ఎంత నష్టం ఎంత కష్టం…
1 min read– మానవత్వ హృదయంతో అగ్ని ప్రమాద బాధితుడికి సాయినాథ్ శర్మ ఆర్థికసహాయం
– తాత్కాలిక సహాయంగా పదివేల రూపాయలు అందవేత
పల్లెవెలుగు వెబ్ కమలాపురం : కమలాపురం నియోజకవర్గం చెన్నూరు మండల కేంద్రం కడప- హైదరాబాద్ ప్రధాన రహదారి పక్కన మద్దూరి సుబ్బయ్య పేరుతో చిన్నపాటి బేకరి దుకాణాన్ని నడుపుకుంటున్న తెలుగుదేశం పార్టీకి చెందిన నిస్వార్థ కార్యకర్త మద్దూరి బాబు బేకరి దుకాణం శుక్రవారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధం కావడం తో రెక్కాడితే గాని డొక్కాడని బాబు కుటుంబం వీధిన పడింది. దాదాపు నలభై లక్షల రూపాయల వరకు సామాగ్రి విద్యుత్ కి ఆహుతి అయిపోయింది. తన ఇంట్లొ వివాహానికి అప్పుగా తెచ్చుకున్న పది లక్షల రూపాయల నగదు సైతం అగ్నికి ఆహుతి కావడంతో బాబు కుటుంబం తల్లడిల్లి పోతోంది. బాబు కుటుంబానికి జరిగిన నష్టాన్ని కష్టాన్ని చెన్నూరు లోని తన అభిమానుల ద్వార తెలుసుకొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడు తెలుగు నాడు ప్రజా సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ శనివారం మధ్యాన్నం చెన్నూరు కు వచ్చి దగ్ధమైన దుకాణాన్ని అగ్నికి ఆహుతైన అందులోని బేకరి సామాగ్రిని చూసి చలించిపోయారు. తక్షణమే తాత్కాలిక సహయం కింద చెన్నూరు మండల నాయకులు పొట్టిపాటి ప్రతాప్ రెడ్డి , ప్రసాద్ రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో బాబు కుటుంబానికి తాత్కాలికంగా పదివేల రూపాయల ఆర్ధిక సహాయం అక్కడికక్కడే అందించారు. ఈ సందర్భంగా సాయినాథ్ శర్మ మాట్లాడుతూ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పెద్ద ప్రమాదం సంభవించి బాబు కుటుంబానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఉన్న బాబు కుటుంబానికి జరిగిన నష్టం కష్టం చూసి తన వంతు సహాయం చేస్తున్నానన్నారు. బాబు కుటుంబానికి భవిష్యత్తులో మరింత సహాయం చేయనున్నట్లు చెప్పారు. కాగా బాబు కుటుంబాన్ని చూసి చలించి ఆర్థిక సహాయం చేసి బాబు కుటుంబ సభ్యుల్లో ధైర్యం నింపిన సాయినాధ్ శర్మను స్థానిక ప్రజలు మానవత్వం ఉన్న మనిషిగా ప్రశంసిస్తున్నారు. సాయినాథ్ శర్మ వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దబుద్ధి శివప్రసాద్, జనార్దన్ రెడ్డి, రాజారెడ్డి, గురు మహేశ్వర రెడ్డి, శ్రీనివాసులు జనార్ధన్, బ్రహ్మయ్య, రాము, తదితరులు పాల్గొన్నారు . ఈ మేరకు మండల రెవిన్యూ అధికారులకు విద్యుత్ అధికారులతో సాయినాథ్ శర్మ మాట్లాడి బాబు కుటుంబానికి తగిన సహాయం చేయాలని కోరారు.