PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముఖ్యమంత్రి రాక సందర్భంగా పటిష్ఠ ఏర్పాట్లు : జిల్లా కలెక్టర్

1 min read

– తొలిసారి పత్తికొండకు రాష్ట్ర ముఖ్యమంత్రి రావడం చాలా సంతోషం : పత్తికొండ శాసనసభ్యులు కంగాటి శ్రీదేవి

పల్లెవెలుగు వెబ్  కర్నూలు/పత్తికొండ : కర్నూలు జిల్లా పత్తికొండకు రాష్ట్ర ముఖ్యమంత్రి విచ్చేయనున్న సందర్భంగా పటిష్ఠ ఏర్పాట్లు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన విలేఖరుల సమావేశంలో పేర్కొన్నారు.మంగళవారం పత్తికొండ ఆర్ అండ్ బీ అతిథి గృహంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రాక సందర్భంగా అధికారులతో సమావేశం అనంతరం విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు వైఎస్సార్ రైతు భరోసా నాలుగవ విడతకు సంబంధించి నగదు జమ చేసే రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ఈ నెల 30వ తేదిన కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం నుంచి ప్రారంభించనున్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు. అందుకు గాను ఈ రోజు సభా ప్రాంగణం, హెలిప్యాడ్ కోసం వివిధ ప్రదేశాలను పరిశీలించడం జరిగిందన్నారు. సదరు ప్రదేశాలను సిఎం భద్రతా సిబ్బంది, పోలీసు అధికారులతో సంప్రదించి త్వరితగతిన నిర్ధారణ చేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలను ఏ విధంగా తీసుకొనిరావాలి, వారి అందరికీ ఎటువంటి సౌకర్యాలు అందించాలి, రైతు భరోసా కార్యక్రమం కనుక రైతులకు సంబంధించి వారికి అందజేసే ప్రయోజనాలను స్టాల్స్ రూపంలో ఏర్పాటు చేయడంతో పాటు రైతులకు అందజేస్తున్న సహాయ సహకారాలపై కూడా ప్రదర్శించడం జరుగుతుందన్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరికీ అవసరమైన వైద్య సదుపాయం అందించేలా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా కార్యక్రమానికి హాజరయ్యే ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా జిల్లా అధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించి వారికి బాధ్యతలు అప్పగించడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయడానికి జిల్లా యంత్రాంగం తరఫున కృషి చేస్తామన్నారు. పత్తికొండ శాసనసభ్యులు కంగాటి శ్రీదేవి మాట్లాడుతూ ఈ నెల 30వ తేదిన వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు పత్తికొండ నియోజకవర్గం నుంచి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. హెలిప్యాడ్, సభ ప్రాంగణం ఏర్పాటుకు గాను జిల్లా కలెక్టర్ తో కలిసి సెయింట్ జోసెఫ్ స్కూలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలను పరిశీలించడం జరిగిందని, ఏ స్థలం ఏ దానికి అనేది ఇంకా నిర్ధారణ కావాల్సి ఉందన్నారు. అందులో ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం పర్యటనకు వస్తున్న రోజే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నాలుగు సంవత్సారాలు పూర్తి అవుతుందని, ముఖ్యమంత్రి అయిన తరువాత పత్తికొండ నియోజకవర్గానికి తొలి సారిగా రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా అందరూ కృషి చేయాలన్నారు.

About Author