మల్లికార్జున రిజర్వాయర్ పై రైతుల ఉగ్రరూపం
1 min read– మల్లికార్జున రిజర్వాయర్ వద్దే వద్దు -ఒకే ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వం
-ప్రాజెక్టును రద్దు చేయని పక్షంలో ప్రజల ఉగ్రరూపం చూస్తారు
-మా నియోజకవర్గంలో కాటసాని పెత్తనం ఏంటి..?
-ఇక్కడ నాయకులు ఇంతకీ ఉన్నారా లేరా
-వందల మందితో తహశీల్దార్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత రైతుల ఉగ్రరూపం
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల తహసీల్దార్ కార్యాలయం సోమవారం ఉదయం 10:30 గంటలకే కితకితలాడింది.మల్లికార్జున రిజర్వాయర్ ప్రాజెక్టు వద్దే వద్దు మా సారవంతమైన పొలాలు ముద్దు..ఒకే ఒక్క సెంటు భూమిని కూడా ఈ ప్రాజెక్టుకు ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.వందల సంఖ్యలో సోమవారం ఉదయం మిడుతూరు తహసిల్దార్ కార్యాలయం తలుపుల దగ్గర రైతులు భారీగా బైఠాయించారు.గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా గ్రామ సభలు నిర్వహించకుండా గత నాలుగు ఐదు నెలల కిందటే ఈ ప్రాజెక్టు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేపట్టాలనే మ్యాపును తయారు చేసి పత్రికల్లో ప్రచురించడం వల్ల అప్పటినుంచి చుట్టుపక్క గ్రామాలు అయినా దేవనూరు,చింతలపల్లి, సున్నంపల్లి,49 బన్నూరు,గుడిపాడు,చౌటుకూరు తదితర గ్రామాల ప్రజలు భయ భ్రాంతులకు గురవుతున్నామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ప్రాజెక్టు వంద శాతం రద్దు చేయాల్సిందేనని ఒక వేళ రద్దు చేయని పక్షంలో ప్రజల ఉగ్ర రూపం మీరు చూస్తారు అంటూ వారు ఘాటుగా హెచ్చరించారు. ప్రాజెక్టు వద్దే వద్దు మా పొలాలు మాకు ముద్దు అంటూ వారు రైతులు గట్టిగా నినాదాలు చేశారు.తహసిల్దార్ బయటకి వచ్చి మాట్లాడాలని రైతులు పట్టుబట్టగా తహసిల్దార్ సిరాజుద్దీన్ బయటికి వచ్చి మాట్లాడడానికి ప్రయత్నించగా మా నియోజకవర్గంలో మా మండలంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పెత్తనం ఏంటి.. వేరే వారు వచ్చి ఇక్కడ మా పొలాలపై పెత్తనం చేలాయించాలని చూస్తూ ఉన్నారని అలా చేస్తే చూస్తూ ఊరుకునేది లేదంటూ ఇక్కడ మా నియోజకవర్గంలో మా మండలంలో నాయకులు లేరా అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.తర్వాత మల్లికార్జున రిజర్వాయర్ ప్రాజెక్టు రద్దు చేయాలని కోరుతూ వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు తహసిల్దార్ కు వినతి పత్రాలను అందజేశారు.అనంతరం తహసిల్దార్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు వస్తుందనే వాటి గురించి మా దృష్టికి ఇంతవరకు అయితే రాలేదని నేను త్వరగా కలెక్టర్ తో మాట్లాడి మీకు విషయం తెలియజేస్తానని ఆయన అన్నారు.ఈకార్యక్రమంలో అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి షేక్ గుల్జార్ అహ్మద్,సిపిఎం పార్టీ జిల్లా సభ్యులు వెంకటేశ్వర్లు, ఎస్సై మారుతి శంకర్,హెడ్ కానిస్టేబుల్ హనుమంతు,పోలీసు సిబ్బంది,మండల కో ఆప్షన్ సభ్యులు పెద్దమౌలా,రైతులు నవాజ్ అలీ,మన్సూర్ భాష,రామసిద్ధారెడ్డి,చింతలపల్లి నుండి శేశి రెడ్డి, మల్లేశ్వర రెడ్డి,కంటేశ్వర్ రెడ్డి,వెంకట శివారెడ్డి, గుడిపాడు నుండి రాము,శంకర్ సున్నం పల్లె నుండి పుల్లారెడ్డి,వెంకటరామిరెడ్డి మరియు వివిధ గ్రామాల రైతులు వందల సంఖ్యలో పాల్గొన్నారు.