పాలీసెట్ లో 86.35% శాతం మంది ఉత్తీర్ణత
1 min read– ఫలితాలు విడుదల చేసిన చదలవాడ నాగరాణి
– మే 29 నుండి వెబ్ కౌన్సిలింగ్, అర్హతా పత్రాల పరిశీలన
– వెబ్ సైట్ లో ఫలితాలు చూసుకుని పత్రికా ప్రకటనే కాల్ లెటర్ గా భావించాలి
పల్లెవెలుగు వెబ్ విజయవాడ: రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి పాలిటెక్నిక్ ప్రవేశానికై నిర్వహించిన పాలీసెట్-2023 ప్రవేశ పరీక్ష ఫలితాలను సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి శనివారం విజయవాడలో విడుదల చేశారు. మొత్తం 1,60,332 విద్యార్ధులకు గాను 1,43,625 విద్యార్ధులు ( 89.58 శాతం) పరీక్షకు హాజరు కాగా అందులో 1,24,021 మంది ( 86.35 శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలురు 88,068 హాజరై, 74,633 మంది (84.74 శాతం) ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 55,557 మంది హాజరై 49,388 మంది (88.9 శాతం) ఉత్తీర్ణత సాధించారు. పాలీసెట్ 2023 లో 120 మార్కులకు గాను 30 మార్కులను ఉత్తీర్ణతగా నిర్ణయించామని, అయితే ఎస్ సి, ఎస్ టి అభ్యర్ధులకు కనీస మార్కుల నిబంధన లేదని ఈ సందర్భంగా నాగరాణి తెలిపారు. ఫలితంగా పాలిసెట్-2023 పరీక్షకు హాజరైన ఎస్ సి, ఎస్ టి అభ్యర్థులు అందరూ అర్హత సాధించినట్లు అవుతుందన్నారు. ర్యాంకింగ్ విధానం గురించి వివరిస్తూ అభ్యర్ధి సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా ర్యాంకులు ఇచ్చామని, మార్కులు సమానంగా పొందిన అభ్యర్ధులకు, గణితంలో వారి మార్కుల ఆధారంగా ర్యాంక్ నిర్ణయించామన్నారు. అప్పటికీ సమానత ఉన్నప్పుడు, భౌతిక శాస్త్ర మార్కుల ఆధారంగా ర్యాంక్ నిర్ణయించ బడిందన్నారు. అప్పటికీ సమాన మార్కులు సాధిస్తే వారికి ఒకే ర్యాంక్ ఇవ్వడం జరిగిందని, వీరికి పుట్టిన తేది, పదవ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా కౌన్సిలింగ్ సమయంలో వారికి తగిన కళాశాలను కేటాయిస్తారని కమిషనర్ వివరించారు . పాలిసెట్-2023 ర్యాంకుల వివరాలను https://polycetap.nic.in వెబ్ సైట్ నుండి పొందవచ్చని, పాలిటెక్నిక్ ప్రవేశానికి సంబంధించిన వెబ్ కౌన్సెలింగ్ మే 29 నుండి నిర్వహిస్తామని, ఇందుకు సంబంధించిన పూర్తి స్థాయి ప్రకటన త్వరలో విడుదల చేస్తామన్నారు. అభ్యర్ధులు ఆ ప్రకటననే కాల్ లెటర్ గా భావించి వెబ్ కౌన్సెలింగ్ కు హాజరు కావాలని, ధృవపత్రాల పరిశీలన, కౌన్సిలింగ్ నిమిత్తం విడిగా ఎటువంటి కాల్ లెటర్ పంపబడదని నాగరాణి స్పష్టం చేశారు. వెబ్ కౌన్సెలింగ్ కు హాజరు కాని అభ్యర్దులు 2023-24 విద్యా సంవత్సరంలో కన్వీనర్ కోటాలో పాలిటెక్నిక్ ప్రవేశానికి అర్హత కోల్పోతారన్నారు. ఈ కార్యక్రమంలో సాంకేతిక విద్యా శాఖ సంయుక్త సంచాలకులు వెలగా పద్మా రావు, రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి కార్యదర్శి కేవీ రమణ బాబు, సంయుక్త కార్యదర్శి డాక్టర్ బి జానకి రామయ్య, ఉప కార్యదర్శి రవి కుమార్, డాక్టర్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.