వైద్యకళాశాల ఏర్పాటుతో.. ఆదోనికి మహర్దశ
1 min read– రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం
పల్లెవెలుగు వెబ్, ఆదోని : ఆదోని – ఎమ్మిగనూరు జాతీయ రహదారి పక్కన ఆరెకల్ విలేజ్ వద్ద 58.44 ఎకరాల విస్తీర్ణంలో రూ. 475 కోట్లతో అత్యాధునిక వసతులతో నిర్మించబోతున్న మెడికల్ కళాశాల నిర్మాణంతో అత్యంత వెనుకబడిన నియోజకవర్గాలు అయినా ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ ప్రజల కల సాకారం అవుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. సోమవారం రాష్ట్రంలో 14 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేశారు. ఆదోని మెడికల్ కాలేజ్ సంబంధించి ఫైలన్ స్టోన్ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పాత్రికేయులతో మాట్లాడారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నారని, ఇది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘనత అన్నారు.
ఆదోని ప్రాంత వాసులు అనారోగ్యానికి గురైతే బళ్లారి, బెంగుళూరు ప్రాంతాలకు వెళ్లి వైద్య చికిత్సలు చేయించుకునే వారిని, మెడికల్ కళాశాల ఏర్పాటుతో ఆదోని ప్రజల కల నెరవేరిందిని, ఆదోని డివిజన్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. పాత్రికేయుల సమావేశంలో ఇంచార్జి కలెక్టర్ రామ సుందర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి గుమ్మనూరు జయరాం, జేసీ–2 (రెవెన్యూ) రాంసుందర్ రెడ్డిని, రైతులను తదితరులను ఘనంగా సన్మానించారు.