వసతి గృహాల్లో తప్పనిసరిగా మెనూ ప్రకారం భోజనం అందించాలి
1 min read– ప్రతి వారం వసతి గృహాల్లో అకాడమిక్ యాక్టివిటీస్ ఉండేలా చర్యలు తీసుకోండి : జిల్లా కలెక్టర్ డా.జి.సృజన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : వసతి గృహాల్లో తప్పనిసరిగా మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందజేయాలి అన్ని సంక్షేమ వసతి గృహాల అధికారులను జిల్లా కలెక్టర్ డా.జి.సృజన ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హల్ లో సంక్షేమ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా నిర్వహిస్తున్న వసతి గృహాల గురించి సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ప్రతాప్ సూర్యనారాయణ రెడ్డి వివరిస్తూ ప్రతి ఆదివారం వసతి గృహాల్లో విద్యార్థులతో పరిశుభ్రంగా ఉంచుకునేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కు వివరించారు. సదరు అంశంపై కలెక్టర్ స్పందిస్తూ దానితో పాటు వసతి గృహాల్లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. బాల్య వివాహాలు జరగకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలన్నారు. ఒక మోటివేషనల్ స్పీకర్ తో కూడా భవిష్యత్తు పట్ల, చదవు, ఉపాధి అవకాశాల పట్ల అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి వసతి గృహాల్లో కూడా ఒక యాక్టివిటీ ఉండేలా ప్లాన్ చేయాలన్నారు. వసతి గృహాల్లో తక్షణ మరమ్మత్తులు చేయాల్సినవి నివేదిక రూపంలో అందజేసినట్లైతే వాటి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. పదవ తరగతిలో తప్పిన విద్యార్థులకు స్పెషల్ రేమెడియల్ క్లాసెస్ ఏర్పాటు చేస్తున్నామని తెలుపగా, సదరు స్పెషల్ రేమెడియల్ క్లాసెస్ కు తప్పనిసరిగా విద్యార్థులు హాజరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎస్సీ సంక్షేమ అధికారి కలెక్టర్ ఆదేశించారు. జగనన్న విద్యా దీవెన సంబంధించి మే 24వ తేదిన నగదు జమ కార్యక్రమం ఉందని అందుకు గాను తల్లి గానీ, విద్యార్థిని కానీ ఈ-కెవైసి పూర్తి చేయాలన్నారు.అనంతరం బీసి కార్పొరేషన్, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ, ఎస్సీ కార్పొరేషన్, బీసి ఈడి కార్పొరేషన్ శాఖలపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో వివిధ శాఖల సంక్షేమ అధికారులు తదితరులు పాల్గొన్నారు.