస్త్ సాంస్కృతిక కార్యక్రమం
– స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రవిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వీరశివ
పల్లెవెలుగు వెబ్ కమలాపురం : కమలాపురం మండలం రామాపురం క్షేత్రంలో ఐదు రోజుల పాటు జరిగిన శ్రీ మహాలక్ష్మి సమేత మోక్షనా రాయణ, శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి బ్రహ్మో త్సవాలు వైభవంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాలను ఘనాపాటి వంశీ క్రిష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో ఐదవ రోజు ఉదయం మహాపూర్ణహుతి, కుంభాభిషేకం, చక్రస్నానం, అవబృతస్నానం పూజా కార్యక్రమాలు కన్నులపండువగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్దిలు దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలకు ఆలయ నిర్వాహకులు సాయినాథ్ శర్మ ఆధ్వర్యంలో పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అర్చకులు వారికి వేదాశీర్వచనం చేసి ఆలయమర్యాదలతో సత్కరించారు. ఉత్సవాలలో చివరి రోజు ఎడ్లపందేలు, జబర్దస్త్ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఎడ్ల పందేలను పుణ్యభూమి చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మెన్ సాయినాథ్ శర్మ ప్రారంభించారు. సాయంత్రం మహాలక్ష్మి సమేత మోక్షనారాయణుడు గరుడవాహనం, శ్రీ వల్లీదేవవసేన సమేత సుబ్రమణ్య స్వామి మయూర వాహనం పై మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. దేవతా మూర్తులను పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. నిర్వాహకులు సాయినాథ్ శర్మ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.