PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అల్లూరు రోడ్డు వాగు కాలువ కబ్జా..

1 min read

– దర్జాగా కాలువలో అక్రమ నిర్మాణాలు..

– మారుతి నగర్ కు పొంచి ఉన్న ప్రమాదం..

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు అక్రమార్కులు కబ్జాకు పాల్పడుతున్నారు. చివరికి అల్లూరు రోడ్డు వాగును( మురుగునీటి కాలువ) కూడా వదలి పెట్టకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టి.. ఆనవాలు లేకుండా చేస్తున్నారు. కోట్లు విలువైన భూములలో నిర్మాణాలు వెలుస్తున్నాయి. భూముల ధరలకు రెక్కలు రావడంతో నందికొట్కూరు పట్టణంలో  ఎక్కడ భూమి ఖాళీగా కనిపిస్తే అక్కడ అక్రమాకులు పాగా వేస్తున్నారు. కబ్జా చేసే వారంతా రాజకీయ నాయకుల అండదండలు ఉన్న బడ పెట్టుబడుదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులే కావడంతో అధికారుల సైతం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

కాలువ ఆక్రమణ ఇలా..

నందికొట్కూరు మున్సిపాలిటీ   వార్డ్ నెంబర్ 13లోని అల్లూరు రోడ్డు లో  మురుగునీరు  కాలువ అంచున జూపాడుబంగ్లా మండలానికి చెందిన ఒక వైసీపీ నాయకుడు కు చెందిన ప్లాట్ ఉండడంతో తమ ప్లాటు విస్తరణ పెంచుకునేందుకు కాలువలో అడ్డంగా గోడ నిర్మాణం పనులు చేసుకుంటూ    కొద్ది కొద్దిగా  కాలువని కబ్జా చేస్తూ ప్లాంట్ విస్తరణ పెంచుకుంటున్నారనే స్థానికులు ఆరోపిస్తున్నారు. రోజురోజుకీ  వాగు కాలువ ఎవరు పట్టించుకోకపోవడంతో కాలువ చిన్నబోతుంది. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావు తీస్తుందని కాలనీవాసులు వాపోతున్నారు.

మారుతీ నగర్ కు పొంచి ఉన్న ప్రమాదం..

కాల్వ కబ్జాకు గురి కావడంతో వర్షాకాలం వచ్చిందంటే చాలు మారుతి నగర్, హాజీ నగర్     కాలనీ వాసుల గుండెల్లో రైలు పరిగెడుతుంటాయి. ఏప్పుడు ఏ వర్షం ముంచెత్తిపోతుందో అని భయంగా బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. కాలువ వాగు గురించి ఎన్నిసార్లు పేపర్లో టీవీలలో వార్తలు వచ్చినా అధికారులు చూస్తూ మొహం చాటేస్తున్నారని ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఇంకొన్నాళ్ళకు కాలువ కనపడకుండా పోతుందేమో అని ప్రజలు ఊహించుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు నాయకులు పట్టించుకోని  వాగు లో ఎలాంటి నిర్మాణాలు చేపట్ట కుండా చర్యలు తీసుకోవాలని  స్థానికులు కోరుతున్నారు.

ప్రభుత్వ భూములను కాపాడాలి..

ప్రభుత్వ భూములపై అధికారుల పర్యవేక్షణ కొరవడి పెద్ద సంఖ్యలో భూములు కబ్జాకు గురవుతున్నాయి. ఆక్రమణకు గురైన భూములపై అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకునే పరిస్థితి లేదు. వాగులో అక్రమ నిర్మాణాల పై చర్యలు తీసుకోవాలి. ఉన్నత అధికారులు ప్రత్యేక తీసుకొని ప్రభుత్వ భూములను కాపాడాలి. లేనిపక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున కులసంఘాలు , కాలనీ వాసులు పట్టణ ప్రజలు ఉద్యమాలు చేపట్టే అవకాశం ఉంది.

About Author