ధాన్యం కొనాలని అడిగిన రైతులను ఎర్రిపప్పలంటారా?
1 min read– అదేపదంవాడి జగన్ ను ధాన్యం ఎప్పుడు కొంటావని అడగొచ్చా?
– ధాన్యం కొనమని అడగడం రైతులు చేసిన తప్పా?
– వైసిపి మంత్రులు కొవ్వెక్కి మాట్లాడుతున్నారు
– రూ.లక్ష కోట్లున్న ముఖ్యమంత్రి ఏవిధంగా పేదవాడు?
– జగన్ జీవితమంతా గోల్ మాల్ గందరగోళం!
– జగన్ కు చెబుతున్నా… 6సమస్యలకు జవాబు ఇవ్వండి
– యువగళాన్ని అడ్డుకునేందుకు రోడ్లపైకి దొంగలబ్యాచ్
నందికొట్కూరు సభలో నిప్పులు చెరిగిన యువనేత లోకేష్
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: వైసిపి మంత్రులు కొవ్వెక్కి మాట్లాడుతున్నారు, రైతుల్ని ఎర్రిపప్ప నోరు మూసుకో అంటూ తిడుతున్నారు, మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు ఎర్రిపప్ప కి కొత్త అర్ధం చెప్పారు, ఎర్రిపప్ప అంటే బుజ్జినాన్నా అని అర్ధం అంట… అదే పదంవాడి నేనుజగన్ ను ధాన్యం ఎప్పుడు కొంటావని అడగొచ్చా? రైతులు చేసిన నేరం ఏంటి? తడిచిన ధాన్యం కొనమని అడగటం తప్పా? గోల్ మాల్ జగన్ ది రైతు వ్యతిరేక ప్రభుత్వమని యువనేత నారా లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నందికొట్కూరులో జరిగిన బహిరంగసభలో లోకేష్ మాట్లాడుతూ… రైతుల్ని అవమానించిన మంత్రి, గోల్ మాల్ జగన్ రైతులకు క్షమాపణ చెప్పాలి. కనీసం సీఎం మంత్రి వ్యాఖ్యల్ని ఖండించలేదు. రైతులు అంటే కనీస గౌరవం లేని వ్యక్తి గోల్ మాల్ జగన్. అబద్దానికి మానవ రూపం జగన్. ఆయనకి ఒక శాపం ఉంది. నిజం చెబితే ఆయన తల వెయ్యి ముక్కలు అవుతుంది. అందుకే ఆయన ఎప్పుడూ అబద్దాలే చెబుతాడు. లక్ష కోట్ల ఆస్తి పరుడు పేదవాడా? లక్ష రూపాయల చెప్పులు వేసుకునే వాడు పేదవాడా? వెయ్యి రూపాయల నీళ్ల బాటిల్ తాగే జగన్ పేదవాడా? బెంగుళూరు యలహంకలో 23 ఎకరాల్లో ప్యాలస్, హైదరాబాద్ లో ప్యాలస్, తాడేపల్లి లో ప్యాలస్, ఇడుపులపాయ లో ప్యాలస్, వైజాగ్ లో ప్యాలస్ కడుతున్నాడు. ఇన్ని ప్యాలస్ లు ఉన్నవాడు పేదవాడు ఎలా అవుతాడు? సొంత ఛానెల్, సొంత పేపర్ ఉన్నవాడు పేదవాడు ఎలా అవుతాడు? సిమెంట్ కంపెనీలు, పవర్ ప్లాంట్లు ఉన్నవాడు పేదవాడు ఎలా అవుతాడు? దేశంలోనే ధనిక సీఎం నేను పేదవాడ్ని అంటూ చెవిలో క్యాలీఫ్లవర్ పెడుతున్నాడు. ఈ మోసగాడ్ని నమ్మి మరోసారి మోసపోతారా?
పేదల గళం వినిపించేందుకే యువగళం
పేదలు గళం వినిపించే వేదిక యువగళం. పేదలు ఎప్పటికీ పేదరికంలో ఉండాలి అనేది ధనిక సీఎం జగన్ కోరిక. పేదరికం లేని రాష్ట్రం చూడాలన్నది మీ లోకేష్ కోరిక. జగన్ జీవితం అంతా గోల్ మాల్. ఆయన ఏ స్కీమ్ ప్రవేశ పెట్టినా అందులో గోల్ మాల్ ఉంటుంది. అందుకే ఆయనకు గోల్ మాల్ జగన్ అని పేరు పెట్టా. నందికొట్కూరు నాటు దెబ్బ అదుర్స్. మీ దెబ్బకి జగన్ దిమ్మతిరిగిపోతుంది. సప్తనదుల సంగమం సంగమేశ్వర ఆలయం, సరస్వతి దేవాలయం కొలనుభారతిదేవి క్షేత్రం, శ్రీ సూర్య నారాయణ స్వామి ఆలయం ఉన్న పుణ్య భూమి ఈ నందికొట్కూరు. రాయలసీమకు తాగు, సాగునీరు అందించే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలకు పుట్టినిల్లు నందికొట్కూరు నియోజకవర్గం. ఎంతో చరిత్ర ఉన్న నందికొట్కూరు నియోజకవర్గంలో పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం. యువగళం…మనగళం…ప్రజాగళం. యువగళం పాదయాత్ర దెబ్బకి వైసిపి దొంగల బ్యాచ్ అంతా రోడ్డు మీదకి వస్తోంది. లోకేష్ ని అడ్డుకుంటాం అంటూ సవాల్ చేస్తున్నారు. రాజకీయంగా చచ్చిన శవాలు కూడా సవాళ్లు విసరడం వింతగా ఉంది. నేను ముందే చెప్పా సాగనిస్తే పాదయాత్ర… అడ్డుకుంటే దండయాత్ర అని. అడ్డుకోవడానికి ఎంత మంది వచ్చినా మేము రెడీ…తన్నులు తినడానికి మీరు రెడీనా?
ఈ 6సమస్యలకు సమాధానం చెప్పండి!
గోల్ మాల్ జగన్ కొత్త స్కీం తెచ్చాడు అంట దాని పేరు ఏంటో తెలుసా? జగన్ కి చెబుదాం అంట. టిడిపి హయాంలో ఉన్న 1100 రియల్ టైం గవర్నెన్స్ ని నిర్వీర్యం చేసాడు. పేరు మార్చి స్పందన అని పేరు పెట్టాడు. స్పందన లో ఎన్ని అర్జీలు పెట్టినా స్పందన లేదు. ఇప్పుడు దాని పేరు జగన్ కి చెబుదాం అని మార్చి కొత్త డ్రామా మొదలు పెట్టాడు. నాకు ఆరు సమస్యలు ఉన్నాయి గోల్ మాల్ జగన్ కి చెప్పేదాం. ఎప్పుడు పరిష్కరిస్తాడో చూద్దాం. మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చారు. ఎప్పుడు చేస్తారు? 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చారు. నాలుగేళ్లు గడిచిపోయాయి. ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారు? రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలతో రైతులు నష్టపోయారు. ప్రభుత్వం తడిచిన ధాన్యం కొనాలి. ఎప్పటిలోగా కొంటారు? బీసీల్లో ఉన్న ఉపకులాలకు నిధులు కేటాయిస్తాం అన్నారు. బీసీలకు చెందాల్సిన డబ్బులు ఎప్పటిలోగా బీసీలకు ఇస్తారు? ఎస్సీలకు కేటాయించిన 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసారు ఎప్పటి లోగా అవి తిరిగి ప్రారంభిస్తారు? పన్నుల భారంతో పెంచేసిన పెట్రోల్, డీజిల్ ధరలు.. నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలి. ఎప్పటిలోగా తగ్గిస్తారు?
యువత భవితకు గోల్ మాల్ జగన్ తూట్లు
గోల్ మాల్ జగన్ పాత ఫీజు రీఎంబర్స్మెంట్ పధకాన్ని రద్దు చేసి విద్యా దీవెన, వసతి దీవెన అని చెత్త పధకాలు తెచ్చాడు. ఇప్పుడు దాదాపు 2 లక్షల మంది విద్యార్థులకు కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వలేదు. గోల్ మాల్ జగన్ దెబ్బకి విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుంది. ఉన్నత చదువులు చదవాలి అంటే సిర్టిఫికెట్లు లేవు. ఉద్యోగాలకి అప్లై చెయ్యాలి అంటే సర్టిఫికెట్లు లేవు. గోల్ మాల్ జగన్ గోల్ మాల్ స్కీమ్స్ దెబ్బకి విద్యార్థులు, తల్లిదండ్రులకు అప్పులు, తిప్పలు మాత్రమే మిగిలాయి. గోల్ మాల్ జగన్ కట్టింగ్ అండ్ ఫిట్టింగ్ మాస్టర్. ఫిట్టింగ్ ఎలా ఉంటుందో చెబుతా. గోల్ మాల్ జగన్ కి రెండు బటన్స్ ఉంటాయి. ఒకటి బ్లూ బటన్. రెండోవది రెడ్ బటన్. బ్లూ బటన్ నొక్కగానే మీ అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. రెడ్ బటన్ నొక్కగానే మీ అకౌంట్ నుండి 100 రూపాయలు పోతుంది. అది ఎలాగో మీకు చెబుతా. విద్యుత్ ఛార్జీలు 8 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు. మీకు ఇంకో ప్రమాదం కూడా ఉంది త్వరలోనే వాలంటీర్ వాసు మీ ఇంటికి వస్తాడు. మీరు పీల్చే గాలిపై కూడా పన్నేస్తాడు.
దమ్ముంటే ఆ బిల్లులమీద స్టిక్కర్లు వేయండి
గోల్ మాల్ జగన్ కి దమ్ముంటే ఇంటికి స్టిక్కర్ కాదు… కరెంట్ బిల్లుకి, బస్సు టికెట్ మీద, పెట్రోల్, డీజిల్ బిల్లు మీద, చెత్త పన్ను మీద, ఇంటి పన్ను మీదా స్టిక్కర్ వెయ్యాలి. గోల్ మాల్ జగన్ కట్టింగ్ మాస్టర్. అది ఎలాగో చెబుతాను. అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ గోల్ మాల్ జగన్. గోల్ మాల్ జగన్ యువత భవిష్యత్తును నాశనం చేసాడు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సీ లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం.
మహిళల పసుపు,కుంకుమ చెరిపేస్తున్నారు!
గోల్ మాల్ జగన్ మహిళల పసుపు, కుంకుమ చెరిపేస్తున్నాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ ఎం అయ్యింది? సొంత జే బ్రాండ్లు అమ్ముకొని వేల కోట్లు సంపాదిస్తున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని మోసం చేసాడు. అధికారంలోకి వచ్చాకా పన్నుల భారం తగ్గిస్తాం. నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తాం. గోల్ మాల్ జగన్ రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు. గోల్ మాల్ జగన్ పరిపాలనలో పురుగుల మందులు పనిచేయవు. జగన్ బ్రాండ్లు ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్, ఆంధ్రా గోల్డ్ కొడితే మాత్రం పురుగులు చస్తాయి. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మీటర్లు పెడుతున్నాడు. రాయలసీమ లో 1000 అడుగుల వరకూ బోర్లు వేస్తే కానీ నీళ్లు రావు…,మరి కరెంట్ బిల్లు ఎంత వస్తుందో ఆలోచించండి. మీటర్లు రాయలసీమ రైతులకు ఉరితాళ్లు. గోల్ మాల్ జగన్ ఉద్యోగస్తులను కూడా వేధించాడు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని చెత్త ప్రభుత్వం ఇది.
బిసిల బ్యాక్ బోన్ విరిచిన జగన్!
బీసీలకు బ్యాక్ బోన్ విరిచాడు గోల్ మాల్ జగన్. పేరుకే బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసారు. నిధులు కేటాయించలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్ కట్ చేసి 16,500 మందిని పదవులకు దూరం చేసాడు. బీసీలను అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల అక్రమ కేసులు బీసీల పై పెట్టాడు. అందుకే బీసీల భద్రత కోసం ప్రత్యేక బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం. బీసీలకు శాశ్వత కుల ధృవ పత్రాలు అందిస్తాం. బీసీలమని ఆరు నెలలకోసారి కుల ధృవపత్రాలు తీసుకోవాల్సిన దుస్థితి లేకుండా చేస్తాం. మొబైల్ లో ఒక్క బటన్ నొక్కగానే ఇంటికి బిసి కుల ధృవ పత్రాలు వచ్చే ఎర్పాటు చేస్తాం. అవి శాశ్వత కుల ధృవ పత్రాలు గా ఉపయోగపడేలా చట్టం లో మార్పులు తీసుకొస్తాం. దామాషా ప్రకారం బీసీ ఉపకులాలకు నిధులు, రుణాలు ఇస్తాం. గోల్ మాల్ జగన్ దళిత ద్రోహి. డాక్టర్ సుధాకర్ దగ్గర మొదలైంది. ఇప్పుడు డాక్టర్ అచ్చెన్న వరకూ వచ్చింది. ఇసుక అక్రమాలను ప్రశ్నించినందుకు వరప్రసాద్ కి గుండు కొట్టించారు, మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ ని కొట్టి చంపారు, జగన్ లిక్కర్ స్కామ్ పై పోరాడినందుకు ఓం ప్రతాప్ కి చంపేసారు. పెద్దిరెడ్డి అవినీతి పై పోరాడినందుకు జడ్జ్ రామకృష్ణ ని హింసించారు. ఒక్క కేసులో అయినా దళితులపై దాడి చేసిన వారికీ శిక్ష పడిందా? సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడిని చంపేసిన ఎమ్మెల్సీ అనంతబాబు కి సన్మానం చేసి ఉరేగించారు. వైసిపి పాలనలో దళితులను చంపడానికి జగన్ స్పెషల్ లైసెన్స్ ఇచ్చారు.టిడిపి అధికారంలోకి రాగానే రద్దుచేసిన దళితసంక్షేమ పథకాలను మళ్లీ తీసుకువస్తాం.
మైనారిటీలను కూడా మోసగించాడు!
మైనారిటీలను మోసం చేసాడు గోల్ మాల్ జగన్. దుల్హన్, రంజాన్ తోఫా వంటి పథకాలు రద్దు చేశాడు. మసీదు, ఈద్గా, ఖబర్ స్తాన్ ల అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కేటాయించలేదు. ఆత్మహత్య చేసుకోవడం మైనార్టీలు మహా పాపంగా భావిస్తారు. గోల్ మాల్ జగన్ సీఎం అయ్యాక నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కేవలం వైసీపీ నాయకుల వేధింపుల వల్లే వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఇబ్రహీం అనే ముస్లిం నేతను నరసరావుపేటలో దారుణంగా నరికి చంపేశారు. పలమనేరులో మిస్బా అనే పదో తరగతి చెల్లిని వైసీపీ నాయకుడు సునీల్ టీసీ ఇప్పించి, బలవంతంగా వేధించడంతో, చదువుకు దూరం చేయడంతో ఆత్మహత్య చేసుకుంది. కర్నూలు లో హాజీరాని అత్యాచారం చేసి చంపేశారు. ఆమె తల్లి బేగంబీ కి కనీసం పోస్టుమార్టం రిపోర్ట్ ఇవ్వకుండా ప్రభుత్వం వేధించింది. ఇప్పటికీ ఆ తల్లికి న్యాయం జరగలేదు. తాజాగా మదనపల్లిలో అక్రమ్ అనే ముస్లిం యువకుడ్ని పులివెందుల బ్యాచ్ దారుణంగా కొట్టి చంపింది. టీడీపీ హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసాం. హజ్ యాత్రకు సహాయం చేసాం. ఆనాడు బీజేపీ తో పొత్తు ఉన్నా మైనార్టీల పై ఒక్క దాడి జరగలేదు, ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆపలేదు. గోల్ మాల్ జగన్ రెడ్డి సోదరులను కూడా మోసం చేసాడు. కోట్లు ఖర్చు చేసి జగన్ ని సీఎం చేస్తే రెడ్డి సోదరులకు కనీస గౌరవం దక్కడంలేదు.
ఆయన రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ
గోల్ మాల్ జగన్ నేను రాయలసీమ బిడ్డని అంటాడు కానీ ఆయన రాయలసీమ కు పట్టిన క్యాన్సర్ గడ్డ. అప్పర్ తుంగభద్ర కోసం కేంద్రం 5300 కోట్లు కేటాయించింది. ఆ ప్రాజెక్టు పూర్తి అయితే రాయలసీమ ఎడారిగా మారిపోతుంది. టిడిపి ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసింది 11,700 వేల కోట్లు. జగన్ 4 ఏళ్లలో ఖర్చు చేసింది 2,700 కోట్లు మాత్రమే. రాయలసీమ రైతులకు టిడిపి హయాంలో ఇచ్చిన డ్రిప్ ఇరిగేషన్ రద్దు చేసాడు జగన్ రెడ్డి. ఎస్సి,ఎస్టీలకు 100 శాతం సబ్సిడీ, మిగిలిన వారికి 90 శాతం సబ్సిడీ తో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. జగన్ దెబ్బకి రాయలసీమ ఎత్తిపోతల పధకం ఎత్తిపోయింది. గ్రీన్ ట్రైబ్యూనల్ లో కేసు ఉందనే సాకుతో వదిలేశారు. వివేకా హత్య కేసులో నిందితులను కాపాడటం పట్ల ఉన్న శ్రద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకంపై లేదు. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు మరమత్తు మర్చిపోవడంతో ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయి 61 మంది చనిపోయారు. రిలయన్స్, అమరరాజా, జాకీ వెళ్లిపోవడం వలన రాయలసీమ యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు.
నందికొట్కూరులో వైసిపి నేతల ఆగడాలు
2019లో నందికొట్కూరు ఎమ్మెల్యే గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ధర్ గారిని మీరు భారీ మెజారిటీతో గెలిపించారు. ఒక్క దళితుడి జీవితం అయినా మారిందా? ఎమ్మెల్యే గారే రోడెక్కి హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి. ఆర్థర్ గారికి ఆర్డర్ వేసే అధికారాలు లేవు. జగన్ పాలనలో దళితులకు జరుగుతున్న అవమానం చూడాలి అంటే నందికొట్కూరు రావాలి. నందికొట్కూరుని వైసిపి నాయకులు భూకబ్జాలకు, అక్రమ మద్యానికి ల్యాండ్ సెటిల్మెంట్స్ కి అడ్డాగా మార్చేసారు. నందికొట్కూరు లో ఉన్న ఎన్టీఆర్ జలాశయాన్ని కబ్జా చేసారు వైసిపి నేతలు. సుమారు 2 కోట్లు విలువ చేసే భూమి కొట్టేసారు. జలాశయాన్ని పూడ్చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. నందికొట్కూరులోని బ్రహ్మం గారి మఠం సమీపంలో 22 ఎకరాల భూమిని సెంటు స్థలాల కోసం ఎకరా 5 లక్షలకు కొని ప్రభుత్వానికి ఎకరా 60 లక్షలకు అమ్మాలని పెద్ద స్కెచ్ వేసారు వైసిపి నేతలు. టిడిపి నాయకుల పోరాటంతో అది ఆగింది. 4 వే రోడ్డులో పోయిన సుమారు 75 సెంట్ల మున్సిపాలిటీ స్థలాన్ని ప్రయివేట్ స్థలంగా చూపించి 2 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ము కొట్టేయాలని చూస్తున్నారు వైసిపి నేతలు. జూపాడుబంగ్లా గ్రామంలో సర్వే నంబర్ 711-2 లో భూమిని వైసిపి నేతలు కొట్టేసారు. టిడిపి హయాంలో గోకులం కి కేటాయించిన భూమిని కబ్జా చేసారు. ఆఖరికి అంగన్వాడీ స్థలాన్ని కూడా కబ్జా చేసారు. ముబారక్ షాదీఖానా పక్కనున్న 20 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని వైసిపి నేతలు కబ్జా చేసి అమ్మేసారు. తెలంగాణ నుండి లిక్కర్ తెచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ అమ్ముతున్నారు వైసిపి నేతలు.
టిడిపి హయాంలోనే నందికొట్కూరు అభివృద్ధి
నందికొట్కూరుని అభివృద్ధి చేసింది టిడిపి. రూ.1200 కోట్లతో నందికొట్కూరు నియోజకవర్గంలో తాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు.. వంటి అభివృద్ధి పనులు చేసాం. రూ.300 కోట్లతో ముచ్చుమర్రి లిఫ్ట్ 17 నెలల్లో పూర్తి చేసి కేసీ కాలువ, హంద్రీనీవాకు కృష్ణా జలాలు అందించింది టిడిపి. తంగడంచ గ్రామం వద్ద 1,800 ఎకరాల్లో మెగా సీడ్ పార్క్ ఏర్పాటు చేసి.. 30 వేల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని రూ.100 కోట్లు బడ్జెట్ కేటాయించి టిడిపి ప్రభుత్వం పనులు మొదలు పెడితే… జగన్ వచ్చాక సీడ్ పార్క్ రద్దు చేశారు. జైన్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు తంగడంచ దగ్గర భూములు కేటాయించి టిడిపి ప్రభుత్వంలో పనులు మొదలు పెడితే… జగన్ వచ్చాక పనులు ఆగిపోయాయి. టిడిపి హయాంలో రూ.1,030 కోట్లతో హంద్రీనీవా కాలువ విస్తరణ పనులు చేపట్టి.. రూ.280 కేట్లు ఖర్చు చేశారు. వైసీపీ వచ్చాక పనులు ఆపేశారు. అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి నందికొట్కూరు మునిసిపాలిటీకి త్రాగునీటి పథకం కోసం పైప్ లైన్ ఏర్పాటుకు టిడిపి హయాంలో రూ.110 కోట్లు కేటాయించాం. ఆ పనులు వైసిపి ప్రభుత్వం ఆపేసింది. వైసీపీ ప్రభుత్వం వచ్చి నాలుగేళ్లు అయినా అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మరమ్మతులు చేపట్టలేదు.
పాదయాత్రలో హామీలు ఏమయ్యాయి?
జగన్ పాదయాత్రలో భాగంగా నందికొట్కూరు వచ్చినప్పుడు అనేక హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలు – గుంటూరు (కేజీ) రోడ్డు విస్తరణ, ఆధునీకరణ చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. నాలుగేళ్లు అయినా దిక్కు లేదు. మిడ్తూరు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తాం అని హామీ ఇచ్చారు. అన్ని మండలాల్లోని లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేస్తాం అన్నారు. శ్రీశైలం నీటి ముంపు వాసులకు ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారు. నందికొట్కూరులో ఎక్కువగా ఉన్న త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తా అని హామీ ఇచ్చారు. ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మిడ్తూరు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తాం. పెండింగ్ ప్రాజెక్టులు అన్ని పూర్తి చేసి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాం. నియోజకవర్గంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం. శ్రీశైలం ప్రాజెక్టు ముంపు బాధితులు జీవో నంబరు – 98 మేరకు ఇంకా 674 మంది ఉద్యోగాల కోసం ఆందోళన చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో జాబితా తయారు చేశారు. ఇంతలో ప్రభుత్వం పడిపోయింది. టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత మీకు న్యాయం చేస్తాం.
రోడ్డు విస్తరణ బాధితులకు న్యాయం చేస్తాం!
నందికొట్కూరు పట్టణంలో కేజీ రోడ్డు విస్తరణలో ఇళ్లు, భవనాలు, దుకాణాలు కోల్పోయే బాధితులకు నష్టపరిహారం అందిస్తాం. మొక్కజొన్న రైతుల్ని ఆదుకుంటాం. అవసరమైన కొనుగోలు కేంద్రాలు, గౌడౌన్స్ ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పిస్తాం. నియోజకవర్గంలో 1400 ఎకరాల ఏపిఐఐసి భూమి ఉంది. ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికంగా ఉద్యోగాలు కల్పిస్తాం. 2014 లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో టిడిపి గెలిచింది 3 సీట్లే. అయినా కర్నూలు జిల్లా ని అభివృద్ధి చేసాం. ఎయిర్పోర్ట్, మెగా సీడ్ పార్క్, మెగా సోలార్ పార్క్, సిమెంట్ ఫ్యాక్టరీలు, 3 వేల కోట్ల తో ఇరిగేషన్ ప్రాజెక్టులు, డెప్యూటీ సీఎం పదవి ఇచ్చాం. 2019 లో 14 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు వైసిపి కి ఇచ్చారు. ఉమ్మడి కర్నూలు జిల్లా కి వైసిపి పీకింది ఏంటి? 16 మంది రండి నేను చర్చ కు రెడీ. ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో చర్చకు సిద్ధమా? వచ్చే ఎన్నికల్లో టిడిపిని గెలిపించి, చంద్రన్నను సిఎం చేసేందుకు సహకరించండి. అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తాం.