క్రీడలకు ప్రోత్సాహం అందిస్తాం.. టిజి భరత్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: క్రీడాకారులు తాము ఎంచుకున్న క్రీడలో అంకితభావంతో సాధన చేసి ఉన్నత స్థాయికి చేరుకోవాలని కర్నూల్ అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ టీజీ భరత్ అన్నారు. నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో టీజీవి స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కేపీఎల్ సీజన్ 2 పోటీల ముగింపు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ప్రథమ బహుమతిగా లక్ష రూపాయలు, ద్వితీయ బహుమతిగా 50వేల రూపాయలను అందజేశారు. అనంతరం కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ టీజీ భరత్ మాట్లాడుతూ నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో 25 రోజులపాటు కేపీఎల్ సీజన్ 2 పోటీలను నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. క్రీడాకారులు పోటీల్లో పాల్గొనడమే ప్రధానంగా భావించాలని గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలని సూచించారు. భారతదేశంలో క్రికెట్ ను దైవంతో సమానంగా భావిస్తారని ఆయన తెలియజేశారు. దేశంలో క్రికెట్ ఆంటే ఇష్టపడని వారు దాదాపు ఉండరని క్రికెట్ కున్న ప్రాధాన్యత అలాంటిది అని చెప్పారు. తనకు తెలిసిన వారు ఇటీవల దేశ విదేశాల్లో టి. టెన్ పేరుతో క్రికెట్ పోటీలను నిర్వహించి సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతున్నారని చెప్పారు. కర్నూల్ నగరంలోని ఎవరైనా ప్రతిభ ఉన్న క్రికెట్ క్రీడాకారులను తన దృష్టికి తీసుకువస్తే వారిని ఆ పోటీల్లో ఆడించే విధంగా తన ప్రయత్నం చేస్తానని వివరించారు. కర్నూలు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తాము ఎప్పుడు ముందుంటామని వివరించారు. ప్రతి ఒక్కరూ క్రీడలను సాధన చేయడం ద్వారా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండవచ్చని, జబ్బులు వచ్చి ఆసుపత్రులకు వెళ్లే అవసరం కూడా ఉండదని వివరించారు. క్రీడా పోటీల నిర్వహణకు దాతలు ముందుకు వస్తారని అయితే పోటీలను నిర్వహించే నిర్వాహకులదే కీలక పాత్ర అని వివరించారు. ఈ కార్యక్రమంలో జెం కేర్ కామినెని వైద్యులు డాక్టర్ ఎస్ వి చంద్రశేఖర్ ,పోటీల నిర్వాహకులు పార్థు, హుస్సైన్, సత్య సింగ్, భాస్కర్, మొహిత్, కేశవ్, రాజెస్, వెంకటేశ్, శ్రీధర్, వినోద్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.