ఆసుపత్రులలో పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టి సారించాలి : కలెక్టర్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు : ఆసుపత్రుల్లో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని వైద్య అధికారులను జిల్లా కలెక్టర్ డా.జి.సృజన ఆదేశించారు.బుధవారం ఆదోని పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, ఆదోని శాసన సభ్యులు సాయిప్రసాద్, ఎమ్మెల్సీ డా.మధుసూధన్ మరియు ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముందుగా పిడియాట్రిక్ వార్డ్, పురుషుల మరియు స్త్రీల మెడికల్ వార్డ్ పరిశీలించిన అనంతరం సంబంధిత వార్డ్ లో ఉన్న పేషంట్స్ తో మాట్లాడుతూ వైద్యం ఎలా అందుతుంది, మందులు సరైన సమయానికి ఇస్తున్నారా లేదా అని ఆరా తీయగా వైద్యం బాగా చేస్తున్నారని, మందులు సరైన సమయానికి ఇస్తున్నారని జిల్లా కలెక్టర్ గారితో సంతృప్తి వ్యక్తం చేస్తూ బాత్రూముల పరిస్థితి అసలు బాగాలేవని వాటిని మరమత్తులు చేయించాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొని రాగా బాత్రూం స్థితిని పరిశీలించి జిల్లా కలెక్టర్ అసహనం వ్యక్తం చేస్తూ బాత్రూమ్ ల స్థితిని మెరుగు పరిచేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత వైద్యాధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అలాగే పేషంట్స్ ఆసుపత్రిలో ఎప్పుడు అడ్మిట్ అయ్యారని సంబంధిత చెక్ లిస్ట్ ను చెక్ చేశారు. ఆసుపత్రి అవరణంలో శుభ్రత మరియు డ్రెయిన్ల పరిస్థితి కూడా సరిగా లేదని వాటి పై కూడా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమీషనర్ రఘునాథ్ రెడ్డిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అదే విధంగా క్రమం తప్పకుండా హాస్పిటల్ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసుకొని పూర్తిస్థాయిలో నివేదికలు ఉన్నతాధికారులకు పంపాలని జిల్లా కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు. ఆసుపత్రికి కేటాయించిన వైద్యులలో ఎటువంటి కొరత లేదని కానీ రోగులకు సేవలు అందించడంలో కొన్ని లోటుపాట్లు గుర్తించామని వాటిని పూర్తి స్థాయిలో పరిష్కరించి, ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఆసుపత్రిలో అదనపు బ్లాక్ నిర్మాణం పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయన్నారు.ఆసుపత్రికి వచ్చిన పరికరాలను మరియు ఇంకా రావాల్సిన పరికరాలను ఏ విధంగా ఉపయోగిస్తున్నారు వాటిని ఏ విధంగా పరిరక్షిస్తున్నారు అనే అంశం పైన కూడా సమీక్షలు నిర్వహించి, ఆదోని ప్రాంతంలో జీవనజ్యోతి లాగ అందుబాటులో ఉన్న ఏరియా ఆసుపత్రిని వదిలి ప్రజలు బయట ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్తామన్నారుజిల్లా కలెక్టర్ వెంట డిసిహెచ్ఎస్ రాంజీ నాయక్, తహసిల్దార్ వెంకటలక్ష్మి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.