తంగడంచ సీడ్ ఫారం రూపురేఖలు మారేనా..?
1 min readముళ్లపొదలతో బీడుగా మారిన విత్తనోత్పత్తి క్షేత్రం..
నిరుపయోగంగా 800 ఎకరాల ప్రభుత్వ భూమి..
పరిశ్రమలు స్థాపిస్తే 10 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు.
పరోక్షంగా మరో 7 వేల మందికి ఉపాధి అవకాశాలు..
టీడీపీ ప్రభుత్వం లో మెగాసీడ్ పార్క్ ఏర్పాటు కు భూముల కేటాయింపు..
వైకాపా ప్రభుత్వం ఉత్తర్వులు నిలిపిన వైనం..?
వై ఎస్ ఆర్ హయాంలో కృషి విజ్ఞాన కేంద్రానికి 100 ఎకరాలు కేటాయింపు..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు : నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో తంగడంచ విత్తనోత్పత్తి క్షేత్రం దేశవ్యాప్తంగా పేరుగాంచింది. ఒకప్పుడు 35 ఏళ్ళ క్రితం నేషనల్ సీడ్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో దాదాపు 1616 ఎకరాల భూములు పచ్చని పంటలతో కలకళలాడేవి. ఈ భూములు మన దేశంలోనే అత్యంత సారవంతమైన భూములుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం విశేషం. ఇక్కడి నుండి పంటలు పండించి నాణ్యమైన విత్తనాలను దేశ వ్యాప్తంగా విత్తనాల సరఫరా జరిగేదని పలువురు చెబుతుంటారు. నియోజకవర్గంలో ఉన్న పగిడ్యాల, జూపాడుబంగ్లా, నందికొట్కూరు, పాములపాడు మండలాల ప్రజలు ఈ భూములను నమ్ముకుని జీవించేవారు. దురదృష్టవశాత్తు ఎం ఎస్ సి ఫారం వారికి ఉన్న అగ్రిమెంట్ పూర్తవడంతో ఈ భూములను వదిలేశారు. అయితే ఈ 1616 ఎకరాల నేడు కంప చెట్లు, మూళ్ళ పొదలతో బీడు భూములుగా వేలెవెలబోతున్నాయి. ప్రభుత్వం తరపున వ్యవసాయ శాఖ అధికారులు అడద పడద కేవలం 200 ఎకరాలు భూముల్లో పంటలు వేస్తూ వదిలేస్తున్నారు. ఈ భూముల్లో ఏ ప్రభుత్వం వచ్చి ఇక్కడ పరిశ్రమలు స్థాపిస్తారో అని నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలోని జూపాడుబంగ్లా మండలం తంగడంచ, భాస్కరాపురం గ్రామానికి సమీపంలో దాదాపు 1616 ఎకరాల భూములు ఉన్నాయి. ఇందులో గత తెలుగుదేశం ప్రభుత్వం దాదాపు 624.60 ఎకరాలు జైన పరిశ్రమకు, అంబుజాకు 300 ఎకరాలు కేటాయించగా ఆ పరిశ్రమ రాకపోతే అందులో ఏ పి ఐ ఐ సి కి 250 కేటాయించారు. మిగిలిన 624 ఎకరాల్లో మెగా సీడ్ పార్కుకు కేటాయించారు. మెగాసీడ్ హబ్ ఏర్పాటు చేస్తున్నట్లు రూ.100 కోట్లు బడ్జెట్ లో గత ప్రభుత్వం కేటాయించింది. ఆ తరువాత పనులు చేపడతామని అధికారులు భూములను పరిశీలించారు. రోడ్లు , భవనాలు, నిర్మిస్తామని కూడా సర్వే పూర్తి చేశారు. మెగా సీడ్ పార్క్ ఆధ్వర్యంలో ఆచార్య ఎం జి రంగ విశ్వవిద్యాలయం వారు ఈ భూముల్లో 14 రకాల పంటలు బెడ్లుగా పండించి పంటలు తీశారు.త్వరలోనే అయోవా యూనివర్సిటీ వారి ఆధ్వర్యంలో మెగా సీడ్ పార్కు ఏర్పాటు చేస్తారని, దేశం లోని అన్ని రాష్ట్రాలకు ఇక్కడినుండే విత్తనాలు సరఫరా చేస్తామని అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీడ్ హబ్ కు శంకుస్థాపన కూడా చేసారు. కానీ 2019 లో ఎన్నికలు రావడంతో పనులన్నీ నిలిచిపోయాయి. రూ.679 కోట్లతో మెగా సీడ్ పార్క్ వస్తుందని, స్థానికులకు ఉద్యోగాలు, ఉపాధి లభిస్తుందని ఆశించారు. కానీ ఎన్నికలు వచ్చాక జగనన్నను రాష్ట్ర ప్రజలు గెలిపించుకున్నారు. ఎన్నికల అనంతరం నందికొట్కూరు నియోజకవర్గంలో ఉన్న జూపాడుబంగ్లా మండలంలో 624 ఎకరాలు మెగా సీడ్ పార్కుకు కేటాయించిన భూములను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో మెగా సీడ్ పార్కు నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడ్డాయనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి నాలుగేళ్లు పూర్తయిన ఇప్పటికి ఈ ఖాళీ భూముల్లో ఎటువంటి పరిశ్రమలు స్థాపించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం ఈ భూముల గురించి ప్రస్తావనే లేదని నియోజకవర్గ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో విత్తనోత్పత్తి క్షేత్రం భూముల్లో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసేందుకు అప్పటి ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ని కోరారు. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి సానుకూలంగా స్పందించి కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ కూడా ఇచ్చారని సమాచారం. కానీ ఆయన అకాల మరణంతో కృషి విజ్ఞాన కేంద్రం అటకెక్కింది. ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం లోనైనా వై ఎస్ ఆర్ కృషి విజ్ఞాన కేంద్రం, లేదా వై ఎస్ ఆర్ వ్యవసాయ, వెటర్నరీ కళాశాలలు ఏర్పాటుకు ముందడుగు పడలేదు . ఫారం భూముల్లో పరిశ్రమలు నెలకొల్పితే ప్రత్యక్షంగా 10 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, పరోక్షంగా 7 వేల మందికి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. నారా లోకేష్ యువగళం నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో ప్రవేశించిన నేపధ్యంలో నిరుపయోగంగా మారిన తంగడంచ విత్తనోత్పత్తి క్షేత్రం భూముల రూపు రేఖలు మార్పు గురించి ఎలాంటి హామీలు ఇస్తారోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.