జిల్లాలో రూ. 320 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు..
1 min read– రబీ ధాన్యం కొనుగోళ్లలో రూ.297 కోట్లు(93 శాతం) చెల్లింపులు..
– ప్రతి గింజ కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటాం..
– జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు జిల్లాలో ప్రస్తుత రబీ పంటకు సంబంధించి ఇంతవరకు రూ. 320 కోట్ల విలువైన 1.58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ లో జిల్లాలో రబీ ధాన్యం కొనుగోలు, దెబ్బతిన్న ధాన్యం కొనుగోలు, తదితర అంశాలను జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణితో కలిసి కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ పాత్రికేయులకు వివరించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జిల్లాలో రబీ పంటకు సంబంధించి ఇంతవరకు 320 కోట్ల రూపాయల విలువైన 1.58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమును కనీస మద్దతు ధరకు సేకరించడం జరిగిందన్నరు . ప్రస్తుతం ఇంతవరకు 297 కోట్ల రూపాయలు(93 శాతం) రైతుల యొక్క వ్యక్తిగత ఖాతాకు జమచేయడం జరిగిందన్నరు . ధాన్యం సేకరించిన 21 రోజుల లోపే రైతుల ఖాతాలకు సొమ్ము జమ జమచేయడం జరుగుతున్నదన్నారు. ధాన్యం సేకరణలో తొలుత 75 బస్తాలు ఉన్న పరిమితిని రైతుల విజ్ఞప్తి మేరకు 105 కు ప్రభుత్వం పెంచడం జరిగిందన్నారు. జిల్లాలో 136 రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతిరోజు సుమారు 8 నుంచి 11 వేల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు.ఇందుకు రోజు 400 నుంచి 500 వరకు లారీలు, ట్రాక్టర్లు రవాణా సదుపాయం కొరకు వినియోగిస్తున్నామన్నరు. రవాణా సౌకర్యం కోసం కోటి రూపాయలు ట్రాన్స్ పోర్టర్లకు అడ్వాన్స్ కూడా చెల్లించడం జరిగిందన్నారు. జిల్లాలో అకాల వర్షాలు మూలంగా ఎగువ మరియు మెరక ప్రాంతమైన చింతలపూడి, జంగారెడ్డిగూడెం, ముసునూరు మండలాల్లో నూక శాతం అధికంగా ఉన్న కారణంగా అట్టి ధాన్యమును కృష్ణా జిల్లా లోని బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించుటకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 1.58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు రైతుల వద్ద నుండి కొనుగోలు చేసినప్పటికీ ఇంకనూ చాలా ధాన్యము రైతుల వద్ద ఉందని , రైతు శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం మరో 50 వేల మెట్రిక్ టన్నుల అదనపు లక్ష్యాని వెంటనే కేటాయించడం జరిగినదన్నారు . దీంతో మొత్తం ధాన్యం లక్ష్యం 2.50 లక్షల మెట్రిక్ టన్నులకు చేరిందన్నారు. సీ యం ఆర్ కోసం కొనుగోలు చేసిన గోనె సంచుల్లో 40 శాతం వినియోగించుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చిందన్నారు.అదేవిధంగా పన్నెండున్నర ఎకరాలకు మించి సాగు చేసిన పెద్ద రైతుల నుంచి కూడా ధాన్యం సేకరణ చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. జిల్లాలో మొక్కజొన్న కొనుగోలుకు లక్ష్యాన్నికూడా నిర్ధేశించి మంగళవారం కొన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగిందన్నారు. మార్కెఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు జరుగుతుందన్నారు. జాయింట్ కలెక్టర్ బి. లావణ్య వేణి మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి 21 రోజుల్లోపే సంబంధిత రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేయడం జరిగిందన్నారు. క్షేత్రస్ధాయి పర్యటనకు వెళ్లినపుడు ధాన్యం సేకరణపై రైతులు తమ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్నారు. రైతులు జిల్లాలో 5 మండలాల్లో ధాన్యం ఎక్కువగా రావడం జరిగిందన్నారు. మెట్టప్రాంతంలో ఎక్కువ నూకశాతం కనబడిందని అందుకు తగిన చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. జిల్లాలో ఇంతవరకు 50 లక్షల వరకు గోనె సంచులు సరఫరా చేశామన్నారు. మిగిలిన ధాన్యం కొనుగోళ్లలో ఎటువంటి ఇబ్బంది లేకుండా రవాణా, గోనె సంచులు తదితర ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి వై. రామకృష్ణ, పౌరసరఫరాల జిల్లా మేనేజరు మంజూ భార్గవి, డిఎస్ వో ఆర్.ఎస్.ఎస్.ఎస్.రాజు తదితరులున్నరు.